మరింత కఠినంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-07T04:26:11+05:30 IST

జిల్లాలో పరిస్థితిని చూస్తున్నాం.. ఇంకా మీలో చలనం లేదా...? ప్రాణాలు ముఖ్యమా..? వ్యాపారాలు ముఖ్యమా?’ అంటూ కర్ఫ్యూ నిబంధనలు పాటించని వ్యాపారులపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట తిరుగుతున్న వాహన చోదకులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు

మరింత కఠినంగా కర్ఫ్యూ
వాహనదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

ప్రాణాలు ముఖ్యం.. వ్యాపారాలు కాదు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ విజయనగరం క్రైం, మే 6 : ‘జిల్లాలో పరిస్థితిని చూస్తున్నాం.. ఇంకా మీలో చలనం లేదా...? ప్రాణాలు ముఖ్యమా..? వ్యాపారాలు ముఖ్యమా?’ అంటూ కర్ఫ్యూ నిబంధనలు పాటించని వ్యాపారులపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట తిరుగుతున్న వాహన చోదకులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని గంటస్తంభం, మూడులాంతర్లు, అంబటి సత్రం, ఎంజీ రోడ్డు, రింగురోడ్డు, కొత్తపేట నీళ్లట్యాంకు, కన్యకాపరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాల్లో ఏఎస్పీ సత్యానారాయణతో కలసి కలెక్టర్‌ పర్యటించారు. మధ్యాహ్నం 12.15 గంటల వరకు షాపులు తెరచి అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలను దగ్గరుండి బంద్‌ చేయించారు.  అనంతరం వాహనదారులను ఆపి.. ఏం పనుందని కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. అవసరం లేకుండా బయట తిరగొద్దని మందలించారు. శుక్రవారం నుంచి మరింత కఠినంగా కర్ఫ్యూ అమలు చెయ్యాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఉదయం 11.30 గంటల నుంచే మొబైల్‌ మైకుల ద్వారా షాపులు మూసివేయాలని ప్రచారం చేయాలన్నారు. రెవెన్యూ అఽధికారులు బృందాలుగా ఏర్పడి అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా కర్ఫ్యూ అమలు చెయ్యాలని కలెక్టర్‌ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చెయ్యలన్నారు. ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌. మోహన్‌రావు, తహసీల్దార్‌ ప్రభాకర్‌రావు, సీఐ మంగవేణి తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు. 


Updated Date - 2021-05-07T04:26:11+05:30 IST