జీఎస్టీపై రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ

ABN , First Publish Date - 2021-11-02T07:50:00+05:30 IST

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సమగ్రంగా సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2022 జూలై నుంచి రాష్ట్రాలకు ఆర్థిక చిక్కులు సంభవించే పరిస్థితి రానున్నది....

జీఎస్టీపై రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సమగ్రంగా సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2022 జూలై నుంచి రాష్ట్రాలకు ఆర్థిక చిక్కులు సంభవించే పరిస్థితి రానున్నది. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న ఒక ప్రధాన సమస్య. వస్తుసేవల పన్ను అమలును 2017లో ప్రారంభించినప్పుడు ఈ కొత్త పన్నుల వ్యవస్థ వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదు సంవత్సరాల వరకు నష్టపరిహారంగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హామీ ఇచ్చింది. జీఎస్టీ వసూళ్లు ఏడాదికి కనీసం 14 శాతం చొప్పున పెరుగుతాయనేది ఒక అంచనా. ఆ ప్రకారం జీఎస్టీ నుంచి ఏటా 14 శాతం అధికంగా పొందే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. జీఎస్టీ వసూళ్లు వాస్తవంగా ఏ‍ స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్రాలకు 14 శాతం వాటా అదనంగా ఇచ్చి తీరాలి. 


దేశీయ వాణిజ్యాన్ని జీఎస్టీ రెండు అంశాలలో నిజంగా సరళ తరం చేసింది. ఒకటి- సరుకుల వర్గీకరణ దేశ వ్యాప్తంగా ప్రమాణీకరించబడింది. గతంలో క్రాప్ట్ పేపర్‌ను ఒక రాష్ట్రంలో ‘కాగితం’గా, మరొక రాష్ట్రంలో ‘ప్యాకింగ్ సామాను’గా వర్గీకరించేవారు. దీనివల్ల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో పన్ను సంబంధిత వివాదాలు ఏర్పడేవి. జీఎస్టీతో అలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండాపోయింది. సరుకులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రవాణా చేసేందుకు జారీ చేసే ‘సి’ ఫామ్స్ విధానం కూడా జీఎస్టీతో రద్దయింది. సరుకుల రవాణా ఇప్పుడు స్వేచ్ఛగా, సాఫీగా సాగిపోతోంది. అయితే దీనివల్ల రాష్ట్రాలు ఒక భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. పన్నుల విధింపులో తమ స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకోవల్సిరావడమే ఆ భారీ మూల్యం. 


పన్నుల వ్యవస్థ విషయంలో కెనడా, అమెరికా నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవలసి ఉంది. కెనడాలో ఫెడరల్ ప్రభుత్వం విధించే జీఎస్టీతో పాటు వివిధ రాష్ట్రాలు విభిన్న రేట్ల అమ్మకం పన్నును కూడా వసూలు చేస్తాయి. ఉదాహరణకు అల్బెర్టా రాష్ట్రంలో కేవలం 5 శాతం ఫెడరల్ జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తారు. బ్రిటిష్ కొలంబియాలో 5 శాతం ఫెడరల్ జీఎస్టీతో పాటు 7 శాతం అమ్మకం పన్నును కూడా వసూలు చేస్తారు. ఆంటారియో రాష్ట్రంలో ఫెడరల్, రాష్ట్ర పన్నుల మేళవింపుతో 13 శాతం జీఎస్టీ 13 శాతాన్ని వసూలు చేస్తారు. అయినప్పటికీ కెనడాలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులను రవాణా చేయడంలో ఎటువంటి సమస్యలు తలెత్తడం లేదు. ‘సి’ ఫామ్ జారీ చేయవలసిన అవసరమేమీ లేదు. సరుకుల వర్గీకరణను ప్రమాణీకరించడం, ఆ వర్గీకరణ అన్ని రాష్ట్రాలకు వర్తించడంతో పాటు పన్నురేట్లను నిర్ణయించుకునే స్వతంత్ర ప్రతి పత్తి కూడా రాష్ట్రాలకు ఉండడమే అందుకు ప్రధాన కారణం. కెనడాలో సరుకుల వర్గీకరణకు అనుసరిస్తున్న విధానంపై కూడా ఎటువంటి వివాదాలు లేవు. అమ్మకం జరుగుతున్న ప్రదేశంలో వర్తించే రేటు ఆధారంగా సరుకులపై జీ ఎస్టీని ప్రతి విక్రేత వసూలు చేసుకోగలుగుతాడు. ఉదాహరణకు అల్బెర్టాలోని ఒక తయారీదారుడు 13 శాతం సంయుక్త జీఎస్టీని ఆంటారియా లోని ఒక కొనుగోలుదారుడి నుంచి వసూలు చేసుకోగలుగుతాడు. అదే అల్బెర్టాలోని కొనుగోలుదారుడి నుంచి అతనికి లభించేది 5 శాతం జీఎస్టీనే. ఇటువంటి విధానం వల్ల విభిన్న జీఎస్టీ రేట్లు విధించేందుకు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి భరోసా సమకూరుతుంది. సరుకులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి స్వేచ్ఛగా రవాణా అవుతుంటాయి. ఏ రాష్ట్రంలోని జీఎస్టీని ఆ రాష్ట్రంలో చెల్లించవలసివుంటుంది. అమెరికా విషయానికి వస్తే ఆ దేశంలో జీఎస్టీ అనేదే లేదు. ప్రతి రాష్ట్రమూ తన సరిహద్దుల పరిధిలో అమ్మకం పన్ను రేట్‌పై సొంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి వున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే అసలు అమ్మకం పన్నును విధించవు. ఆ రాష్ట్రాల ఆదాయమంతా ఆదాయ పన్ను వసూళ్ల నుంచి సమకూరుతుంది. మరి కొన్ని రాష్ట్రాలలో వేర్వేరు అమ్మకం పన్ను రేట్లు అమల్లో ఉంటాయి. అయితే సరుకుల రవాణా నిర్నిబంధంగా జరుగుతుంది. ఏకీకృత జీఎస్టీని విధించనవసరం లేకుండా సరుకుల స్వేచ్ఛా రవాణా లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చో కెనడా, అమెరికా విధానాలు తేటతెల్లం చేస్తున్నాయి. 


