42 లీటర్ల పాలు దానం.. మరో ఏడాది ఇస్తానంటున్న తల్లి!

ABN , First Publish Date - 2020-11-19T02:41:12+05:30 IST

శిశువులకు తల్లిపాలు చాలా ముఖ్యం. అవి తాగితేనే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే డాక్టర్లంతా పిల్లలకు తల్లి పాలు కంపల్సరీగా ఇవ్వాలని చెప్తారు.

42 లీటర్ల పాలు దానం.. మరో ఏడాది ఇస్తానంటున్న తల్లి!

ఇంటర్నెట్ డెస్క్: శిశువులకు తల్లిపాలు చాలా ముఖ్యం. అవి తాగితేనే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే డాక్టర్లంతా పిల్లలకు తల్లి పాలు కంపల్సరీగా ఇవ్వాలని చెప్తారు. అలాంటిది ఓ హిందీ నిర్మాత ఆ పాలని దానం చేసింది. అర్థం కాలేదా? నిజమేనండి. ‘సాంద్ కీ ఆంఖ్’ సినిమా ప్రొడ్యూసర్ నిధి పార్మర్ హీరానందాని ఇటీవలే తల్లి అయింది. తల్లి అయిన వారందరికీ వచ్చినట్లే ఆమెకు కూడా చనుబాలు వచ్చాయి. అయితే వాటిని తన పిల్లాడికి మాత్రమే పట్టకుండా ఓ ఆస్పత్రికి దానమిచ్చిందామె. ఇలా ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 42 లీటర్ల పాలు దానం చేసినట్లు వెల్లడించింది.


నిధి వయసు దాదాపు 42. ఈ వయసులో తల్లి అవడమే కష్టం. అలాంటిది తల్లి అవడమే కాక ఇలా 42 లీటర్ల చనుబాలు దానం చేయడంతో నిధి వార్తల్లో నిలిచారు. తన బిడ్డ కోసం చనుబాలు తీసి పక్కన పెట్టానని, ఇలా తీసిన పాలు మరీ ఎక్కువైపోతున్నాయని, వాటిని తన బాబు తాగలేకపోతున్నాడని నిధి చెప్పింది. ఇలా పక్కన పెట్టేసే కన్నా ఎవరికైనా దానం చేయడం మంచిదనే ఆలోచన రావడంతో ఓ ఆస్పత్రితో మాట్లాడిందట నిధి. అక్కడి వైద్యులకు తన చనుబాలను దానం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పిందట. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని చనుబాలను దానం చేసింది. ఇది మే నెలలో మొదలైందని, అప్పటి నుంచి దాదాపు 42 లీటర్ల పాలు దానం చేశానని నిధి తెలిపింది.


ఇలా నిధి దానం చేసిన పాల సంగతేంటి? వాటిని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఎలా ఉపయోగిస్తున్నారు? అని తెలుసుకోవాలని ఆమెకు అనిపించిందట. ఆస్పత్రి వాళ్లతో మాట్లాడి తన పాలు ఎలా ఉపయోగిస్తున్నారో చూపించాలని కోరింది. దీంతో వారు ఆమెను ఓసారి ఆస్పత్రికి రమ్మన్నారు. అక్కడకు వెళ్లిన ఆమెకు ఓ 60 మంది పసికందులను చూపించారు. వారందరికీ నిధి ఇచ్చిన పాలే పడుతున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే తనకెంతో సంతోషం కలిగిందని నిధి చెప్పింది. తన చనుబాలు తాగుతున్న పిల్లలందరికీ ఆ పాలు చాలా అవసరమని, వారికోసం తాను మరో ఏడాదిపాటు పాలు దానం చేస్తూనే ఉంటానని నిధి స్పష్టం చేసింది.



నిధిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలా చనుబాలు దానం చేస్తే అవసరంలో ఉన్న చాలా మంది పిల్లలకు ఉపయోగ పడతాయని నిపుణులు అంటున్నారు. అది కూడా ప్రతి తల్లీ తన బిడ్డకే ప్రాధాన్యం ఇవ్వాలని, కానీ వైద్యుల సూచన మేరకు వృధాగా పోయే పాలను దానం చేయడం ఉత్తమమని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది పిల్లలకు ఆరోగ్యం ప్రసాదించినట్లేనని చెప్తున్నారు. మరి నిధి చేసిన పని భవిష్యత్తులో ట్రెండ్‌గా మారుతుందేమో చూడాలి.

Updated Date - 2020-11-19T02:41:12+05:30 IST