మలయాళీల మాతృభాషా మమకారం

Jun 16 2021 @ 00:58AM

మనిషి తన మనుగడను గుర్తించడంలో మాతృభాష పాత్ర మౌలికమైనది. స్వస్థలాలకు సుదూర ప్రాంతాలలో మాతృభాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిత్యజీవితంలో ఏ వ్యక్తి అయినా భావగ్రహణ, భావవ్యక్తీకరణలకు మాతృభాషపైనే ఆధారపడతాడు. పని చేసే చోట ఒకే ప్రాంతానికి చెందినవారు ఎక్కువ మంది ఉంటే వారు మాతృభాష ద్వారా తమ ప్రాబల్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఇతరులను నియంత్రిస్తారనే అపవాదు ఉంది. దుబాయి గానీ, హైదరాబాద్ గానీ, మలయాళం మాట్లాడే కేరళ ఉద్యోగులు మలయాళంలో మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు. తమ పని విధానాన్ని సైతం అదే భాషకు పరిమితం చేయడం కద్దు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో నర్సులు మలయాళం మాట్లాడకూడదని, కేవలం ఆంగ్లం లేదా హిందీలో మాత్రమే మాట్లాడాలని ఉత్తర్వు జారీ చేయడంపై దుమారం చెలరేగింది.


నర్సింగ్ రంగంలో మలయాళీలు ప్రపంచ ప్రసిద్ధులు. గల్ఫ్ దేశాలలో దుబాయి నుంచి మక్కా వరకు ఆసుపత్రి ఉన్న ప్రతి చోటా మలయాళీ నర్సులదే పెత్తనం. నలుగురు    మలయాళీలు ఉన్న చోట ఇతరులు సాఫీగా పని చేయడం అంత సులువు కాదు. పనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ భాషలో తమ వారికి చెప్పిన విధంగా ఇతర భాషల వారికి వివరించరనే ఆరోపణ వారిపై ఉంది. ఆసుపత్రిలో తమ విధులు పూర్తి చేసుకున్న అనంతరం ఒక నర్సు తన అధీనంలోని రోగుల స్థితిగతుల గూర్చి విధుల్లోకి వచ్చే మరో నర్సుకు వివరించడాన్ని ‘ఎండార్స్’ అని అంటారు. దీనిని, మలయాళీలు దాదాపుగా మలయాళంలో చేస్తారు. మలయాళం రానివారు ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వారిపై కూడా ఇదే ఆరోపణ ఉంది. పనికి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకునే విషయమై ఫిలిప్పీన్స్ నర్సులు, మన కేరళ నర్సులకు మధ్య భాషాపరమైన వివాదాలు నెలకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితమే, మస్కట్‌లోని ప్రముఖ ఆసుపత్రులలో భాషాపరమైన గొడవలు జరిగేవి. వాటి నుంచి బయటపడడానికి కేవలం ఆంగ్లం మాట్లాడాలని ఉత్తర్వు జారీ చేశారు. గల్ఫ్ దేశాలలోని అనేక ఆసుపత్రులు ఆ తర్వాత ఈ విధానాన్ని అనుసరించాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి గల్ఫ్‌లోని భారీ ఆసుపత్రుల వరకు నర్సింగ్‌ రంగంలో మలయాళీ భాష అత్యంత కీలకమైన పాత్ర వహిస్తోందంటే అశ్చర్యం కలుగుతుంది. 


భారతదేశంలో నమోదైన మొత్తం 20లక్షల మంది నర్సులలో 18లక్షల మంది మలయాళీలు. వీరిలో అత్యధికులు కేరళలోని కొన్ని జిల్లాలకు చెందినవారు కావడం విశేషం. అసలు నర్సింగ్ వృత్తికి, కేరళకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. భారతదేశంలో క్రైస్తవం వ్యాప్తి చెందిన మొదటి నేల కేరళ. క్రైస్తవ ధర్మంలో రోగులకు సేవలు చేయడం అనేది ఒక పవిత్రకార్యం. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఇటు దుబాయిలో రాజు శేఖ్ మోహమ్మద్‌కు వ్యాక్సిన్లు ఇచ్చింది కూడా మలయాళీ నర్సులే. గల్ఫ్, యూరోపియన్ దేశాలలో కూడ కేరళకు చెందిన నర్సులు తమ రంగంలో అత్యంత ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. రోగులతో వారి వారి భాషలలో మలయాళీ నర్సులు మాట్లాడతారు. ఇటలీలో మలయాళీ నర్సులు ఇటాలియన్ భాషలో, కలకత్తాలో బెంగాలీ భాషలో రోగులతో మాట్లాడడాన్ని చూశానని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ చెప్పడం గమనార్హం. ఓర్పు, సహనం, శ్రద్ధగా రోగులకు సేవలందించడంలో కేరళ నర్సులకు ప్రపంచంలో కేవలం ఫిలిప్పీన్స్ నర్సులు మాత్రమే సరి సమానమైనవారు. మలయాళీల తర్వాత నర్సింగ్ వృత్తిలో తమిళులు, తెలుగువారు ప్రముఖంగా కనిపిస్తారు. మన వారి ప్రతిభ ఎలా ఉన్నా మలయాళీలను ఎదిరించి వృత్తిలో ఇమడలేరు. ఆ రకమైన ప్రాబల్యం, పట్టు మలయాళీలది. 


అసలు మలయాళీలు, తమిళులకు తమ మాతృభాష పట్ల ఉన్న మమకారం మన తెలుగువారికి మన మాతృభాష పట్ల లేదనేది నిష్టుర సత్యం. ఇతరులు తమ మాతృభాష గురించి గర్వపడితే మన వాళ్ళు న్యూనతగా భావిస్తారు. త్రిచూర్‌కు చెందిన నంబూద్రి బ్రాహ్మణుడు గానీ, మల్లప్పురంకు చెందిన తంగల్ ముస్లిం కానీ, కొట్టాయంకు చెందిన థామస్ క్రైస్తవుడు గానీ ఒక్క మలయాళం పలుకు వింటే చాలు తన మతాన్ని పక్కన పెట్టి కేవలం మలయాళీగా మాత్రమే ఉంటాడు. ప్రమాదవశాత్తు అపస్మారక స్థితిలో ఒక మలయాళీ తారసపడితే మలయాళీ నర్సు తాను ఉంటున్న ఎడారి కుగ్రామం నుంచి రాజధానిలోని భారతీయ ఎంబసీ వరకు తలుపులు తడుతూ సహాయం కొరకు అర్థిస్తుంది. మానవత పరిమళించే మాతృభాషా మమకారమది. 

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.