ఎప్పటికీ అమ్మే నా గురువు!

ABN , First Publish Date - 2021-09-05T05:30:00+05:30 IST

‘అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి మాత్రమే కాదు. నా జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపులో నా చేయిపట్టుకొని ముందుకు నడిపించిన గురువు. అమ్మే కనక నా వెనక లేకపోతే - నేను ఈ రోజు ఈ పదవిలో ఉండేదాన్ని కాదు...

ఎప్పటికీ అమ్మే నా గురువు!

1978... ఎమర్జెన్సీ సమయం.. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ పోలీసులు అరెస్ట్‌ చేసి జైళ్లలో పెట్టారు. వారిలో కుమరి అనంతన్‌ ఒకరు. ఆయన భార్య కృష్ణకుమారికి అర్ధరాత్రి పురిటి నెప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లటానికి కూడా ఎవరూ లేరు. వారి పెద్ద కుమార్తె అతి కష్టం మీద ఒక ట్యాక్సీని పట్టుకొచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే తల్లి, బిడ్డల ప్రాణాలకే ప్రమాదమన్నారు. కానీ సర్జరీ చేయాలంటే అంగీకార పత్రం కావాలి. ఆ పత్రంపై సంతకం చేయటానికి కుటుంబ సభ్యులెవ్వరూ లేరు. దాంతో 10వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి ఏడుస్తూ ఆ అంగీకార పత్రంపై సంతకం చేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు. ప్రస్తుతం తెలంగాణ, పుద్దుచ్చేరిల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.


‘‘అర్ధరాత్రి ఏం చేయాలో తెలియక.. ఏడుస్తూ సర్జరీకి అంగీకారపత్రంపై సంతకం చేసిన క్షణాలు ఇంకా నాకు గుర్తున్నాయి. అలాంటి నేను రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ ప్రమాణ స్వీకార పత్రంపై సంతకం చేశానంటే కారణం మా అమ్మే! చాలా మందికి అమ్మ ఒక అనుభూతి. నాకు మాత్రం అమ్మ ఒక గురువు. ఎప్పుడూ నన్ను ముందుండి నడిపించే మార్గదర్శి..’’ అంటారు తమిళిసై. గురుపూజోత్సవం సందర్భంగా - గత నెల 16వ తేదీన మరణించిన తన తల్లి జ్ఞాపకాలను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు. 


‘‘అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి మాత్రమే కాదు. నా జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపులో నా చేయిపట్టుకొని ముందుకు నడిపించిన గురువు. అమ్మే కనక నా వెనక లేకపోతే - నేను ఈ రోజు ఈ పదవిలో ఉండేదాన్ని కాదు. నా చిన్నప్పుడు నాన్న ముందు ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అనుక్షణం బిజీగా ఉండేవారు. నేనెప్పుడు నాన్న కూచిని. నాన్న వెంట తోకలా తిరుగుతూ ఉండేదాన్ని. నాన్న రోజంతా నియోజకవర్గంలో తిరుగుతూ ఉండేవారు. రాత్రి వచ్చి పడుకున్న తర్వాత ఏదో అర్జంట్‌ కాల్‌ వచ్చేది. వెంటనే బయలుదేరేవారు. ఆ సమయంలో కూడా నేను నాన్న వెంటే ఉండేదాన్ని. నాన్న తిరుగుడు చూసి అమ్మ విసిగిపోయేది. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు- పిల్లలందరినీ - ‘‘నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుతావు?’’ అని మా టీచర్‌ అడిగారు. ఒకొక్కరు ఒకో ఆన్సర్‌ చెబుతున్నారు. నా వంతు వచ్చింది. నేను -‘రాజకీయ నాయకురాలిని అవుతా’ అని చెప్పా. ఇంటికి వచ్చి ఆ సంఘటన అమ్మతో చెప్పా. అమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. గట్టిగా కొట్టింది. నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ- ఏ రాజకీయనాయకుడి భార్య తన పిల్లలు రాజకీయాల్లోకి రావాలని అనుకోదు. ఎందుకంటే దానిలో ఉండే కష్టనష్టాలు వాళ్లకు బాగా తెలుస్తాయి. నేను రాజకీయాల్లోకి రావటం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు. అయినా నన్ను ఎప్పుడూ ఇంటి పని.. వంట పని చేయమని ఒత్తిడి పెట్టలేదు. ఎందుకంటే - ‘పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనేది అమ్మ సిద్ధాంతం. అందుకే నేను ఎదిగిన తర్వాత నా జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టంలోను నాకు అండగా నిలిచింది. 


