మాతృభాషలో చదివేందుకు అవకాశం కల్పించండి

ABN , First Publish Date - 2022-07-13T12:59:11+05:30 IST

తమిళనాడులో వున్న భాషాపరమైన మైనారిటీలు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని, ఈ వ్యవహారంలో శాశ్వత ఉపశమనం

మాతృభాషలో చదివేందుకు అవకాశం కల్పించండి

- ఈ వ్యవహారంలో శాశ్వత ఉపశమనం కల్పించండి

- సుప్రీంను ఆశ్రయించిన ‘లింఫోట్‌’


చెన్నై, జూలై 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో వున్న భాషాపరమైన మైనారిటీలు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని, ఈ వ్యవహారంలో శాశ్వత ఉపశమనం కల్పించాలని కోరుతూ ‘లింగ్విస్టిక్‌ మైనారిటీస్‌ ఫోరం ఆఫ్‌ తమిళనాడు’ (లింఫోట్‌) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆచార్య సీఎంకే రెడ్డి నేతృత్వంలోని తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ తదితర మైనారిటీ భాషల ప్రతినిధులతో కూడిన ఈ సంఘం రాష్ట్రంలో మైనారిటీ భాషల జీవం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. 2006లో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ‘నిర్బంధ తమిళం’ జీవోతో రాష్ట్రంలోని తెలుగుతో పాటు మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారు. అయితే ప్రతి ఏడాది హైకోర్టును ఆశ్రయిస్తున్న లింఫోట్‌ ప్రతినిధులు.. ఎప్పటికప్పుడు మైనారిటీ భాషల విద్యార్థులకు తాత్కాలిక ఉపశమనాన్ని సాధిస్తున్నారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు గత విద్యా సంవత్సరంతోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో లింఫోట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అదే విధంగా ఈ వ్యవహారంలో మైనారిటీ విద్యార్థులకు శాశ్వత ఉపశమనం కల్పించేలా ఆదేశించాలని కోరారు. తద్వారా భాషాపరమైన మైనారిటీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని అభ్యర్థించారు. తమిళం నేర్చుకునేందుకు, అందులో చదివేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, కానీ తమిళంతో పాటు తమ మాతృభాషలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుగనుంది.

Updated Date - 2022-07-13T12:59:11+05:30 IST