Advertisement

మేం చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావ్‌ అన్నారు -నవదీప్‌

Mar 5 2021 @ 22:53PM

‘‘నటుడిగా తగిలిన ఎదురుదెబ్బలు నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి. జరుగుతున్న పొరపాట్లు, లోటుపాట్లు గురించి తెలుసుకున్నా. అందుకే వచ్చిన ప్రతి కథను అంగీకరించకుండా పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఆచితూచి అడుగేస్తున్నా. మనసుకు నచ్చిన కథలతోనే నడవాలని నిర్ణయించుకున్నా’’ అని నవదీప్‌ అన్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘మోసగాళ్లు’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జెఫ్రీ గి చిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇటీవల విలేకర్లతో మాట్లాడారు నవదీప్‌. 


‘‘భారతదేశానికి చెందిన అక్కా, తమ్ముళ్లు.. భారత్‌లోనే ఉండి అమెరికాలో ఓ భారీ ఐటీ కుంభకోణానికి పాల్పడతారు. అదెలా అన్నది ఈ చిత్ర కథ. విష్ణుకి సహాయపడే వైట్‌కాలర్‌ నేరస్థుడిగా కనిపిస్తా. స్కామ్‌లు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటా. విష్ణులో గొప్ప ప్రతిభ ఉందని తెలుసుకొని అతనికి ఓ స్కామ్‌ కోసం సాయం చేస్తా. అదే సమయానికి తన సోదరి (కాజల్‌) ఇచ్చిన ఐడియాతో నన్ను పక్కనపెట్టి అతను అందనంత ఎత్తుకు ఎదుగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరం. 


ఏం చేయాలో తెలిసేది కాదు...

‘మనసుకు నచ్చింది చేయాలా? మన దగ్గరికి వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్లాలా’ అనే విషయంలో ఎప్పుడూ కన్‌ప్యూజన్‌ ఉండేది. పెద్ద దర్శక, నిర్మాతలు స్ర్కిప్ట్‌లు తీసుకొచ్చినప్పుడు అవి నచ్చకున్నా.. నో చెప్పలేకపోయే వాడిని. దాంతో చాలా సినిమాలు ప్లాఫ్‌ అయ్యాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం  కనుగొన్నా. ‘షూటింగ్‌ లేకపోతే కాస్త డబ్బులు తక్కువ ఖర్చుపెట్టుకొని వేరే పనులు చేసుకో కానీ, పిచ్చి పిచ్చిగా చేయొద్ద’ని నాకు నేను చెప్పుకొన్నా.


ప్రస్తుతం ఓ చక్కటి ఫాంటసీ ప్రేమకథతో సినిమా చేస్తున్నా. అలాగే నటనతో పాటు సీ-స్పేస్‌ సంస్థ పనులు చూసుకుంటున్నా.  కొత్త రచయితలకు శిక్షణ ఇచ్చి, వాళ్లతో కథలు సిద్థం చేయిస్తున్నాం. సీ స్పేస్‌ గురించి తెలుసుకున్న అల్లు అరవింద్‌గారు, నేను, సురేశ్‌బాబు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావ్‌’ అని ప్రశంసించారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.