వస్తుసేవల పన్ను ద్వారా లభించే ఆదాయం అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని పొందే హక్కు రాష్ట్రాలకు ఉంది. ఈ హక్కుకు గల కాల పరిమితి 2022 జూన్‌తో ముగుస్తుంది. అప్పుడు రాష్ట్రాలకు అనివార్యంగా భారీ నష్టం వాటిల్లుతుంది. నష్టపరిహారం హక్కును కోల్పోయినప్పుడు రాష్ట్రాలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం తప్పనిసరిగా చొరవ తీసుకోవాలి. 


మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయే అవకాశముంది. ఉద్యోగుల వేతన భత్యాలలో భారీ కోత విధించాల్సిన అగత్యమేర్పడుతుంది. రోడ్లు, ఇతర మౌలికసదుపాయాల అభివృద్ధికి వెచ్చించే మూల ధన పెట్టుబడులను కుదించుకోవడమూ రాష్ట్రాలకు అనివార్యమవుతుంది. ఈ సంభావ్య పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని కెనడా, అమెరికాలలో వలే మన రాష్ట్రాలు కూడా జీఎస్టీని విభిన్న రేట్లలో వసూలు చేసుకునేలా వస్తుసేవల పన్ను వ్యవస్థలో మార్పులుచేసే విషయాన్ని మంత్రుల బృందం విధిగా పరిశీలించాలి. జీఎస్టీలో మార్పుల వల్ల సరుకుల రవాణా స్వేచ్ఛగా జరిగేందుకు ఆస్కారం కలిగించాలి. ఇదే సమయంలో రాష్ట్రాలు తమ అవసరాలు, అంచనాలకు అనుగుణంగా జీఎస్టీని వసూలు చేసుకోవడానికి అనుమతించాలి. జీఎస్టీలో మార్పులు చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక ఉమ్మడి కుటుంబ పెద్ద నిక్కచ్చి మనిషి అనుకుందాం. కుటుంబ సభ్యులకు అతడు ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వడు. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం విచ్ఛిన్నమవడం అనివార్యం. నష్ట పరిహారం చెల్లించకుండాను, రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వకుండాను తాము నిర్దేశించిన వస్తుసేవల పన్నును అమలుపరిచితీరాల్సిందేనని కేంద్రం పట్టు బడితే జరిగేదేమిటి? రాష్ట్రాలు సమాఖ్య నుంచి వైదొలిగే ఆలోచన చేయవచ్చు. ఇదే జరిగితే దేశం విచ్ఛిన్నం కాకుండా ఉంటుందా?


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-11-02T07:50:00+05:30 IST