ఆర్థిక ఇబ్బందులతో తల్లీ బిడ్డ మృతి

ABN , First Publish Date - 2021-04-24T04:15:59+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. తను లేకపోతే కుమారుడ్ని సాకేవారు ఎవరూ ఉండరని భావించి అంతకుముందే అతడి ముక్కు నోరు అదిమిపెట్టి ఊపిరి తీసేసింది. ఈ సంఘటన పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగింది.

ఆర్థిక ఇబ్బందులతో తల్లీ బిడ్డ మృతి
మృతిచెందిన సరిత, చేతన్‌

కుమారుడ్ని ఊపిరాడనివ్వకుండా చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న తల్లి 

 కొమ్మాది, ఏప్రిల్‌ 23: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. తను లేకపోతే కుమారుడ్ని సాకేవారు ఎవరూ ఉండరని భావించి అంతకుముందే అతడి ముక్కు నోరు అదిమిపెట్టి ఊపిరి తీసేసింది. ఈ సంఘటన పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీ బ్లాక్‌నంబర్‌ 57 డి.ఎఫ్‌ 5, 6 ప్లాట్‌లలో శ్రీకుకుళం జిల్లా సోంపేట దరి బేసిరామచంద్రాపురానికి చెందిన ఎరుమాకు రవికుమార్‌ భార్య సరిత (33), పెద్దకుమారుడు శశాంక్‌ (10), చిన్నకుమారుడు చేతన్‌(3)తో కలిసి నివసిస్తున్నారు. రవికుమార్‌ దంపతులు గతంలో హైదరాబాద్‌లో ఉండేవారు. ఐదేళ్ల కిందట ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వచ్చి మారికవలస రాజీవ్‌ గృహకల్పకాలనీలో సరిత తల్లికి  చెందిన ఇంట్లో ఉంటున్నారు. రవికుమార్‌ గతంలో హోటల్‌ రంగంలో పలుచోట్ల పనిచేసిన అనుభవంతో ఆనందపురం, తగరపువలస ప్రాంతాల్లో సొంతంగా హోటల్‌ నిర్వహించాడు. అయితే అవి సరిగా నడకపోవడంతో మూసివేశాడు. దీంతో ఆర్థికంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో బోయిపాలెం వద్ద ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతోనే సరిత ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని ఉంటుందని, భర్త ఇంట్లో లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆమెకు చిన్న కుమారుడు చేతన్‌ అంటే బాగా ఇష్టమని, తను లేకపోతే తన కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనతో అతడి ముక్కు, నోటిని అదిమిపెట్టి ఉంచడంతో మృతిచెందాడని భావిస్తున్నామన్నారు. అనంతరం ఆమె పక్క గదిలో ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఆ సమయంలో వేరే గదిలో ఉన్న మృతురాలి పెద్దకుమారుడు తల్లి ఉరివేసుకుని ఉండడాన్ని చూసి, తండ్రికి సమాచారం అందించాడన్నారు. మృతురాలి సోదరి వనిత ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Updated Date - 2021-04-24T04:15:59+05:30 IST