అమ్మా.. నీకు వందనం

ABN , First Publish Date - 2021-05-09T16:29:38+05:30 IST

నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. ఆమె త్యాగానికి ప్రతిరూపం...

అమ్మా.. నీకు వందనం

హైదరాబాద్‌ సిటీ : ‘‘నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. ఆమె త్యాగానికి ప్రతిరూపం. తన కడుపున పుట్టని వాళ్లకూ మాతృత్వపు మాధుర్యాన్ని పంచగల దయామయి తల్లి ఒక్కతే. మానవాళి మనుగడకు అమ్మప్రేమే ఆధారం. కరోనా కష్టకాలంలో కొందరు మహిళామణులు మాతృ హృదయంతో తమవంతు సేవలు అందిస్తున్నారు. సాటి మనుషుల కన్నీళ్లు తుడిచేందుకు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇవాళ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా విపత్కాలంలో నిస్వార్థ సేవలు అందిస్తున్న కొందరు మాతృమూర్తుల సేవా స్ఫూర్తిపై కథనం.’’ 


బాధితులకు బాసటగా..

ఆచార్య సూరేపల్లి సుజాత...శాతవాహన యూనివర్సిటీలో సోషయాలజీ ప్రొఫెసర్‌. కరోనా కాలంలో ప్రతి సందర్భంలోనూ ఆమె పేదల పక్షాన నిలిచారు. తన వంతు ఆర్థిక, హార్థిక సాయం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో వలస శ్రామికులకు నిత్యవసర వస్తువులు సమకూర్చడం దగ్గర నుంచి వాళ్లను సొంతూర్లకు చేర్చేవరకూ సుజాత అవిరళకృషి చేశారు. మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లోనూ దళిత ఉమెన్స్‌ కలెక్టీవ్‌ ప్రతినిధిగా సుజాత ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ తరగతుల వల్ల పేద విద్యార్థులు చదువుకి దూరమవుతున్న సంగతిని గమనించిన ఆమె, కొందరు మనసున్న మనుషుల సాయంతో కొన్నివందల స్మార్ట్‌ఫోన్లను అర్హతగల విద్యార్థులకు పంచారు. కరోనా రెండోదశ వ్యాప్తి సమయంలోనూ సుజాత కొందరు వలంటీర్లను కూడగట్టి ‘‘వలంటీర్స్‌ ఫర్‌ కొవిడ్‌ గ్రూపు’’ ద్వారా పేదలకు మందులు, ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు వంటి అత్యవసర పరికరాలు, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ‘‘వలంటీర్స్‌ ఫర్‌ కొవిడ్‌ వాట్సాపు గ్రూపులు రెండున్నాయి. మరొక టెలిగ్రామ్‌ గ్రూపు కూడా నిర్వహిస్తున్నాం. అందులో వైద్యులూ చాలామంది ఉన్నారు. వాళ్ల ద్వారా మా దృష్టికి వచ్చిన కొవిడ్‌ బాధితులకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నాం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు కరీంనగర్‌, సిరిసిల్ల, జుక్కల్‌ తదితర ప్రాంతాల్లోనూ మా వలంటీర్లు సేవలందిస్తున్నారు. కొన్ని నిరుపేద కుటుంబాలకు ఆక్సీమీటర్లు, నెబిలైజర్లు, థర్మామీటర్లు, విటమిన్‌ మాత్రలు...ఇలా అవసరమైనవి అందిస్తున్నాం. తద్వారా వాళ్లలో కొంత ధైర్యాన్ని పెంపొందించాలనేది మా ఉద్దేశం’’ అంటారు సుజాత. తరగతి గదిలో పాఠాలు బోధించే ఈ ఆచార్యురాలు ఆపదలోని వారందరికీ అమ్మలా సహాయం అందిస్తున్నారు. తోటి ప్రొఫెసర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


‘తావూన్‌’ ఆపన్న హస్తం

కొవిడ్‌ బాధితులకు అత్యవసరమైన ఆక్సిజన్‌, ఆస్పత్రిలో బెడ్లు తదితర విషయాల్లో సాయమందిస్తూ, హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తున్నారు ఫర్హానా ఖాన్‌. ఆమె కొంతకాలంగా మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ద్వారా పేద విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నారు. కరోనా సమయంలో తాను ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి ‘తావూన్‌’ వాట్సాప్‌ గ్రూపు ద్వారా కొవిడ్‌ రోగులకు బాసటగా నిలుస్తున్నారు. ‘‘ప్రస్తుతం మా గ్రూపులో పదిహేనుమంది వైద్యులున్నారు. వాళ్ల సహకారంతో మా హెల్ప్‌లైన్‌ ద్వారా కొవిడ్‌ పేషెంట్లకు ఉచిత సలహా, సూచనలు ఇస్తున్నాం. కొందరు నర్సింగ్‌ స్టాఫ్‌కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ, నర్సుల సహాయం అవసరమైన వాళ్లకు తక్కువ ఖర్చుతో నర్సింగ్‌ సేవలనూ అందిస్తున్నాం. నగరంలోని ఆస్పత్రుల నెట్వర్క్‌తో కలిసి అక్కడ బెడ్ల ఖాళీలపై ఒక డేటా రూపొందించాం. అందులో నేను సికింద్రాబాద్‌ ప్రాంతానికి సంబంధించిన సమాచారమంతా సేకరించాను. ఆస్పత్రిలో బెడ్‌ అవసరమున్న వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తే, ఏ ప్రాంతంలోని ఆస్పత్రిలో ఖాళీలున్నాయో తెలుపుతాం. అత్యవసరమైన రోగులకు ఆక్సిజన్‌ కూడా అందించాం. మా గ్రూపుతో మరో పదిహేను స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. హెల్ప్‌ హైదరాబాద్‌ సంస్థ నిర్వాహకురాలు ఖాద్రీతో కలిసి మేమంతా సమష్టిగా కరోనా బాధితులకు మా వంతు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఫర్హానా ఖాన్‌ చెబుతున్నారు. ఆస్పత్రిలో బెడ్లు వివరాలు తదితర విషయాల్లో ‘తావూన్‌’ సేవల కోసం 9642651476 నెంబర్‌ను సంప్రదించవచ్చు.


ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణలు 

కష్టకాలంలో కొందరు అమ్మలు అన్నపూర్ణలుగా మారారు. హోం ఐసోలేషన్లో ఉన్నవాళ్లకు ఉచితంగా భోజనం పంపుతున్నారు. వాళ్లకు పాజిటివ్‌ రిపోర్టు పంపి, అడ్రస్‌ చెబితే చాలు, మంచి భోజనాన్ని ఇంటి ముంగిటకు తెచ్చిస్తున్నారు. అలా శ్రీనగర్‌ కాలనీకి చెందిన నిహారికారెడ్డి రోజుకి నూటయాబై మందికి భోజనాలను ఉచితంగా పంపుతున్నారు. యూస్‌ఫగూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని హోంక్వారంటైయిన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులు తమను ఒకరోజు ముందు సంప్రదిస్తే, ఉచితంగా భోజనం తమ ఇళ్లకే పంపుతామని నిహారికా రెడ్డి చెబుతున్నారు. అందుకు 9701821089 నెంబర్లో సంప్రదించవచ్చు.


మెహదీపట్నానికి చెందిన ఖలీదా పర్వీన్‌ నిత్యం నూటయాభై మంది కొవిడ్‌ రోగులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. లంగర్‌హౌస్‌, షేక్‌పేట్‌ తదితర ప్రాంతల్లోని క్వారంటెయిన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులు భోజన సహాయం కోసం 9700109083 నెంబర్లో సంప్రదించవచ్చు. మియాపూర్‌ పరిసరాల్లో స్వీయ నిర్బంధంలో ఉన్న కొవిడ్‌ బాధితుల ఇంటి ముంగిటకే చేరుస్తున్నారు ఆశ్రి ఫౌండేషన్‌ నిర్వాహకురాలు పూర్ణిరెడ్డి. బొల్లారం ప్రాంతంలోని నిరుపేద శ్రామికులకు నిత్యావసర సరుకులు పంచుతున్నారు. ఆశ్రి సేవల కోసం 9293414444 నెంబర్లో సంప్రదించవచ్చు.




పిల్లల్ని దగ్గరకు తీసుకోక సంవత్సరం

సీహెచ్‌. సుజాత... గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సు, తనతో పాటు 600 మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో కొందరు చండిబిడ్డల తల్లులూ ఉన్నారు. వారంతా తమ కడుపున పుట్టిన బిడ్డలను దూరం పెడుతూ, రోగుల సేవలో నిమగ్నమయ్యారు. ‘‘పేషెంట్లూ మా బిడ్డలే. అలా అనుకోకుంటే మేము ఈ వృత్తికి న్యాయం చేయలేం కూడా. కరోనా తొలిదశలో మాకు క్వారంటెయిన్‌ సెలవులుండేవి. ప్రత్యేక వసతి కూడా కల్పించారు. పైగా అప్పుడు ఇంత సీరియస్‌ కండీషన్‌ లేదు. ఇప్పుడంతా దుఃఖమయమే. నర్సులూ చాలామంది కొవిడ్‌ బారినపడ్డారు. నాతోటి నర్సు భర్త కొవిడ్‌తో చికిత్స పొందుతూ వారం కిందట మా కళ్లముందే కన్నుమూశాడు. వాళ్ల పిల్లలు మాకు ఫోను చేసి, ‘మా డాడీని ఎప్పుడు డిశార్జీ చేస్తారు ఆంటీ’ అనడుగుతున్నారు. ఆ పసిపిల్లలకు మేమేమి సమాధానం చెప్పాలి. కొందరు చంటి బిడ్డల తల్లులైతే ఏడాదిగా పిల్లలను దూరం ఉంచి, నర్సు డ్యూటీలు చేస్తున్నారు. నాకూ ఇద్దరు మగపిల్లలు. నా పిల్లల్ని దగ్గరికి తీసుకోక సంవత్సరం అవుతుంది. అయినా బాధలేదు. ఇలాంటి కష్టసమయంలో నర్సుగా సేవచేయడం గర్వంగా ఉంది. ఆస్పత్రిలో అయినవాళ్లను పోగొట్టుకొని గుండెలవిసేలా రోదిస్తున్న రోగుల బంధువుల కన్నీటి గాథలను చూస్తున్న మాకు కడుపు తరుక్కుపోతుంది. కొన్నిసార్లు మాలోనూ ఽభయం కలుగుతుంది. అందుకే, ప్రజలారా! దయచేసి అనవసరంగా బయట తిరగద్దు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించండి’’ అంటూ సుజాత విన్నవిస్తున్నారు.

Updated Date - 2021-05-09T16:29:38+05:30 IST