రష్యా సేనలతో పోరాడి ప్రాణాలొదిలిన ‘మదర్ హీరోయిన్’

ABN , First Publish Date - 2022-03-18T00:59:40+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ..

రష్యా సేనలతో పోరాడి ప్రాణాలొదిలిన ‘మదర్ హీరోయిన్’

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని మొత్తుకుంటున్నా, ఆంక్షలు విధిస్తున్నా లెక్కచేయని పుతిన్.. లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. మరోవైపు, రష్యా సేనల దాడిలో వందలాదిమంది అమాయక ఉక్రేనియన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాదిమంది దేశం దాటుతున్నారు. రష్యా సేనలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ భవనాలు, థియేటర్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. 


రష్యా సేనల దాడిలో ‘12మంది పిల్లల తల్లి’ ఓల్గా సెమిడ్యానోవా ప్రాణాలు కోల్పోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. డొనెట్స్క్ సమీపంలో రష్యా సేనలతో చివరి కంటా పోరాడిన ఆమె చివరికి ప్రాణాలు విడిచారు. రష్యా దళాల చేతిలో తమ యూనిట్‌లోని ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నా ధైర్యం కోల్పోని 48 ఏళ్ల ఓల్గా చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడారు. తూటా పొట్టలోకి దిగబడడం వల్లే ఆమె మృతి చెందినట్టు ఓల్గా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య  అక్కడ ఇంకా భీకర పోరు జరుగుతుండడంతో మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


వైద్యురాలైన ఓల్గా 2014 నుంచి మిలటరీలో సేవలు అందిస్తున్నారు. ఆమెకు ఆరుగురు సంతానం కాగా, స్థానిక అనాథ శరణాలయం నుంచి మరో ఆరుగురిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. దీంతో ఆమె ‘మదర్  హీరోయిన్’ అనే గౌరవ బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. ఐదుగురు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వారికి ‘మదర్  హీరోయిన్’ అనే బిరుదునిస్తారు. మార్చి 3న  డొనెట్స్క్-జపోరిజ్జియా ఒబ్లాస్ట్‌ల మధ్య సరిహద్దులో రష్యా సేనల దాడిలో ఓల్గా మరిణించినట్టు ‘కీవ్ ఇండిపెండెంట్’ తెలిపింది. 


చనిపోయిన ప్రదేశానికి 150 మైళ్ల దూరంలోని మర్హానెట్స్ నగరంలో ఓల్గా నివసించేవారు. ఆమె మరణవార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పించారు. రష్యా దుండగుల దాడిలో ఆమె మరణించినట్టు ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు అంటోన్ గెరాష్‌చెంకో తెలిపారు. రష్యా బలగాల ముందు తన సేనలు బతికి బట్టకట్టలేవని తెలిసినా ఆమె తన దేశం కోసం చివరి వరకు పోరాడారని ప్రశంసించారు. ఆమె తన హీరో అని కొనియాడారు.  

Updated Date - 2022-03-18T00:59:40+05:30 IST