చిన్నతనంలో పెళ్లి...

మేము మొత్తం ఐదుగురు పిల్లలం. అందరిలోను నేనే పెద్ద. నాకు పెళ్లి అయితే తప్ప చెల్లెళ్లకు పెళ్లికాదు. దాంతో నేను మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే నాకు పెళ్లి చేసేసారు. మెడిసిన్‌ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు మా అబ్బాయి పుట్టేశాడు. ఆ సమయంలో నా ముందు ఉన్నది ఒకటే దారి. చదువు మానేయటం. కానీ అమ్మ నాకు మరో మార్గాన్ని తెరిచింది. నా చదువు కోసం 40 రోజల పసికూనను తనతో తీసుకువెళ్లి పెంచింది. అందుకే మా అబ్బాయి మా అమ్మను - ‘అమ్మ’ అని పిలుస్తాడు. నన్ను పేరుపెట్టి పిలుస్తాడు. అప్పుడు అమ్మ అండ లేకపోతే నా చదువు పూర్తయ్యేది కాదు. నేను డాక్టర్‌ను అయ్యేదాన్ని కాదు. నేను డాక్టర్‌ని అయ్యా! చాలా బిజీగా ఉండేదాన్ని. రెండు సొంత క్లినిక్‌లు... రెండు ఆసుపత్రిలో కన్సల్టెంట్‌ పొజిషన్లు... ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌... ఇలా అనుక్షణం బిజీగానే ఉండేది. అంత బిజీగా ఉన్న సమయంలో- ఆ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నా. బీజేపీలో చేరాలనుకున్నా. ఒక విధంగా ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఎందుకంటే నాన్న కరడుగట్టిన కాంగ్రెస్‌వాది. ఆయన నరనరాల్లోను కాంగ్రెస్‌ సిద్ధాంతాలు ప్రవహిస్తూ ఉంటాయి. నేను బీజేపీలో చేరటం ఆయనకు పెద్ద దెబ్బ. ఆయన ఎంత హర్ట్‌ అయ్యారంటే - ఆ తర్వాత సుమారు ఏడాది నాతో మాట్లాడలేదు. నన్ను కనీసం పలకరించేవారు కాదు. ఆ సమయంలో నాన్నకు నచ్చచెప్పింది అమ్మే! ‘‘పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. వారి అభిప్రాయాలు వారికుంటాయి. మీరే తనని రాజకీయాలలోకి రమ్మని ప్రోత్సహించారు. తన అభిప్రాయాన్ని గౌరవించకపోతే ఎలా? లేకపోతే మనకు గౌరవం ఎలా ఉంటుంది?’’ అని ఆయనకు చెప్పి మళ్లీ నాతో మాట్లాడేలా చేసింది అమ్మే! అప్పుడు అమ్మ నా వెంట ఉండకపోతే - నాన్నకు నాకు మధ్య ఉన్న అభిప్రాయబేధాలు మరింత పెరిగిపోయేవి. 




అన్ని కాలాలలోను...

