ప్రధాని టూర్‌.. ఫ్లెక్సీల వార్‌!

ABN , First Publish Date - 2022-07-03T08:42:13+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ప్రచార యుద్ధం మరింత ముదిరింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు చోటు లేకుండా చేసి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసిన టీఆర్‌ఎస్‌..

ప్రధాని టూర్‌.. ఫ్లెక్సీల వార్‌!

  • హైదరాబాద్‌లో ‘మనీ హైస్ట్‌’ వేషధారులు
  • మోదీ రాకను వ్యతిరేకిస్తూ ప్లకార్డుల ప్రదర్శన..
  •  మీరు దేశాన్నే దోచుకుంటున్నారంటూ నిరసన
  • సాలు మోదీ.. సంపకు మోదీ, బైబై మోదీ, 
  • తెలంగాణను అవమానించొద్దంటూ ఫ్లెక్సీలు
  • గో బ్యాక్‌ మోదీ నినాదాలతో ఓయూలో ర్యాలీ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ప్రచార యుద్ధం మరింత ముదిరింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు చోటు లేకుండా చేసి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసిన టీఆర్‌ఎస్‌.. శనివారం అదే పంథా కొనసాగించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ‘మనీహైస్ట్‌’ వెబ్‌సిరీస్‌లోని పాత్రధారుల మాదిరిగా మాస్క్‌లు ధరించిన కొందరు ప్లకార్డులతో నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. ‘‘మేము బ్యాంకులను దోచుకుంటాం.. మీరు మొత్తం దేశాన్నే దోచుకుంటారు’’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. వనస్థలిపురంలోని పంజాబ్‌ నేషనల్‌, కరూర్‌ వైశ్యా, ఐడీబీఐ, ఎస్బీఐ బ్యాంకులు, పెట్రోలు బంకులు, కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద వీరు కనిపించారు. అయితే, ఒకే వ్యక్తి ఆయా ప్రాంతాల్లో తిరిగాడా? లేక ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఇలా చేశారా? అన్నది ఇంకా తేలలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రైల్వే స్టేషన్‌, ఎస్‌బీఐ బ్రాంచ్‌, ఎల్‌ఐసీ కార్యాలయాల వద్ద కూడా ‘మనీహైస్ట్‌’ పాత్రధారి వేషంతో ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఇదిలా ఉండగా, మోదీ రాకను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో శనివారం కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించడం ఆపండి మోదీజీ అంటూ సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే, గుడ్‌ డే బిస్కట్‌ పేరు స్థానంలో అచ్చే దిన్‌ అని ఉండగా.. మోదీకి ఇష్టమైన బిస్కట్‌ అని రాసిన ఫ్లెక్సీలు పలు ప్రాంతాల్లో కనిపించాయి.


 ‘సాలు మోదీ.. సంపకు మోదీ.. బై బై మోదీ’ అన్న ఫ్లెక్సీలు అక్కడక్కడా దర్శనమిచ్చాయి. ఆ తర్వాత వీటిని పోలీసులు తొలగించారు. కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎ్‌స-బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వార్‌ మరింత ముదిరింది. హైదరాబాద్‌లోని కొత్తపేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు మెట్రో పిల్లర్లపై ఇప్పటికే ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రకటన పోస్టర్లపై గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి అనుచరులు బీజేపీ పోస్టర్లను అతికించడం వివాదాస్పదమైంది. విజయ సంకల్ప సభకు విచ్చేస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ మోదీ రాకను నిరసిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. కాగా, తెలంగాణకు స్వాగతమంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటం మాత్రమే ఉన్న ఫ్లెక్సీల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గోబ్యాక్‌ మోదీ అంటూ నినాదాలు చేస్తూ బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-07-03T08:42:13+05:30 IST