'చనిపోయిన నా సోదరుడు ఎలాగు తిరిగి రాడు.. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడి తీసుకురండి'

ABN , First Publish Date - 2022-03-02T16:56:34+05:30 IST

ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత విద్యార్థి శేఖరప్ప గ్యానగౌడర్‌ నవీన్‌(21) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

'చనిపోయిన నా సోదరుడు ఎలాగు తిరిగి రాడు.. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడి తీసుకురండి'

బెంగళూరు: ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత విద్యార్థి శేఖరప్ప గ్యానగౌడర్‌ నవీన్‌(21) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఖార్కివ్‌ నగరంపై మంగళవారం రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా చళగేరి గ్రామానికి చెందిన నవీన్ చనిపోయాడు. ఆహారం కోసం బయటకు వచ్చిన నవీన్ ఇలా దుర్మరణం చెందాడు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి అక్కడ భారతీయులు మరణించడం ఇదే తొలిసారి. ఇదిలాఉంటే.. తాజాగా నవీన్ మృతిపై ఆయన సోదరుడు హర్ష మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశాడు. అదే సమయంలో పెద్ద మనుసు చాటాడు. 'చనిపోయిన నా సోదరుడు ఎలాగు తిరిగి రాడు.. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడి వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని' అన్నాడు. 


బుధవారం మీడియాతో మాట్లాడిన హర్ష.. తన సోదరుడి బాడీని స్వదేశానికి తరలించే దానికంటే కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు ప్రతి క్షణం భయంభయంగా గడుపుతున్నారని గుర్తు చేశాడు. "నా సోదరుడి మృతదేహాన్ని తరలించడం కంటే కూడా అక్కడ చిక్కుకుపోయిన మిగతా విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అని హర్ష చెప్పుకొచ్చాడు. ఖార్కీవ్ నుంచి స్వదేశానికి వచ్చే ప్రణాళికను తమతో పంచుకున్న కొద్దిసేపటికే నవీన్ ఆహారం కోసం బయటకు వెళ్లి మృతిచెందడం తీవ్రంగా కలిచి వేసిందన్నాడు. నవీన్ తండ్రి శేఖరప్ప కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న భారత విద్యార్థులను త్వరగా స్వదేశానికి తరలించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

Updated Date - 2022-03-02T16:56:34+05:30 IST