ఆమె పెద్ద మనసుకు ప్రశంసలు.. రూ.2 లక్షలు కట్నం ఇచ్చి కోడలికి మళ్లీ పెళ్లి చేసిన అత్త!

ABN , First Publish Date - 2022-05-04T18:46:38+05:30 IST

అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది ఓ సామెత.

ఆమె పెద్ద మనసుకు ప్రశంసలు.. రూ.2 లక్షలు కట్నం ఇచ్చి కోడలికి మళ్లీ పెళ్లి చేసిన అత్త!

అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది ఓ సామెత. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ అత్త.. కోడలు ఉన్నా సరే తను గుణవంతురాలినేనని నిరూపించుకుంది. కోడలికి తల్లిలా మారి ఆమె భవిష్యత్తుకు మార్గం చూపించింది. కరోనా సమయంలో కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయిన కోడలికి దగ్గరుండి మరో పెళ్లి చేసింది. అందుకోసం తను దాచుకున్న రూ.2 లక్షలను కట్నంగా ఇచ్చింది. ఆ మహిళ పెద్ద మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లా శ్రీమాధోపూర్ గ్రామానికి చెందిన ముఖేష్ సోని అనే వ్యక్తి గతేడాది కరోనా బారిన పడ్డాడు. కొద్ది రోజుల చికిత్స అనంతరం అతను మృతి చెందాడు. దీంతో ముఖేష్ భార్య పూజ ఒంటరి అయిపోయింది. ఏడాది వయసున్న కూతురుతో కలిసి అత్తింట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన కోడలికి ముఖేష్ తల్లి లత అండగా నిలిచింది. కోడలు, మనవరాలి బాధ్యత తీసుకుంది. తన కోడలికి రెండో పెళ్లి చేసేందుకు ఆరు నెలలుగా ప్రయత్నిస్తోంది. చివరకు కైలాష్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది. 


ఆ పెళ్లికి కట్నంగా తన దాచుకున్న రూ.2 లక్షలు చెల్లించింది. బంధుమిత్రులందరినీ పిలిచి ఓ గుళ్లో కోడలి పెళ్లి చేసింది. తనే స్వయంగా కన్యాదానం చేసింది. అనంతరం మనవరాలిని తన దగ్గరే ఉంచుకుని కోడలిని కాపురానికి పంపించింది. అత్త అయినా తల్లిలా ప్రవర్తించిన మహిళ పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Read more