పైసలిస్తేనే రెన్యూవల్‌!

ABN , First Publish Date - 2020-11-10T05:01:06+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి కొందరు ఏజెన్సీ ప్రతినిధులు వసూళ్లు ప్రారంభించారు. ఏడాది కాలం పూర్తికావటంతో సేల్స్‌మెన్లు, సూపర్‌ వైజర్లు రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంది. మరో ఏడాది పాటు పనిచేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనంటూ వారిపై కొందరు వ్యక్తులు ఒత్తిడి తెస్తున్నారు.

పైసలిస్తేనే రెన్యూవల్‌!
మద్యం దుకాణం


ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ప్రతినిధులమంటూ వసూళ్లు

మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారి నుంచి డిమాండ్‌

నిరాశలో సేల్స్‌మెన్లు, సూపర్‌ వైజర్లు 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి కొందరు ఏజెన్సీ ప్రతినిధులు వసూళ్లు ప్రారంభించారు. ఏడాది కాలం పూర్తికావటంతో సేల్స్‌మెన్లు, సూపర్‌ వైజర్లు రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంది. మరో ఏడాది పాటు పనిచేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనంటూ వారిపై కొందరు వ్యక్తులు ఒత్తిడి తెస్తున్నారు. అలా అయితేనే బాండ్‌ పేపర్‌పై సంతకం ఉంటుందని బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు రెన్యూవల్‌ కాకపోవటంతో ప్రస్తుతం అక్టోబరు నెలకు సంబంధించిన జీతం కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో మద్యం దుకాణాల సిబ్బంది తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

ప్రభుత్వ గతేడాది సెప్టెంబరు 29న మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు సిబ్బంది నియామకాన్ని చేపట్టింది. బేవరేజ్‌ కార్పొరేషన్‌ ద్వారా వీరి నియామకాన్ని చేపట్టింది. నోటిఫికేషన్‌ జారీ.. దరఖాస్తుల ఆహ్వానం.. నియామకం తదితర ప్రక్రియంతా కార్పొరేషన్‌ ద్వారానే చేపట్టారు. అంతేకాకుండా నాలుగు నెలల పాటు జీతాలను కూడా ట్రెజరీ ద్వారా కార్పొరేషన్‌ చెల్లించింది. ఆ తరువాత ప్రభుత్వం ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీలోకి వారిని బదలాయించింది. అప్పటినుంచి జీతాలు కూడా ఏజెన్సీ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందిని ఇటీవలే ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ గొడుగు కొందకు తీసుకువచ్చింది. అయితే బేవరేజ్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న సేల్స్‌మెన్లు, సూపర్‌ వైజర్లను మాత్రం ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించింది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా సిబ్బంది విధుల్లో చేరి ఏడాది కావటంతో మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది. ఇదే అదనుగా ఏజెన్సీ ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి సిబ్బంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారికి బాండ్‌ పేపర్‌పై రెన్యువల్‌ చేయటం జరగదంటూ బెదిరింపులకు దిగుతున్నారు.  ఏం చేయాలో తోచక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సూపర్‌ వైజర్లు, సేల్స్‌మెన్ల నుంచి రూ.7500 డిమాండ్‌ చేస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సిబ్బంది తెలిపారు. సూపర్‌వైజర్లకు నెలకు జీతంగా రూ.17500, సేల్స్‌మెన్లకు రూ.15వేలు చొప్పున చెల్లిస్తున్నారు. తమకు వచ్చే ఒక నెల జీతంలో సగం జీతం రెన్యువల్‌ కోసం చెల్లిస్తే కుటుంబాలను ఎలా నెట్టుకు వస్తామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కార్పొరేషన్‌ ద్వారా రిక్రూట్‌చేసి మళ్లీ ఏజెన్సీకి అప్పగించడం అన్యాయమని వాపోతున్నారు. ఇదివరకు ప్రతి నెలా 30 లేదా 31న జీతాలు అందేవి. ఈ నెల 9వ తేదీ వచ్చినా ఇంతవరకు అక్టోబరు నెల జీతం చెల్లించలేదు. ఆయా ఏజెన్సీ ప్రతినిధులను కొంత మంది సిబ్బంది డబ్బులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే చాలా ఖర్చులున్నాయని, వాటిని అధిగమించాలంటే చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 142 ప్రభుత్వ మద్యం షాపులున్నాయి. ప్రతి షాపులో ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు సేల్స్‌మన్లు చొప్పున పనిచేస్తున్నారు. వారందరి నుంచి భారీగా దండేసే పనిలో ఏజెన్సీ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. 


ఏజెన్సీ చూసుకుంటుంది..

వసూళ్ల విషయాన్ని నెల్లిమర్లలోని బేవరేజ్‌ డిపో మేనేజర్‌ సుధీర్‌ వద్ద ప్రస్తావించగా సిబ్బంది ఎంపిక, నియామకాలు బేవరేజ్‌ కార్పొరేషన్‌ ద్వారా జరిగాయన్నారు. తరువాత వారిని ఏజెన్సీకి అప్పగించామని, ప్రస్తుతం ఏజెన్సీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని చెప్పారు. రెన్యువల్‌ కోసం డబ్బులు వసూలు చేస్తున్న విషయం తనకు తెలియదని, డబ్బుల వసూలు విషయాన్ని ఏజన్సీ చూసుకుంటుందని, సిబ్బంది సక్రమంగా పనిచేయకపోయినా, అక్రమాలకు పాల్పడ్డా చర్యలు తీసుకునే బాధ్యత తమదని చెప్పారు. 



Updated Date - 2020-11-10T05:01:06+05:30 IST