Dubai: చెత్తకుప్పలో వేయమంటూ నల్లటి బ్యాగ్‌ను అద్దెకు ఉండే వ్యక్తికి ఇచ్చిన యజమానురాలు.. అనుమానంతో ఓపెన్ చేసి చూస్తే..

ABN , First Publish Date - 2022-05-29T15:43:28+05:30 IST

దుబాయ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. బిడ్డ పుట్టిన 15 నిమిషాలకే ఊపిరాడకుండా చేసి చంపేసిందో తల్లి.

Dubai: చెత్తకుప్పలో వేయమంటూ నల్లటి బ్యాగ్‌ను అద్దెకు ఉండే వ్యక్తికి ఇచ్చిన యజమానురాలు.. అనుమానంతో ఓపెన్ చేసి చూస్తే..

దుబాయ్: దుబాయ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. బిడ్డ పుట్టిన 15 నిమిషాలకే ఊపిరాడకుండా చేసి చంపేసిందో తల్లి. అనంతరం శిశువు మృతదేహాన్ని 3 రోజుల పాటు బ్యాగులో పెట్టి ఇంట్లోనే ఉంచింది. ఆ తర్వాత చెత్తకుప్పలో పడేయాలని తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తికి ఇచ్చింది. అనుమానంతో బ్యాగు ఓపెన్ చూసిన ఆ వ్యక్తికి లోపల నవజాత శిశువు మృతదేహం కనిపించింది. దాంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. అనంతరం మహిళను దుబాయ్‌లో కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన సదరు మహిళకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.  


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో నివాసం ఉండే ఓ ప్రవాస మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఆమె గర్భం దాల్చింది. తొమ్మిది నెలల తర్వాత తన ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువు పుట్టగానే గట్టిగా ఏడ్వడంతో మహిళకు ఏం చేయాలో తోచలేదు. చుట్టుపక్కల వారికి తెలిస్తే పరిస్థితి ఏంటని కంగారు పడిన ఆమె.. పసికందును మంచంపై పడేసి దిండుతో ముఖంపై అదిమిపట్టింది. దాంతో శిశువు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన బిడ్డను ఓ నల్లటి బ్యాగులో పెట్టి, మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. సమయం చూసి బయటకు తీసుకెళ్లి పడేయాలనేది ఆమె ఆలోచన. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరు లేని సమయం చూసి తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి చేతికి ఆ బ్యాగ్‌ను ఇచ్చి చెత్త కుప్పలో వేయమని చెప్పింది. అయితే, ఆ వ్యక్తి అంతకుముందు ఆమె గర్భవతిగా ఉన్నపుడు చూశాడు. 


అలాగే మూడు రోజుల క్రితం ఆమె ఇంట్లోంచి చిన్నపిల్లల ఏడుపు కూడా విన్నాడు. అందుకే అతనికి అనుమానం వచ్చింది. కొంతదూరం వెళ్లాక ఆమె ఇచ్చిన బ్యాగ్‌ను తెరిచి చూశాడు. అందులో నవజాత శిశువు మృతదేహం కనిపించింది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని, దాని ఫలితంగా గర్భం దాల్చినట్లు చెప్పింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని పుట్టిన బిడ్డను తానే చంపేసినట్లు అంగీకరించింది. దాంతో ఆమెను తాజాగా దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో కూడా తన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో కోర్టు ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే శిక్షకాలం పూర్తియైన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. 

Updated Date - 2022-05-29T15:43:28+05:30 IST