ఆస్పత్రిలో కన్నుమూసిన తల్లి.. అసలు నిజం చెప్పిన 8 ఏళ్ల పాప

Jul 23 2021 @ 19:26PM

ఇంటర్నెట్ డెస్క్: మామ చనిపోతే కనీసం కన్నీటి బొట్టు రాల్చని ఆ అల్లుడు.. ఆయన మరణానంతరం వచ్చిన పెన్షన్ డబ్బుపై కన్నేశాడు. కోర్టులో నెలల తరబడి వాదించి తెచ్చుకున్న డబ్బులో అత్త తనకు కూడా వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. వాటా కోసం ముసలి అత్త, భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఆ డబ్బు అందకపోవడంతో అతనిలోని రాక్షసుడు నిద్రలేచాడు. తన కోపాన్ని భార్యపై ప్రదర్శించి ఘోరానికి ఒడిగట్టాడు. దారుణం చేసి తనకేమీ తెలియనట్లు నాటకమాడాడు. అందరి ముందూ ముసలి కన్నీ కార్చాడు. కానీ 8 ఏళ్ల కూతురే తండ్రి నిజస్వరూపం బయటపెట్టింది. దీంతో తేలుకుట్టిన దొంగలా దొరికిపోయి, ఊచలు లెక్కపెడుతున్నాడా నీచుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగు చూసింది.


నీలూ నన్హేట్ (30) అనే యువతికి నరేంద్ర కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ నెల 15న నీలూను ఆమె భర్త ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె శరీరం 95శాతం అగ్నికి ఆహుతైంది. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటలకే ఆమె కన్నుమూసింది. తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని నరేంద్ర కుమార్ తెలిపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో నీలూ, నరేంద్రల 8 సంవత్సరాల కుమార్తె అసలు విషయం బయటపెట్టింది. ‘‘నాన్న అమ్మ నోరు నొక్కి బలవంతంగా వంటగదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ డబ్బాలో ఉన్న కిరోసిన్ తీసి అమ్మపై పోసి నిప్పుపెట్టాడు’’ అని ఆ పాప చెప్పడంతో.. పోలీసులు వెంటనే నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నరేంద్ర తన నేరం ఒప్పుకున్నాడు. మామయ్య మరణంతో అత్తగారికి 8 లక్షల పెన్షన్ వచ్చిందని, దానిలో వాటా ఇవ్వనందుకే తాను భార్యకు నిప్పుపెట్టినట్లు అంగీకరించాడు. ఈ విషయంలో వీరిద్దరికీ నాలుగు నెలలుగా గొడవ జరుగుతోందని సమాచారం.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...