దోమలు తెగ కుడుతున్నాయని కొడుకు ఇంటికి వెళ్లి పడుకున్న తల్లి.. తెల్లారి లేచి తన ఇంటికి వెళ్లి చూసేసరికి...

ABN , First Publish Date - 2022-09-09T17:07:30+05:30 IST

భరించలేని ఉక్కపోత, దోమల బెడదను తట్టుకోలేని...

దోమలు తెగ కుడుతున్నాయని కొడుకు ఇంటికి వెళ్లి పడుకున్న తల్లి.. తెల్లారి లేచి తన ఇంటికి వెళ్లి చూసేసరికి...

భరించలేని ఉక్కపోత, దోమల బెడదను తట్టుకోలేని ఆ 70 ఏళ్ల వృద్ధురాలు పొరుగున ఉన్న తన కొడుకు ఇంటికి నిద్రించడానికి వెళ్ళింది. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటిలోకి చొరబడిన దొంగలు నగలు, నగదు దోచుకుపోయారు. మర్నాటి ఉదయం బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దోమల బెడద లేకుండా ఉంటే, ఆ వృద్ధురాలు పొరుగింటిలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్లేదికాదని, బహుశా అప్పుడు దొంగతనం జరిగేది కాదని చర్చించుకుంటున్నారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని పాలి నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో సోదరులు శంకర్ పటేల్, కైలాష్ పటేల్ ఉంటున్నారు.


వారి తల్లి తిల్లీ దేవి పొరుగున ఉన్న పాత ఇంట్లో ఉంటోంది. గురువారం రాత్రి ఆమె తన ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో తన కుమారుడు కైలాష్ పటేల్ ఇంటికి వచ్చి అక్కడే పడుకుంది. శుక్రవారం ఉదయం వృద్ధురాలు తన ఇంటికి వెళ్లి చూడగా, తలుపు తాళం పగులగొట్టివుంది. గదిలోని పెట్టెలు కనిపించకుండా పోయాయి. దీంతో ఆమె తన కుమారులకు ఈ విషయం తెలియజేసింది. ఈ వార్త గ్రామమంతా పాకింది. గ్రామస్తులకు సమీపంలోని పొలంలో పడి ఉన్న ఖాళీ పెట్టెలు, దుస్తులు కనిపించాయి. ఒక కేజీ వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకువెళ్లారని బాధితుడు కైలాష్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై గిరాడ్రా మాజీ సర్పంచ్ రూపారాం పటేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా ఇటీవల తాను జొన్న పంటను విక్రయించినట్లు కైలాష్ పటేల్ తెలిపారు. ఆ డబ్బు తన తల్లి వద్ద ఉంచానన్నారు. బ్యాంకులో డిపాజిట్ చేసేలోపే ఇలా జరిగిందని వాపోయారు. 

Updated Date - 2022-09-09T17:07:30+05:30 IST