మరింత ‘మద్ధతు’

Published: Sat, 25 Jun 2022 00:45:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరింత మద్ధతుపత్తి పంటలో డౌర కొడుతున్న రైతు(ఫైల్‌)

17 రకాల పంటలకు కనీస మద్దతుధరను పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం

నువ్వులు, సోయాబీన్‌, పత్తికి అధిక మొత్తంలో..

పెరిగిన ‘మద్దతు’తో జిల్లా రైతాంగానికి ప్రయోజనం

అక్టోబరు 2 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి..

జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 5.71 లక్షల ఎకరాల్లో  వివిధ రకాల పంటల సాగు

ఆదిలాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రతియేటా పంటలకు కనీస మద్దతుధరను ప్రకటించిన మాదిరిగానే, ఈ యేడు కేంద్ర ప్రభుత్వం 17 రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతుధరను పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. వానాకాలం పంటల సాగు ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం మద్దతుధరను ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అధికంగా సాగయ్యే పత్తి, సోయాబీ న్‌, కంది పంటలకు భారీగానే మద్దతుధర పెరిగింది. గత కొద్దిరోజులుగా వరి పంట సాగును తగ్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరి వద్దంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. దీనికి అనుగుణంగానే ఈసారి కేంద్ర ప్రభుత్వం వరి పంటకు నామమాత్రంగానే మద్దతుధరను పెంచడంతో వరి సాగు రైతులు కొంత నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో 5లక్షల 71 వేల 381 ఎకరాలలో ఈ సీజన్‌లో వివిధ రకాల పంటలు సాగవుతున్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశించిన స్థాయిలో మద్దతుధరలు పెంచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికంగా పత్తి, నువ్వు పంటలకు మద్దతు ధరను పెంచారు. కందులు, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్‌లకు అదనంగా రూ.300 మద్దతుధరను ప్రకటించారు. అయితే పెట్టుబడి ఖర్చులకన్న, ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు తక్కువగానే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంటల సాగుకు అయిన పెట్టుబడి ఖర్చుకు అదనంగా మద్దతుధరలు ప్రకటించాలని, ముందు నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. పెట్టుబడి ఖర్చుకు అదనంగా మరో 50 శాతం మద్దతుధర కలిపి ప్రకటించాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కోరిన పట్టించుకున్నట్లే కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోయాబీన్‌ విత్తనంపై సబ్సిడీని ఎత్తి వేయడంతో రైతులకు విత్తన కొనుగోలు భారంగా మారుతోంది. అలాగే ఫర్టిలైజర్‌ ఎరువులు, ఇతర విత్తనాల ధరలు కూడా భగ్గుమనడంతో పెరిగిన పెట్టుబడు లు కూడా చేతికి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా భాగానే ఉన్న పంట చేతికి వచ్చిన సమయంలో ప్రభుత్వ కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఆదరాబాదరగా దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుధరను ప్రకటించినా.. సకాలం లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పెరిగిన మద్దతుధరలు ఇలా..

వానాకాల సీజన్‌ ప్రారంభంకావడంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే కనీస మద్దతుధరను ప్రకటించింది. మొత్తం 17రకాల పంట ఉత్పత్తులకు మద్దతుధరను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మద్దతుధరను చెల్లించి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. పెరిగిన మద్దతుధరలు అక్టోబర్‌ 2 నుంచి అమల్లోకి వస్తాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడు పత్తి పంటకు రూ.6025 మద్దతుధర ఉండగా.. ఈ యేడు రూ. 6380 మద్దతుధరగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సోయాబీన్‌ రూ. 3950 నుంచి రూ.4300 పెంచింది. సన్‌ప్లవర్‌ రూ.6015 నుంచి రూ.6400 కాగా, వేరుశనగ రూ.5550 నుంచి రూ.5850 పెరిగింది. మొక్కజొన్న రూ.1870 రూ.1962, జొన్నలు రూ.2758 నుంచి రూ.2990, వరి సాధార ణ రకం రూ.1940 నుంచి రూ.2040, వరి గ్రేడ్‌-1 రూ.1960 నుంచి రూ. 2060 పెరిగింది. పెసర్లు రూ.7275 నుంచి రూ.7755 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కందులు రూ.6300 నుంచి రూ.6600, నువ్వు లు రూ.7307 నుంచి రూ.7830 కనీస మద్దతు ధరను పెంచడంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడు సమృద్ధిగానే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగానే వస్తాయని అన్నదాతలు భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. వాతావరణం సహకరించి అనుకున్నట్లుగానే పంట దిగుబడులు చేతికి వస్తే ఈ యేడు వ్యవసా యం లాభసాటి కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా పంట ఉత్పత్తుల మద్దతుధరను ప్రకటించడంతో దీనికి అనుగుణంగానే రైతులు పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలో ఎక్కువగా సాగు చేసే పత్తి, సోయాబీన్‌ పంటలకు ఆశించిన స్థాయిలోనే మద్దతుధర పెంచడంతో అన్నదాతలు వీటి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడు పత్తికి మద్దతుధరకు మించి ధర రావడంతో రెండింతల ఆదాయం వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు.

పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాన రూ.ఐదు వేలు పెట్టుబడి సహాయంగా అందిస్తున్నా.. ఏ మూలన సరిపోవడం లేదంటున్నారు. ఏటేటా పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులతో అన్నదాత లు అప్పుల పాలవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, రసాయన మందుల ధరలతో పాటు కూలీల రేట్లు, యంత్రాల అద్దెలు రెండింతలు రెట్టింపు అవుతున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడం కూడా పంటల సాగు పై ప్రభావం చూపుతోంది. పత్తి పంటకు రూ.8వేల నుంచి 10వేల వరకు మద్దతుధర చెల్లిస్తేనే గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎక్కువగా వర్షాధార పంటలనే సాగు చేయ   డంతో వరణుడి కరుణ మీదనే ఆధారపడి సాగు చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాతావరణం సహకరించలేదంటే అన్నదాతల అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుధరను ప్రకటించినా.. కొనుగోలు సమయంలో నాణ్యత, తేమ శాతం పేరిట కోతలు విధించడంతో మెజార్టీ రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతుధర దక్కడం లేదు. కొంతమంది రైతులకు మాత్రమే మద్దతుధర దక్కుతున్నట్లు తెలుస్తుంది. గత్యంతరం లేకపోవడంతో వచ్చిన ధరకే రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకుని నష్టపోవాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన ధర ప్రకారమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సమయానికి పంటలను కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు పంటలు తడిసిపోవడంతో నాణ్యత లేక నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఎన్నో సమస్యలు అష్టకష్టాలు పడి పంటలు సాగు చేసినా.. పంట చేతికి వచ్చిన సమయంలో మద్దతుధర దక్కడం గగనంగా మారుతోంది.

అక్టోబరు 2 నుంచి  పెరిగిన మద్దతుధరలు అమల్లోకి..

: శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే 17 రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతుధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు వచ్చే అక్టోబర్‌ 2నుంచి అమల్లోకి వస్తాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేస్తున్న పత్తి, సోయా పంటలకు పెరిగిన మద్దతుధర వర్తిస్తుంది. రైతులు నాణ్యమైన పంట దిగుబడులను మార్కెట్‌కు తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతుధరను పొందాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఆదరాబాదరగా అమ్ముకోవద్దు. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.