Advertisement

అమ్మే నా విజయానికి తొలి మెట్టు.. ఆత్మీయతల పొదరిల్లు..

May 9 2021 @ 11:42AM

  • నేడు మాతృ దినోత్సవం


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : అమ్మ... ఆనందాల హరివిల్లు.. అనుబంధాల పొదరిల్లు.. బిడ్డ మారాం చేసినా గారాబం చేయడం తల్లికే చెల్లు. ఇదీ తల్లీబిడ్డల బంధానికి, అనుబంధానికి నిదర్శనం... నవమాసాలు మోసి ఆ బిడ్డ భూమి మీదకు రాగానే అమ్మ సంబరానికి హద్దులు ఉండవు. బిడ్డ ప్రతి అడుగులో అమ్మ... ప్రతి పనిలో అన్ని తానై తోడు నీడై ఉంటుంది. బిడ్డ పెద్ద వాడై ప్రయోజకుడైనా అమ్మ మాత్రం ఇంకా పిల్లవాడిగానే చూస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. మాతృ దినోత్సవం సందర్భంగా పలువురి మనోగతం మీకోసం. 


అమ్మ చూపిన దారిలో..

అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎవరిని కదిలించినా తన విజయం వెనుక అమ్మనే ఉందని చెబుతారు. అమ్మ చూపిన దారిలోనే పయనిస్తున్నారు. అందుకే అమ్మని మించి దైవం లేదంటారు. అమ్మను, త్యాగాలను మరుస్తున్న వారు లేకపోలేరు. అమ్మ కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లులకు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్న కథనా లు వినిపిస్తున్నాయి. 


చట్టాలు ఉన్నా...

వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూసుకోని పిల్లలపై చట్ట పరమైన చర్య తీసుకునే అవకాశం ఉన్నా పోలీసులు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిని కొట్టిన కుమారుడిపై కేసులు పెట్టకుండా చోద్యం చూస్తున్న వైనాలు అనేకం.. మాతృమూర్తులను కొట్టడం, అన్నం పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేయడం, ఇప్పటికీ అనేక పోలీసుస్టేషన్‌ల పరిధిలో చోటు చేసుకుంటున్నాయి. అమ్మ గొప్పతనం తెలియక కొడుకులే హత్యలు చేస్తున్న ఉదంతాలు కూడా లేకపోలేదు. అమ్మల సంరక్షణ కోసం చట్టాలు రూపొందించిన వారే వీటిని కఠిన తరం చేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది.

 

అమ్మే నా విజయానికి తొలి మెట్టు

అమ్మే నా విజయానికి తొలి మెట్టు.. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే అనుకున్న స్థానానికి చేరుకున్నాను. ఇప్పటికి నా ప్రతి అడుగులో అమ్మే ఉంది. అమ్మ నాపై కురిపించిన అప్యాయతలు, ప్రేమను ఇప్పుడు నా పిల్లలకు పంచుతున్నాను. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. - సునీత, ఆంత్రప్రెన్యూర్‌

చట్టాలను కఠినతరం చేయాలి

తల్లి పట్ల పిల్లలు ప్రవర్తించే తీరు పత్రికలో చదివినప్పుడు చాలా బాద కలిగిస్తుంది. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మపై చేయి చేసుకోవడం అంత వికృతం మరొకటి లేదు. ఇలా వ్యవహరించే వారిని కఠినంగా శిక్షించాలి. చట్టాలను మరింత పట్టిష్టం చేయాలి. - శ్రీనివాస్‌ గౌడ్‌, వ్యాపారి

అడవుల్లో ఉన్నప్పుడే..

ఇప్పుడంటే నగరానికి వచ్చి బతుకుతున్నాం. చిన్న తనంలో అడవుల్లో ఉన్నప్పుడు పాము, పుట్ర నుంచి ఎలా రక్షించుకోవాలో అమ్మే నేర్పింది. అవే జీవిత పాఠాలుగా మారాయి. మా అమ్మ మమ్మల్ని పోషించడానికి చాలా కష్టాలు పడింది. ఇప్పుడు నేను అదే ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. - ఘాన్సీభాయ్‌, గిరిజన గృహిణి

ఇవి కూడా చదవండి :

అమ్మా.. నీకు వందనంకరోనాతో బాధపడుతున్నారా.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండికరోనా సెకండ్ వేవ్.. : మందుబాబులకు షాకింగ్ న్యూస్..కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం?!

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.