Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలవరం...high alert

ABN , First Publish Date - 2022-07-20T16:47:51+05:30 IST

కేరళ రాష్ట్రంలో మంకీపాక్స్ కేసు వెలుగుచూడటంతో ఆ రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు....

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలవరం...high alert

తిరువనంతపురం(కేరళ): కేరళ(kerala) రాష్ట్రంలో మంకీపాక్స్(Monkeypox) కేసు వెలుగుచూడటంతో ఆ రాష్ట్రంలో హైఅలర్ట్(high alert) ప్రకటించారు.ఇతర దేశాల నుంచి విమానాశ్రయాలు, ఓడరేవులకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరినీ క్షుణ్ణంగా పరీక్షించాలని(testing) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి, అలసట, శోషరస కణుపుల వాపు, ముఖం, శరీరంలోని ఇతర ప్రాంతాలపై దద్దుర్లు రావడం మంకీపాక్స్ లక్షణాలని వైద్యులు చెప్పారు. 1958వ సంవత్సరంలో మంకీపాక్స్ వైరస్ కనుగొన్నారు.ఈ వైరస్ పై అధ్యయనం కోసం ఉంచిన ల్యాబ్ కోతుల్లో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి కనిపించింది.దీంతో ఈ వైరస్ కు మంకీ పాక్స్ అని పేరు పెట్టారు.



మంకీపాక్స్ ఎలా సంక్రమిస్తుంది?

మంకీపాక్స్ అంటువ్యాధి అని, దద్దుర్లు, స్కాబ్‌లు లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఉండటం వల్ల ఇది వ్యాపిస్తుందని వైద్యులు చెప్పారు. సుదీర్ఘ శ్వాసకోశ స్రావాల ద్వారా, చర్మం నుంచి చర్మానికి సంపర్కం జరిగినపుడు, భాగస్వాముల మధ్య శారీరక సాన్నిహిత్యం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని పల్మోనాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ అమిత్ పి గావ్ండే చెప్పారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఉపయోగించే బట్టలు, వస్తువులను తాకడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఎలుకలు లేదా చనిపోయిన జంతువులు, కోతుల కాటు ద్వారా సంక్రమించవచ్చునని వైద్యులు చెప్పారు.



ముందు జాగ్రత్తలే ముఖ్యం

మంకీపాక్స్ వైరస్ అనుమానం ఉన్న రోగులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం మంచిదని పిడియాట్రిక్స్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్ డాక్టర్ తనూ సింఘాల్ చెప్పారు. సాధారణంగా ఈ వైరస్ విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్న రోగుల్లో కనిపిస్తుంది.మంకీ పాక్స్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, అది వ్యాపించకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని డాక్టర్ అమిత్ పి గావ్ండే సూచించారు. పేషెంట్‌తో సంబంధం ఉన్న ఎవరైనా లేదా దద్దుర్లు ఉన్న వ్యక్తులను కలిసే వారు స్పర్శ సంబంధాన్ని నివారించాలని కోరారు.ఈ వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం లేదా సన్నిహిత సాన్నిహిత్యం నుంచి దూరంగా ఉండాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-07-20T16:47:51+05:30 IST