Advertisement

మధ్యప్రదేశ్‌ మదర్‌ థెరెసా

Sep 16 2020 @ 00:00AM

రెక్కలు రాగానే రివ్వున ఎగిరిపోతే... పుట్టిన ఊరు కోసం పాటుపడేవారెవరు?  నను ‘కన్న’ ప్రాంతం... ఆప్యాయతలు పంచిన జనం... అన్నిటినీ వదిలేసి ఎక్కడికి పయనం? 

బాల్యం నుంచి ఇవే ప్రశ్నలు డాక్టర్‌ లీలా జోషిని వేధించాయి. అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఆమె పట్టుపట్టి వైద్యురాలు అయ్యారు. తన ప్రాంతంలోని గిరిజన మహిళల బాగోగులు చూసుకొంటూ మాతృభూమి రుణం తీర్చుకొంటున్నారు. ఆమె సేవలకు మెచ్చి కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ఇచ్చింది. 82 ఏళ్లు పైబడిన ఆమె కరోనా సమయంలోనూ కార్యదీక్షతో ముందుకు సాగుతున్నారు. 


‘మధ్యప్రదేశ్‌ మదర్‌ థెరెసా’గా పేరుపొందిన 82 ఏళ్ల డాక్టర్‌ లీలా జోషీ దీక్ష ఒక్కటే... మారుమూల రత్లామ్‌ గ్రామంలోని గిరిజన మహిళలకు ఉచితంగా వైద్యం అందించడం! వృద్ధాప్యం మీద పడినా ఆమె అంకితభావంలో ఇసుమంతైనా మార్పు లేదు. ఇరవై రెండేళ్లుగా అదే కార్యదీక్షతో పేదవారికి సేవ చేస్తున్నారు. రత్లామ్‌లోనే పుట్టి పెరిగిన ఆమె ప్రయాణంలో ఆటుపోటులెన్నో. స్థానిక రైల్వే పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించిన లీలా... గంగాపూర్‌ నగరంలో హైస్కూల్‌ చదువు పూర్తి చేశారు. జైపూర్‌ మహారాణీ కాలేజీలో సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌ అవ్వగానే ఇండోర్‌ ఎంజీఎం కళాశాలలో మెడిసిన్‌లో చేరారు.


1961లో వైద్య విద్య పట్టాతో బయటకు వచ్చిన ఆమె... అక్కడి నుంచి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తను, తన కుటుంబం కోసమే కాకుండా ఈ సమాజానికీ కొంత తిరిగివ్వాలనే మహోన్నత ఆలోచనతో ముందడుగు వేశారు. 


అసిస్టెంట్‌ సర్జన్‌గా... 

వైద్య విద్య అవ్వగానే 1962లో లీలా కోటాలోని రైల్వే ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సర్జెన్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు లీలా. ఒక్కో మెట్టూ ఎక్కుతూ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 1991లో రైల్వే మంత్రిత్వ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆరోగ్యం)గా నియమితులయ్యారు. కొంతకాలం ముంబయిలో మెడికల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చివరకు అసోమ్‌ చీఫ్‌ మెడికల్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందారు.


అయితే వృత్తిలో పని ఒత్తిడి ఎంత ఉన్నా లీలా జోషీ సామాజిక సేవకూ కొంత సమయం కేటాయించేవారు. 1970ల్లో ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిక్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీ’తో కలిసి రత్లామ్‌, కోట, డెహ్రాడూన్‌లలో పలు వైద్య శిబిరాల్లో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే 1980లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో అప్పటి ప్రధాని ఇందిరను కలిశారు. లీలా సేవలను ఆ సందర్భంగా ఇందిర కొనియాడారు. మరింత ఉధృతం... 

ఉద్యోగ విరమణ తరువాత ఎవరైనా విశ్రాంతి కోరుకొంటారు. తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఏమేం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తుంటారు. కానీ లీలా జోషీ అందుకు భిన్నం. అరవై ఏళ్ల వయసు(1991)లో రిటైరైన ఆమె అసలు జీవితం అప్పుడే మొదలైంది. మునుపటి కన్నా ఉత్సాహంగా పని చేయడం ప్రారంభించారు.


పూర్తి సమయం రత్లామ్‌ చుట్టుపక్కల ప్రాంతాల వారి అభ్యున్నతికే కేటాయించారు. అక్కడి మహిళలు, యువతులకు శాపంగా మారిన రక్తహీనత సమస్యపై పోరాటం చేశారు. గర్భ సంబంధిత ఇబ్బందులను తొలగించేందుకు కృషి సలిపారు. 
పరిమళించే మానవత్వం... 

ఎప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రపంచమే కానీ... తన గురించి తాను శ్రద్ధ పెట్టరు డాక్టర్‌ లీలా. గైనకాలజిస్ట్‌గా ఎంతో మంది గిరిజన మహిళలకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆమె, ఆడంబరాలకు దూరం. శరీరం సహకరించకపోయినా... వయసు మీద పడినా... నేటికీ ఆమె క్రమం తప్పకుండా గిరిజన ప్రాంతాలకు వెళతారు. వారికి ఉచిత వైద్యం అందిస్తారు. ఈ డాక్టర్‌ను చూడగానే ఓ ఇంటి పెద్ద వచ్చినంత ఆనందం కనిపిస్తుంది అక్కడి వారి కళ్లల్లో.


