UK Universities కి క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు.. ఆ Visa విషయంలో తీసుకున్న నిర్ణయంతో..

ABN , First Publish Date - 2022-06-28T21:40:01+05:30 IST

విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు ప్రస్తుతం బ్రిటన్‌కు(Britain) క్యూకడుతున్నారు.

UK Universities కి క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు.. ఆ Visa విషయంలో తీసుకున్న నిర్ణయంతో..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు ప్రస్తుతం బ్రిటన్‌కు(Britain) క్యూకడుతున్నారు. భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ తాజా లెక్కల ప్రకారం.. మార్చి 2022తో ముగిసిన సంవత్సరంలో మొత్తం 108,000 మంది భారతీయులకు స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి. అంతకుమునుపు సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలు. బ్రిటన్ యూనివర్శిటీల(UK universities) పట్ల భారతీయుల్లో ఆసక్తి పెరగడం తమకు ఎంతో ఆనందాన్నిస్తోందని బ్రిటన్ యూనివర్శిటీల ఐక్యవేదిక యూనివర్శిటీస్ యూకే ఇంటర్నేషనల్(Universities UK international) డైరెక్టర్ వీవియన్ స్టర్న్ తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్ పట్ల ఇండియన్ విద్యార్థులు మొదటి నుంచి ఆసక్తి చూపుతున్నా ఇటీవల కాలంలో బ్రిటన్ స్టూడెంట్  వీసా పొందుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని చెప్పారు.  ఇరు దేశాల విద్యార్థులకు లబ్ధి చేకూరేలా బ్రిటన్, ఇండియా చేపడుతున్న ఉమ్మడి కార్యక్రమాలే దీనికి కారణమని తెలిపారు. 


బ్రిటన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది జూలైలో ప్రారంభమైన గ్రాడ్యూయేట్ విద్యార్థి వీసా(Graduate visa) పట్ల అంతర్జాతీయ విద్యార్థులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. చదువు పూర్తయ్యాక రెండేళ్ల పాటు బ్రిటన్‌లో ఉద్యోగం చేసుకునేందుకు వెసులుబాటు ఉండటం ఈ వీసాకున్న ప్రధాన ఆకర్షణ. వీసా కోసం ముందస్తు జాబ్ ఆఫర్‌ను సమర్పించాల్సిన అవసరం లేకుపోవడం..వీసాల సంఖ్యపై ఇతరత్రా పరిమితులు లేకపోవడం కూడా విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 12 వేల మంది భారతీయులు గ్రాడ్యూయేట్ వీసాతో లబ్ధిపొందారు. చదువు తరువాత బ్రిటన్‌లో ఉద్యోగానుభవాన్ని కూడా సంపాదించి కేరిర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రాడ్యూయేట్ రూట్‌లో వీసా పొందిన వారిలో ఇండియా, నైజీరియా, చైనా విద్యార్థులే అధికంగా ఉన్నారని వీవియన్ స్టర్న్ తెలిపారు. ప్రపంచ స్థాయి విద్య కోరుకునే భారతీయ విద్యార్థుల కల సాకారానికి బ్రిటన్ పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-28T21:40:01+05:30 IST