రోజుకు స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటున్నారా? అయితే..

ABN , First Publish Date - 2022-05-03T17:03:52+05:30 IST

రక్తపోటు నియంత్రణలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అది పరిమితిలో ఉన్నంతవరకే! సోడియం పరిమితి దాటితే హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాల్లో రాళ్లు, కండరాల నొప్పులు

రోజుకు స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(03-05-2022)

రక్తపోటు నియంత్రణలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అది పరిమితిలో ఉన్నంతవరకే! సోడియం పరిమితి దాటితే హైపర్‌టెన్షన్‌, మూత్రపిండాల్లో రాళ్లు, కండరాల నొప్పులు తలెత్తుతాయి. అయితే ఉప్పు తగ్గినా చేటే! హైపోనైట్రేమియా (రక్తంలో సోడియం తగ్గడం వల్ల వికారం, వాంతులు, కండరాల బలహీనత, మూర్ఛలు వస్తాయి). ఉప్పు పరిమాణం మరీ పెరిగితే, ‘హైపర్‌నైట్రీమియా’ (రక్తంలో సోడియం నిల్వలు పెరగడం, ఈ సమస్య వయోధికుల్లో అధికం) అనే సమస్య తలెత్తుతుంది.


ఉప్పు ఎక్కువ తీసుకుంటే దాన్ని బయటకు వెళ్లగొట్టడానికి శరీరం నీటిని నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. మనం అవసరానికి మించి ఉప్పు తింటూ ఉంటాం. కానీ నిజానికి రోజుకు ఒక చెంచా (2.4 గ్రాములు) ఉప్పు సరిపోతుంది. ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు, ఉప్పు చేర్చిన చిరుతిళ్లు, నిల్వ పదార్థాల ద్వారా ఇంతకు మించి అదనంగా సోడియం శరీరంలో చేరుకుంటూ ఉంటుంది. వీటికి దూరంగా ఉంటూ తగు మాత్రంగా ఉప్పు తీసుకోగలిగితే, రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా, అప్పటికే రక్తపోటు ఉన్నవారికి, వారు వాడే మందులు ప్రభావవంతంగా పని చేస్తాయి. ఉప్పు అవసరాని కంటే తగ్గినా ప్రమాదమే! 0.5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే, మెదడు పనితీరు గాడి తప్పుతుంది. అయోమయం, మాటలు తడబడడం లాంటివి జరుగుతాయి. అరుదుగా కొందరు కోమా లోకి కూడా వెళ్తారు. 


ఉప్పు ప్రత్యామ్నాయాలు... 

ఉప్పుకు ప్రత్యామ్నాయాలు లేవు. అయితే సహజసిద్ధ రకాలైన సముద్రపు, గులాబీ రంగులో ఉండే హిమాలయన్‌ సాల్ట్‌, బ్లాక్‌ సాల్ట్‌, గ్రే సాల్ట్‌లో ఖనిజ లవణాలు ఎక్కువ. అయితే ఉప్పుకు ప్రత్యామ్నాయ పదార్థాన్ని వాడాలనుకుంటే, సోంపు, తులసి, ఆరిగానో, నల్ల మిరియాలు కలిపి దంచి వాడుకోవచ్చు.

Read more