1997లో ‘దివాకర్‌ జైన్‌ హాస్పిటల్‌’ నెలకొల్పిన్పటి నుంచి లెక్కలేనన్ని వైద్య శిబిరాలు ఆమె నిర్వహించారు. ఆ సమయంలో రత్లామ్‌ జిల్లాలోని పేద మహిళలు రక్తహీనతతో మృత్యువు బారిన పడుతుండేవారు. అయితే లీలా కృషితో ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఇలా ఒకటి రెండు కాదు... ఎక్కడ ఆరోగ్య సమస్య ఉంటే అక్కడ వాలిపోతారు ఆమె. అందుకే మరో ‘మదర్‌ థెరిసా’గా స్థానికులు గౌరవిస్తారు. 


కరోనా సమయంలోనూ... 

ప్రస్తుతం దేశమంతటా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ సమయంలోనూ ఆమె వయసును లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. అవసరమైనవారికి ఆహారం, మాస్క్‌లు అందించారు. కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో గిరిజనులకు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలకు ఆన్‌లైన్‌లో అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు.


ఆరోగ్య సమస్యలుంటే వైద్య సలహాలు ఇస్తున్నారు. అవసరమైనవారికి వైద్యం అందేలా చూస్తున్నారు. ఉదయం ఐదు గంటలకు ఆమె దినచర్య మొదలవుతుంది. అది మొదలు ప్రజలతోనే మమేకమవుతారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తారు. అందులో తన కోసం తాను కేటాయించేది అతి తక్కువ సమయం. 


ఆవార్డులెన్నో... 

సమాజం బాగు కోసం ఎళ్లి కూడా వద్దనుకున్న డాక్టర్‌ లీలా జోషీ నిస్వార్థ సేవకు పద్మశ్రీ కంటే ముందు ఎన్నో గౌరవ పురస్కారాలు దక్కాయి. 2015లో కేంద్ర మహిళ శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రకటించిన దేశంలోని టాప్‌-100 ప్రభావవంతమైన మహిళల జాబితాలో లీలా పేరు కూడా ఉంది.

2016లో నాటి రాష్ట్రప్రతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా 100 మంది విజయవంతమైన మహిళల్లో ఒకరిగా అవార్డు అందుకున్నారు. 2013లో రైల్వే శాఖ ‘విశిష్ట సేవా పురస్కారం’తో సత్కరించింది. ఆ తరువాతి సంవత్సరం ‘ఉమెన్‌ ప్రైడ్‌’ అవార్డు దక్కింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం లీలాకు ‘పద్మశ్రీ’ ప్రకటించింది. 

  హనుమా అమ్మే నాకు స్ఫూర్తి...


ఎక్కడో మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్న కృషిని గుర్తించినందుకు సంతోషంగా ఉంది. మా అమ్మే నాకు స్ఫూర్తి. గర్భం దాల్చిన సమయంలో ఎంతో మంది మృత్యువాతపడుతుండటం ఆమెను కలచివేసింది. అవి చూసినప్పుడల్లా అమ్మ చెబుతుండేది... సరైన వైద్య సదుపాయాలు ఉంటే ఈ మరణాలన్నింటినీ ఆపవచ్చని! తను ఓ డాక్టరో, వైద్య సిబ్బందో కానందుకు ఎన్నోసార్లు బాధపడేది.


అమ్మ ఆవేదన బాల్యంలో నా మెదడులో నాటుకుపోయింది. ఎలాగైనా డాక్టర్‌ను కావాలని అనుకునేదాన్ని. ఆ సంకల్పమే నన్ను ఇక్కడి వరకు నడిపించింది. నేను పెళ్లి కూడా చేసుకోలేదు. కుటుంబ బాధ్యతలు లక్ష్యం నుంచి ఎక్కడ నన్ను వెనక్కి లాగుతాయోనన్న ఆలోచనతోనే పెళ్లి వద్దనుకున్నా. నా చెల్లి గాయత్రి కూడా వైద్యురాలే. తనే నన్ను చూసుకొంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలవారందరూ మమ్మల్ని తమవారుగా భావిస్తారు.


నా రిటైర్‌మెంట్‌కు ముందు చివరి పోస్టింగ్‌ అసోం గువహటిలో! అప్పుడు అక్కడ మదర్‌ థెరెసాను కలిసే అవకాశం లభించింది. ‘గిరిజనుల కోసం పనిచేయి’ అని ఆ సందర్భంలో మదర్‌ చెప్పారు. ఆ మాటలు నాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. ప్రస్తుతం నా లక్ష్యమల్లా... ఎనీమియాతో మరే తల్లీ ప్రాణాలు పోగొట్టుకోకూడదు. దాని కోసం నా ఊపిరి ఉన్నంత వరకూ శ్రమిస్తూనే ఉంటాను. నేటి తరానికి చెప్పేదొక్కటే... ‘డబ్బు ముఖ్యం కాదు. సంపాదన రేసులో పరుగెత్తవద్దు. ఇష్టపడి కష్టపడితే ఆ తరువాత డబ్బే మన వెంట పడుతుంది’. 

- డాక్టర్‌ లీలా జోషి


Follow Us on:
Advertisement
Advertisement

రెడ్ అలర్ట్మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.