Monkeypox : హెచ్‌ఐవీ కారణంగా మంకీపాక్స్‌ రోగి ముక్కు కుళ్లిపోయింది.. జర్మనీలో అసాధారణ కేసు..

ABN , First Publish Date - 2022-08-19T02:07:12+05:30 IST

హెచ్‌ఐవీ(HIV) కారణంగా మంకీపాక్స్(Monkeypox) పేషెంట్ ముక్కు కుళ్లిపోవడం(Nose Rot) ప్రారంభమైన అసాధారణ ఘటన జర్మనీలో వెలుగుచూసింది.

Monkeypox : హెచ్‌ఐవీ కారణంగా మంకీపాక్స్‌ రోగి ముక్కు కుళ్లిపోయింది.. జర్మనీలో అసాధారణ కేసు..

బెర్లిన్ : హెచ్‌ఐవీ(HIV) కారణంగా మంకీపాక్స్(Monkeypox) పేషెంట్ ముక్కు కుళ్లడం(Nose Rot) ప్రారంభమైన అసాధారణ ఘటన జర్మనీలో వెలుగుచూసింది. 40 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఈ అరుదైన పరిస్థితి ఎదురైంది. తొలుత బాధిత వ్యక్తికి ముక్కు కొనన చిన్న ఎర్రటి బొబ్బ ఏర్పడింది. వైద్యులను సంప్రదించగా తీవ్ర ఎండల ప్రభావం అయ్యి ఉంటుందని భావించారు. కానీ 3 రోజుల తర్వాత బాధిత వ్యక్తి పరిస్థితి ఊహించని రీతిలో మారిపోయింది. ముక్కు బాగా వాచిపోయి నల్లటి రంగులో పైకిపొక్కింది. షాక్‌కు గురైన వైద్యులు పేషెంట్‌కి పీసీఆర్ టెస్ట్ చేయగా హెచ్‌ఐవీతోపాటు మంకీపాక్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ’సింఫిలిస్’ కూడా నిర్ధారణ అయ్యాయి. ఈ కారణంగా అతడి ముక్కు భాగానికి ‘నెక్రోసిస్’ అనే వ్యాధి వచ్చింది. అంటే శరీర కణాలు చనిపోవడమని, జర్మనీ వ్యక్తికి వచ్చిన వ్యాధి ఇదేనని, ఇలా జరగడం అత్యంత అరుదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే ముక్కు కుళ్లిపోవడం మొదలైందని వివరించారు. ఈ కేసు వివరాలు జర్నల్ ‘ఇన్ఫెక్షన్’లో ప్రచురితమయ్యాయి. అయితే బాధిత వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచారు. కాగా బాధితుడి ముక్కు చూడలేనంత స్థితిలో ఉంది.


వైద్యులను సంప్రదించిన 3 రోజుల తర్వాత నుంచి బాధిత వ్యక్తి ముక్కు శరీర కణాలు చనిపోవడం ప్రారంభమైందని, అందుకే ముక్కు భాగమంతా కుళ్లిపోయినట్టు నల్లగా మారిపోయిందని ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తున్న ‘7న్యూస్’ రిపోర్ట్ పేర్కొంది. ఇన్ఫెక్షన్ కారణంగా శరీర కణాలు చనిపోయాయని తెలిపింది. త్వరలోనే బాధిత వ్యక్తి శరీరమంతా తెల్లటి బొబ్బలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నట్టు వివరించింది. 


కాగా బాధిత వ్యక్తి ముక్కు పాక్షికంగా మాత్రమే మెరుగయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. హెచ్‌ఐవీకి చికిత్స తీసుకోకపోవడంతో అతడి రోగ నిరోధ శక్తి సన్నగిల్లిపోయిందని, నెక్రోసిస్ వ్యాధి రావడానికి కారణం ఇదేనని వివరించారు. ఇలాంటి కేసు చాలా అరుదన్నారు. కాగా మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇప్పటివరకు స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నియంత్రిత స్థాయిలోనే ఉంటే మంకీపాక్స్ పేషెంట్ పెద్దగా రిస్క్ ఏమీ లేదని వైద్య నిపుణులు ఈ సందర్భంగా చెబుతున్నారు. 

Updated Date - 2022-08-19T02:07:12+05:30 IST