ప్రభుత్వ నిర్ణయంతో గుత్తాధిపత్యం

ABN , First Publish Date - 2022-06-29T08:30:06+05:30 IST

ప్రభుత్వ నిర్ణయంతో గుత్తాధిపత్యం

ప్రభుత్వ నిర్ణయంతో గుత్తాధిపత్యం

తమ గేట్‌వే ద్వారానే టికెట్లు విక్రయించాలనడం సరికాదు

ఈ నిర్ణయం ప్రైవేటు వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీస్తుంది

బుక్‌మై షో తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సింఘ్వీ

విచారణ నేటికి వాయిదా


అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ద్వారా టికె ట్లు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం వల్ల ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించే ప్రైవేటు సంస్థల వ్యాపారం ప్రమాదంలో పడుతుందని, ప్రభుత్వ నిర్ణయం గుత్తాధిపత్యానికి దారితీస్తుందని బుక్‌ మైషో తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వమే నేరుగా ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేందుకు గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ బిగ్‌ ట్రీ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ అన్నోజ్‌వాలా హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ చట్టం (యాక్ట్‌ 12/2021) ద్వారా టికెట్ల విక్రయ ఫ్లాట్‌ఫామ్‌ను ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ కార్పోరేషన్‌కి అప్పగిస్తూ గతేడాది డిసెంబరు17న జారీచేసిన జీవో 142ను సవాల్‌ చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫెడరేషన్‌ తరఫున మంజీత్‌ సింగ్‌, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా బుక్‌ మైషో తరఫున అభిషేక్‌ సింఘ్వీ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. మంగళవారం కోర్టు సమయం ముగియడంతో మల్టీప్లెక్స్‌ యాజమాన్యాల తరఫు వాదనల కోసం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా బుక్‌ మైషో తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వమే నేరుగా టికెట్లు విక్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తమను కూడా ఏపీఎ్‌స్‌ఫటీడీసీసీ రూపొందించే వెబ్‌సైట్‌ ద్వారానే టికెట్లు విక్రయించాలని కోరడం సరికాదని అన్నారు. ఒక వైపు పోటీదారుగా తమతో పాటు టికెట్లు విక్రయించేందుకు రెడీ అవుతూ, విక్రయించిన ప్రతీ టికెట్‌పై సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాలని నిబంధన పెట్టి.. మరోవైపు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా చేసుకున్న ప్రతీ టికెట్‌పై రూ.2 సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించాలని ప్రభుత్వం కోరుతుందని, ఆ కారణంగా ప్రేక్షకులపై అదనంగా భారం వేయాల్సి వస్తుందని చెప్పారు. దీనివల్ల కాలక్రమేణా తమ వ్యాపారం దెబ్బతింటుందన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో టికెట్లు విక్రయించేందుకు ప్రభుత్వం వద్ద తగిన వ్యవస్థ లేదని, ఆ వ్యవహారాన్ని ప్రైవేటు సంస్థల చేతులోనే పెడుతోందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం గుత్తాధిపత్యానికి దారితీయడమే కాకుండా, పిటిషనర్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందన్నారు. జూలై 2 నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ విధానాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... భాగస్వామలు అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ విధానం వల్ల టికెట్ల విక్రయంలో పారదర్శకత పెరుగుతుందన్నారు. బుక్‌ మై షో తదితర సంస్థలు యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చన్నారు. అయితే ఏపీఎ్‌స్‌ఫటీడీసీసీ రూపొందించే వెబ్‌సైట్‌ గేట్‌ వే ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 1180 థియేటర్లకు సంబంధించిన టికెట్లను బుక్‌ మైషో విక్రయిస్తోందని, అందులో 380 థియేటర్ల యాజమాన్యాలతో నేరుగా ఒప్పందం చేసుకుందన్నారు. ప్రతీ టికెట్‌పై 14 నుంచి 17 శాతం కన్వేయన్స్‌ చార్జి వసూలు చేసి.. ఆ సొమ్ములో కొంతభాగాన్ని థియేటర్‌ యాజమాన్యాలకు చెల్లిస్తున్నారన్నారు. ఏపీఎ్‌స్‌ఫటీడీసీసీ ద్వారా టికెట్లు కొనేగోలు చేస్తే వినియోగదారుడు టికెట్‌ ధరతో పాటు రూ.2 సర్వీస్‌ టాక్స్‌ చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాన్ని కొంతకాలం పరిశీలించాలని కోరారు. ఈ సమయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర్థించారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా విక్రయించే టికెట్‌పై రూ.2 మాత్రమే వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆమేరకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. టికెట్ల విక్రయం విషయంలో జులై 2లోగా ఒప్పందం చేసుకోవాలని మల్టీప్లెక్స్‌ థియేటర్‌ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందన్నారు. అంగీకరించకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని బెదిరిస్తోందన్నారు. ఒప్పందాల కోసం ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏజీ బదులిస్తూ.. 80 శాతం థియేటర్‌ యాజమాన్యాలకు బి లైసెన్సులు లేవన్నారు. ఆ వాదనలపై సీనియర్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందు ఉంచాలని కోరారు.


Updated Date - 2022-06-29T08:30:06+05:30 IST