ప్రతి తల్లికి తన పిల్లలపై ఆపేక్ష ఉంటుంది. వారి బాగోగుల పట్ల ఆందోళన ఉంటుంది. కానీ యుక్తవయస్సు వచ్చిన తర్వాత చాలా మంది తల్లితండ్రులు వారిని వదిలేస్తారు. కానీ అమ్మ అలా కాదు. తను మరణించే ముందు రోజు దాకా- మా ఐదుగురితో ఉదయం, సాయంత్రం మాట్లాడుతూనే ఉంది. మేము ఐదుగురం మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆమెకే చెప్పేవాళ్లం. ఆమె వాటికి పరిష్కారమార్గాలు సూచించేది. మా వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి - మా కోణం నుంచి కూడా తనే ఆలోచించేది. ఈ సారి ఆగస్టు 15కి తెలంగాణ, పుదుచ్చేరిలలో నేను జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనుకున్నా. ‘‘అమ్మా... రేపు ఆగస్టు 15. హైదరాబాద్‌లోను, పుదుచ్చేరిలలో జాతీయ పతాకం ఎగరేస్తున్నా..’’ అని చెప్పా. అప్పటికే అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ‘‘రెండు చోట్ల ఎలా ఎగరేస్తావు? సమయం సరిపోతుందా?’’ అని అమ్మ అడిగింది. ‘‘హైదరాబాద్‌లో ఎగరేసి... వెంటనే విమానం ఎక్కి వెళ్లిపోతా. గంటన్నర ప్రయాణం. పుదుచ్చేరిలో కూడా ఎగరేస్తా’’ అని చెప్పా. ‘‘జాతీయ పతాకం మధ్యాహ్నం 12 లోపున ఎగరేయాలి. లేకపోతే తప్పు. ఆ సమయం లోపల రెండు చోట్లా ఎగరేయగలవా?’’ అని అడిగింది. ‘ఏం పర్వాలేదు’ అని చెప్పా. అవే నేను అమ్మతో మాట్లాడిన ఆఖరి మాటలు. ఆగస్టు 16వ తేదీన అమ్మ మరణించింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. తను బతికి ఉన్నప్పుడు మా గురించి ఎంత శ్రద్ధ తీసుకుందో... చనిపోయే ముందు కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. మా అబ్బాయికి మా అమ్మతో అనుబంధం ఎక్కువ. అందుకే వాడిని రెండు వారాల ముందు నుంచి బాగా ప్రిపేర్‌ చేసింది. తాను మరణించిన తర్వాత ఎవరినీ ఏడ్వవద్దని ముందే అందరితోను చెప్పింది. తన అంత్యక్రియలు ఎక్కడ జరగాలో కూడా ముందే నిర్దేశించింది. ఇప్పటికీ అమ్మ మాతో లేదనే ఆలోచనే ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా రాజభవన్‌లో అమ్మ గదిలోకి వెళ్తే అన్నీ ఆమె జ్ఞాపకాలే!’’



ఒద్దికగా...

‘‘మంచి దుస్తులు వేసుకోవటం.. ఒద్దికగా ప్రవర్తించటం... ఎప్పుడూ శుభ్రంగా ఉండటం... ఇలాంటి లక్షణాలన్నీ మాకు మా అమ్మనుంచే వచ్చాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చేది. అయితే ఎప్పుడూ హద్దులు మాత్రం దాటనిచ్చేది కాదు. ‘‘నువ్వు రాత్రి 11 గంటలకు రా... నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీ గురించి ఎవరూ చెడుగా మాట్లాడుకోకూడదు. అలా ప్రవర్తించాల్సిన బాధ్యతే నీదే’’ అని చెప్పేది. మా పెళ్లిళ్ల విషయంలో కూడా తుది నిర్ణయాలు తనే తీసుకుంది.’’


పుస్తక రూపంలోకి..

‘‘అమ్మ ఎనిమిదో తరగతి దాకానే చదువుకున్నా- తమిళం, ఇంగ్లీషు రాయటం... చదవటం వచ్చు. తను విన్నవి... చూసినవి అన్నీ పుస్తకాల్లో రాసిపెట్టుకొనేది. ఆ పుస్తకాల్లో ముగ్గులు ఎలా వేయాలనే దగ్గర నుంచి పండగలు ఎలా జరపాలో.. పిండి వంటలు ఎలా చేయాలో - అన్నీ ఉంటాయి. వాటిని ఎప్పటికైనా ఒక పుస్తక రూపంలోకి తీసుకురావాలని ఉంది.’’


- ఇంటర్వ్యూ: సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 


Updated Date - 2021-09-05T05:30:00+05:30 IST