గల్ఫ్‌లో కలకలం రేపుతున్న ప్రవాసీపై మనీ లాండరింగ్ కేసు..!

Jun 21 2021 @ 15:24PM

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)


తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటిసారిగా ఒక ప్రవాసీయుడి బ్యాంకు లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పరిశీలించి ఆ ఖాతాను స్తంభింపజేయడం గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులలో కలకలం రేపింది. గల్ఫ్ దేశాలలో అనేక మంది భారతీయులు చేసినట్లుగానే ఒక చిన్న పొరపాటు కారణంగా విశాఖపట్టణంలోని సీతమ్మధారకు చెందిన పిన్నింటి సుబ్రమణ్య శ్రీనివాస్‌ చిక్కుల్లో ఇరుక్కున్నారు. మాతృదేశంలో ఈడీ సీజర్‌తో పాటు ఖతర్ న్యాయస్ధానంలో కూడా ఆయన శిక్షపై అప్పీళు నమోదయ్యాయి. తుది తీర్పు వచ్చేంత వరకూ ఆయన మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. కరోనా కారణాన ఖతర్ న్యాయస్ధానంలో గత కొంత కాలంగా విచారణలు జరగకపోవడంతో తుది తీర్పులో జాప్యం జరుగుతోంది. ఆదాయానికి మించిన డబ్బును ఆయన మాతృదేశానికి పంపించారనేది ఆయనపై ప్రధాన అభియోగం. వేతనం కాకుండ ఇతర చోట నుంచి కన్సల్టెన్సీ పేర తీసుకున్న డబ్బే శ్రీనివాస్ కొంప ముంచినట్లుగా తెలుస్తోంది.


శ్రీనివాస్ సుదీర్ఘ కాలంగా గల్ఫ్‌లో పని చేస్తున్నారు. ఖతర్‌కు రాక ముందు ఆయన గల్ఫ్‌లోని ఇతర దేశాలలో పని చేసారు. ఖతర్ ప్రభుత్వ రంగంలోని ఒక సంస్ధ దేశంలోని ఆహార మరియు ఇతర రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్ధలో జనరల్ మేనేజర్ స్ధాయిలో శ్రీనివాస్ పని చేస్తున్నారు. ఖతర్‌కు పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో వైరం ఏర్పడగా ఖతర్‌తో ఈ దేశాలు కొంత కాలం పాటు పూర్తి స్ధాయిలో తమ సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంతో ఆహారం మరియు ఇతర వస్తువుల దిగుమతికు అవరోధం ఏర్పడింది. దేశ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆహార వస్తువులను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం  ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని వస్తువుల కొనుగోళ్ల కోసం ఇచ్చిన ఆర్డర్ల విషయంలో అవకతవకలు జరిగాయని రెండేళ్ళ క్రితం జరిగిన తనఖీలలో తేలింది. ఈ కేసు కారణంగా శ్రీనివాస్‌తోపాటు మరికొందరు ఉద్యోగాలు కోల్పోయారు. వారిపై కేసులు నమోదు చేయగా, ఖతర్ న్యాయస్ధానం శ్రీనివాస్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించింది.


తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పిన శ్రీనివాస్.. క్రింది కోర్టు తీర్పును మహకమా అల్ ఇస్తేనాఫ్ (అప్పీలు కోర్టు)లో సవాలు చేశారు. ఈ అప్పీలును సమీక్షించిన ఉన్నత న్యాయస్ధానం భారతదేశంలో శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఖతర్ నుంచి జరిగిన చెల్లింపులను పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు ఖతర్ విదేశాంగ శాఖ న్యూఢిల్లీలోని ఈడీకి  రోగటరి లెటర్ పంపించింది. దీంతో గత రెండు నెలలుగా ఈడీ అధికారులు విశాఖపట్టణం, ఇతర ప్రాంతాలలో  విచారణ జరిపి 88 లక్షల రూపాయాల మేర శ్రీనివాస్ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తులను స్తంభింపజేసినట్లు సమాచారం. స్తంభించిన వాటిలో 43 లక్షల విలువ చేసే మూడు స్ధిరాస్తులు కూడా ఉన్నాయంటేనే.. గల్ఫ్ ఫిర్యాదును భారత్ ఎంత తీవ్రంగా పరిగణించిందో తెలుస్తోంది.


శ్రీనివాస్ వేతనం, ఇతర అలవెన్సులతో పోలిస్తే 88 లక్షలు ఒక లెక్క కాదని, కాకపోతే సాంకేతికంగా జరిగిన పొరపాటు కారణంగా సమస్య తీవ్ర రూపం దాల్చిందని, న్యాయస్ధానాల పని పునఃప్రారంభమైన తర్వాత అతను నిర్దోషిగా బయటపడతాడని కూడా కొందరు వాదిస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన మరో ప్రముఖుడు, ఒక పారిశ్రామికవేత్త కూడా ఇలాగే ఆర్ధిక నేరాలపై గత కొన్ని సంవత్సరాలుగా ఖతర్ జైలులో మగ్గుతున్నాడు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.