సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది!

ABN , First Publish Date - 2022-06-22T10:27:08+05:30 IST

మాజంలోని అన్ని కుటుంబాలకు కనీస అవసరాలను అందుబాటులోకి తేవడమే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రత్యక్ష నగదు బదిలీ...

సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది!

మాజంలోని అన్ని కుటుంబాలకు కనీస అవసరాలను అందుబాటులోకి తేవడమే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రత్యక్ష నగదు బదిలీ, ఉజ్వల, పీఎం ఆవాస యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన లాంటి పథకాలను గమనిస్తే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం చాలా స్పష్టంగా అవగతమవుతుంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అన్న లక్ష్యంతో, కుల, మత, ప్రాంత బేధం లేకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న చిట్టచివరి వ్యక్తి కనీస అవసరాలను తీర్చడంతో పాటు, ఉపాధి, మెరుగైన సామాజిక, ఆర్థిక జీవన విధానాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. 


సమాజంలోని బలహీన వర్గాలు, బాలికలు, మహిళలు, వృద్ధులు, రైతులు, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు, యువత ఇలా అన్ని వర్గాల వారికీ సమతుల అభివృద్ధిని అందించడమే కేంద్ర ప్రభుత్వ ఆశయం. బేటీ బచావో – బేటీ పడావో, అటల్ పెన్షన్ యోజన, జీవన జ్యోతి బీమా యోజన, కృషి యోజన, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గతి శక్తి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్టాండప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, సాగర మాలా, భారత మాలా ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక భౌగోళిక చిత్రపటంపై సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అభివృద్ధి పథంలో ముందుకు సాగడంతో పాటుగా, పరిపాలనలో సాంకేతికతను ఉపయోగించి విశ్వగురువు స్థానాన్ని అందుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది మన దేశం.


అద్భుతమైన విదేశాంగ విధానాల ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేస్తోంది మోదీ ప్రభుత్వం. గడిచిన ఏడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాజీ లేని సంస్కరణలను, కార్యాచరణను అవలంబిస్తోంది. భారత్‌లో ఒకప్పుడు అత్యధికంగా దేశీయ పరిశ్రమ విరాజిల్లింది. కానీ గత పాలకుల నిర్లక్ష్యానికి గురయి, కోట్లాది స్వయంవృత్తుల వారు, చేతివృత్తుల తయారీదారులు ఉపాధిని కోల్పోయారు. కుటీర పరిశ్రమలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఆర్థికంగా మాత్రమే కాకుండా సాంకేతికంగా బలోపేతం చేయడానికి ఆత్మనిర్భర భారత్‌తో సహా ముద్ర యోజన లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాల ద్వారా లక్షలాది మంది మహిళలు, యువత లబ్ధిపొందారు. రక్షణ రంగంతో సహా అన్ని రంగాలలో స్వదేశీ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తూ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భారతదేశాన్ని సర్వశక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతోంది.


సుస్థిర ఆర్థిక అభివృద్ధి, మానవ అభివృద్ధి సాధనలో గ్రామీణ అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో విభిన్న జీవన ఉపాధి అవకాశాలను కల్పించగలిగితే గ్రామీణ పేదరికం తగ్గుతుంది. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడం అన్నది గ్రామీణ పేదరికం, గ్రామీణ అభివృద్ధి సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వైవిధ్య జీవనోపాదుల ద్వారా గ్రామీణుల జీవితాల్లో మార్పు తేవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపైనా దృష్టి సారించింది.


మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించడానికి రూ.1618 కోట్లను ఖర్చు పెట్టి, చాలామటుకు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి కోసం కనీసం 10 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక ఏళ్లకేళ్లు కాలయాపన చేయడంతో, ఎయిమ్స్‌లోని కొన్ని భవనాలు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. అతి తక్కువ ధరలో అత్యున్నత వైద్య చికిత్సను ప్రజలకు అందించే ఎయిమ్స్ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. ఏప్రిల్ 2016లో ప్రారంభించిన ఈ–నాం పథకం 21 రాష్ట్రాల్లో అమలవుతూ, 1000 వ్యవసాయ మండీలలో ఒక కోటి 76 లక్షల రైతులు, 2 లక్షల 24 వేల కొనుగోలుదారులు, 2179 ఎఫ్‌పివోలు నమోదయ్యాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులను కొనుగోలుదారులకు అనుసంధానం చేస్తోంది ఈ పోర్టల్. ఆంధ్రప్రదేశ్‌లోని 33 మండీలలో ఈ–నాం ఉన్నప్పటికీ, చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు, దళారుల కారణంగా పూర్తి స్థాయిలో దీని ప్రయోజనాలు రైతులు పొందలేకపోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో దేశ ప్రజలు క్షుద్బాధను అనుభవించకూడదని భావించి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా 80 కోట్ల మందికి ప్రతినెలా ఐదు కిలోల బియ్యం/గోధుమలు అందించింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. మన రాష్ట్రంలో ప్రతీ నెలా ఒక లక్ష మెట్రిక్ టన్నులకు పైగా అందించింది కేంద్రం. కానీ, ఒక్కటంటే ఒక్క రేషన్ షాప్‌లో కనీసం పథకం పేరు కానీ, ప్రధానమంత్రి ఫోటో కానీ లేకుండా కేవలం ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు, స్టిక్కర్లు పెట్టుకున్నారు. ఈ విషయంపై కేంద్రం రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ మార్పు లేదు.


పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సంకల్పించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో మొదటి విడతలో 15 లక్షలు, రెండవ విడతలో 10 లక్షల ఇళ్లు కట్టడం కోసం ఒక్కొక్క ఇంటికి 1 లక్షా 80 వేల రూపాయలతో మొత్తం 45 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో అరకొర నిధులను కేటాయించి, సరైన సమయంలో ఇళ్ళను పూర్తి చేయలేకపోయింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగా పాతవి పూర్తి చేయకపోగా, నివాసిత ప్రాంతాలకు దూరంగా గుంతలు, గుట్టలు, రాళ్లురప్పలు ఉన్న స్థలాలను కేటాయించింది. ఆ స్థలాలలో కనీస మౌలిక వసతులైన రోడ్డు, కరెంట్, నీరు, డ్రైనేజ్ సదుపాయాలను కల్పించకపోవడం, విపరీతమయిన ఇసుక మాఫియా అవినీతి, ఇంటి నిర్మాణ వస్తువుల ధరల పెరుగుదల కారణంగా వాటి నిర్మాణం కూడా ఆగిపోయింది. ఇప్పటివరకు పూర్తి అయినవి కేవలం 80 వేల ఇళ్లు మాత్రమే. మిగిలిన స్థలాలలో ప్రజలు ఇళ్లు కట్టాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గతంలో ఉన్న ప్రభుత్వమైనా, నేటి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం ఇచ్చే నిధులు తీసుకుంటూ, ప్రజలకు సకాలంలో లబ్ధి చేకూర్చకుండా, ఎన్టీఆర్ హౌసింగ్, చంద్రన్న ఇళ్ళు, జగనన్న కాలనీ అని దర్పంగా పేర్లూ, ఫోటోలతో స్టిక్కర్లు అంటించుకుంటున్నారు.


మన రాష్ట్రంలో దాదాపు 55 లక్షలకు పైగా రైతుల ఖాతాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా సంవత్సరానికి 6 వేల రూపాయలను ఇప్పటికే 11 సార్లు నేరుగా వేసింది కేంద్రం. ఈ మొత్తం 37000 కోట్లకు పైగానే ఉన్నాయి. కానీ ఈ మొత్తాన్ని జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలా ప్రచారం చేసుకుంటోంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, పంచాయితీలకు నిధులు, విద్యాలయాలకు, కళాశాలలకు, ఆసుపత్రులకు, హాస్టళ్లకు, రీసెర్చి సెంటర్లకు, వీధి వ్యాపారస్తులకు, మత్స్య, నైపుణ్య, మహిళా, కుటీర, మధ్యతరగతి, పరిశ్రమ రంగాలకు, స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీలకు నిధులు ఇలా ప్రతీ పథకానికి రాష్ట్రానికి కేంద్ర నిధులు అందుతూనే ఉన్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఐదు లక్షల వరకూ ఉచిత వైద్యం, జన ఔషధీ ద్వారా 90శాతం తక్కువ ధరకే మందుల పంపిణీ, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ నీరు కోసం 50శాతం నిధులను కేంద్రమే భరిస్తున్నా కూడా కేంద్రానికి దక్కాల్సిన ప్రాధాన్యత, ప్రచారం మన రాష్ట్రంలో దక్కడం లేదు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రతీ ఏటా వేలాది కోట్ల రూపాయలను, మిషన్ అభియాన్‌లో భాగంగా మిషన్ పోషణ, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు, బాలింతలకు, మహిళలకు పోషణ నిమిత్తం అంగన్‌వాడి కేంద్రాలకు 60శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. ఇవికాక మహిళల రక్షణ కోసం నిర్భయ, ఇతర పథకాల కోసం వంద శాతం నిధులను, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు తదితరాలకు నిధులను ఇస్తున్నప్పటికీ, కేంద్ర పథకాల పేరు మార్చి, నిధులను దారి మళ్లిస్తున్నారు. గతంలో చంద్రన్న బీమా, చంద్రన్న భరోసా, చంద్రన్న కానుక లాంటి పేర్లు పెట్టుకున్నారు. ఇపుడు జగన్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం పేర్లతో రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకాలకు నిధులను ఇస్తున్నట్టు ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నది. కేంద్రం అడిగిన లెక్కలకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఏనాడూ సరిగ్గా సమాధానం చెప్పలేదు. సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్న చందాన గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయి.


నరేంద్ర మోదీ అకుంఠిత దీక్షతో, పరిపాలనా దక్షతతో నేడు దేశంలో పేదరికం ఒక శాతం కంటే తక్కువగా ఉందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. అన్ని రంగాలలో దేశీయ తయారీని పెంచుతూ, ఒక బలమైన నైపుణ్య భారత్‌ను, శ్రేష్ఠ భారత్‌ను నిర్మిస్తూ కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేలా చర్యలు చేపడుతున్న బీజేపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆదరించే రోజూ అతి త్వరలోనే ఉంది.


సాదినేని యామిని శర్మ

బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి

Updated Date - 2022-06-22T10:27:08+05:30 IST