సగం స్వాహా..

ABN , First Publish Date - 2022-06-13T16:12:04+05:30 IST

ఎమర్జెన్సీ, మొబైల్‌, స్టాటిక్‌.. ఇవి మాన్‌సూన్‌లో వరదల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే ప్రత్యేక బృందాలు. కాగితాల్లో మాత్రమే ఉండే ఈ టీంలు క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించవు.

సగం స్వాహా..

గ్రేటర్‌లో మాన్‌సూన్‌ మాయాజాలం

బృందాల పేరిట దోపిడీ

స్టాటిక్‌, మొబైల్‌, ఎమర్జెన్సీ అంటూ 260-300 టీంలు రంగంలోకి..

ఏటా రూ.25-30 కోట్లు ఖర్చు

క్షేత్రస్థాయిలో కనిపించని వైనం

ఎక్కడి వరద నీరు అక్కడే..


హైదరాబాద్‌ సిటీ: ఎమర్జెన్సీ, మొబైల్‌, స్టాటిక్‌.. ఇవి మాన్‌సూన్‌లో వరదల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే ప్రత్యేక బృందాలు. కాగితాల్లో మాత్రమే ఉండే ఈ టీంలు క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించవు. ఎందుకంటే ప్రత్యేక బృందాలు, పనుల పేరిట పైసలు వెనకేసుకోవడం కొందరికి అలవాటుగా మారింది. వాహనాల ఏర్పాటుతోపాటు.. గుంతల పూడ్చివేత, ప్యాచ్‌వర్క్‌లు, వరద నీటి డ్రైన్‌లకు మూతలు అమర్చడం నుంచి కూలిన/విరిగిపడిన చెట్ల కొమ్మల తొలగింపు వరకు ప్రతి దాంట్లో దోపిడీనే.  చేయని పనులు చేసినట్టు బిల్లులు పొందడంలో ఘనులైన ఇంజనీరింగ్‌ విభాగంలోని కొందరు అధికారులు మాన్‌సూన్‌ వస్తోందంటే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. మాన్‌సూన్‌ దోపిడీలో జోనల్‌ నుంచి కేంద్ర కార్యాలయం వరకు కొందరు ఉన్నతాధికారులకు వాటాలు అందుతుండడంతో, ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయా, లేదా..? అన్నది వారు పట్టించుకోరని ప్రచారం జరుగుతోంది. 


అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి..

వర్షాకాలం రానున్న నేపథ్యంలో డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. ఒకటి, రెండు డివిజన్లు మినహా మెజార్టీ సర్కిళ్లలో ఏజెన్సీల ఎంపిక దాదాపుగా పూర్తయ్యింది. వర్షాకాలం మొదలు కాకున్నా.. మాన్‌సూన్‌ బృందాలు మాత్రం అక్కడక్కడా రోడ్లపై కనిపిస్తున్నాయి. ఈ యేడాది 260-300 వరకు బృందాలను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. నగరంలోని 160కిపైగా ప్రాంతాల్లో రోడ్లపై నిలిచే వరద నీరు వాహనాల రాకపోకలకు అంతరాయంగా మారుతుంది. ఈ సమస్యకు తక్షణ, తాత్కాలిక పరిష్కారంగా.. నిలిచిన నీటిని తొలగించేందుకు 100-120కి పైగా స్టాటిక్‌ లేబర్‌ టీంలు నియమిస్తున్నట్టు చెబుతున్నారు. ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో కేటాయించిన ప్రాంతాల్లో బృందాలు పని చేయాల్సి ఉంటుంది. క్యాచ్‌పిట్ల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారం, ప్రీ కాస్ట్‌ డివైడర్ల వద్ద నీటిని తొలగించడం వీరి పని. కొన్ని ప్రధాన రహదారులు మినహా ఎక్కడా ఈ టీంలు కనిపించవు. పలు ప్రాంతాల్లో భారీగా నిలిచే నీటిని మోటార్లతో పంప్‌ చేసేందుకు, విరిగిన చెట్ల కొమ్మలు, ఇతరత్రా వ్యర్థాలు తొలగించేందుకు మినీ మొబైల్‌, మొబైల్‌ బృందాలు 150కిపైగా అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా ఉండేది 100లోపే.  జోన్ల వారీగా అత్యవసర బృందాలూ ఉంటాయని చెబుతారు. వీరు ఏం చేస్తారో అధికారులకు కూడా తెలియదు. 


మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట ఏటా జీహెచ్‌ఎంసీ యేటా రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కోట్లు వెచ్చిస్తోన్నా.. సగానికిపైగా మాన్‌సూన్‌ బృందాలు క్షేత్రస్థాయిలో కనిపించవు. ఎప్పటిలానే ఈ దఫా అధికారులు ప్రతిపాదించిన వ్యయం కంటే తక్కువకే ఏజెన్సీలు పని చేసేందుకు ముందుకు వచ్చాయి. 30 శాతానికిపైగా తక్కువకు బిడ్‌లు దాఖలు చేశాయి. నిర్ణీత స్థాయిలో కార్మికులను నియమించకున్నా.. బిల్లులు పొందే అవకాశం ఉండడం వల్లే లెస్‌కు బిడ్‌లు దాఖలు చేస్తారని ఓ అధికారి చెప్పారు. మాన్‌సూన్‌ టీంల ఖర్చులో 50 శాతం కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తుందన్న ఆరోపణలున్నాయి. 


ఐదు నెలలు.. అప్పుడప్పుడే పని..

జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఐదు నెలల కోసం మాన్‌సూన్‌ టీంలను నియమిస్తున్నారు. వాస్తవంగా వర్షాలు పడినప్పుడే ఈ బృందాలకు పని ఉంటుంది. మిగతా సమయంలో దాదాపు ఖాళీనే. నాలుగు నెలల వర్షాకాలం సీజన్‌లో బృందాలు పని చేయాల్సింది గరిష్ఠంగా 20, 30 రోజులకు మించి ఉండదు. అది కూడా వర్షం కురిసిన ఆ రెండు, మూడు గంటలే. ఆ స్వల్పకాలమూ సక్రమంగా పని చేయించే పరిస్థితి జీహెచ్‌ఎంసీలో లేదు. మాన్‌సూన్‌లో రోడ్లపై గుంతలు పూడ్చే మొబైల్‌ బృందాలు మాత్రమే అక్కడక్కడా కనిపిస్తుంటాయి. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌) బృందాలున్నా, కూలిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించేందుకు ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అదనంగా మొబైల్‌ వెహికిల్‌ టీంలను అందుబాటులో ఉంచేందుకు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. మొత్తంగా కొందరు ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు.. వర్షాకాలం పేరిట కోట్లు కొల్లగొట్టే ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నారు. దోపిడీ గురించి తెలిసినా, ఎవరూ ఈ విషయాన్ని అంత సీరియ్‌సగా తీసుకోకపోవడం గమనార్హం. 

Updated Date - 2022-06-13T16:12:04+05:30 IST