అమ్మంటే ఆత్మీయత.. అమ్మంటే ధైర్యం!

May 9 2021 @ 18:18PM

అమ్మంటే ఆత్మీయతను పంచుతుంది. కన్న బిడ్డల అల్లరిని భరిస్తుంది. మన మనసులోని మాటలను నాన్నకు చెబుతుంది. మనకు అన్నీ తానై నిలుచుంటుంది. కొన్నిసార్లు ఆంక్షలూ పెడుతుంది. అన్నిటికీ మించి వంటిల్లే ప్రపంచంగా బతికేస్తుంది.. ఇది నిన్నటి అమ్మల మాట. ఇప్పుడు అమ్మ మారుతోంది. అంటే అమ్మ ఈ విషయాలన్నీ చేయడం లేదని కాదు... వీటన్నిటికీ మించి చేస్తోంది. ఇంటా, బయటా నెగ్గుకొస్తోంది. నాన్నకు ఆసరాగా నిలుస్తోంది. ఇంటి బయట మనం వెతుక్కునే స్నేహాన్ని కూడా నట్టింట్లోనే అందిస్తోంది. తన భుజాలను దాటి ఎదిగిన పిల్లలతో భుజాన్ని కలుపుతూ అన్నీ విషయాల్లోనూ భరోసా ఇస్తోంది. కళ్లముందు కనిపించే మార్పును సమాజం కన్నా ముందే గుర్తించే చలనచిత్ర పరిశ్రమ ఈ విషయంలోనూ ఒక్క అడుగు ముందుగానే ముందుకేసింది...
అమ్మకు వంటింటి గరిటే కాదు... బ్యూటీపార్లర్‌కు వెళ్లే ధైర్యాన్నిచ్చింది. హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గదన్నట్టు స్టైలిష్గా  అదే సమయంలో పద్ధతిగానూ తీర్చిదిద్ది, భుజానికి ఓ హ్యాండ్‌బ్యాగ్‌ తగిలించి, ముఖంపై చిరునవ్వులు పూయించి, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చింది.  

కొడుకును తీర్చిదిద్దుతూ... చనువిచ్చే అమ్మ..
రవితేజకు తల్లిగా జయసుధ నటించిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ ఈ తరహా చిత్రాలకు ఊపిరిలూదాయి. బాక్సింగే జీవితం అనుకున్న భర్తను తన ఇష్టానుసారంగా ఎదగనిచ్చి, తనంతట తాను ఉద్యోగం చేసుకుంటూ కొడుకును తీర్చిదిద్దిన ఓ తల్లి కథతో స్ఫూర్తిదాయకంగా సినిమా చేశారు పూరి జగన్నాథ్‌. సరిగ్గా ఇలాంటి పాత్రనే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’లో రమ్యకృష్ణ పోషించారు. భర్తను పోగొట్టుకున్నప్పటికీ కొడుకును బాధ్యతగా పెంచిన భార్యగా ‘అలా మొదలైంది’లో రోహిణి కనిపించారు. తన మనసులోని మాటలను మచ్చుకైనా దాచనంతగా కొడుకుకు చనువిచ్చి అన్నీ తానై నిలిచిన పాత్ర ఆమెది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘‘అలా మొదలైంది చూసిన చాలా మంది.. ‘నీ సోల్‌మేట్‌ని నువ్వే వెతుక్కోరా..’ అని అన్న నన్ను చూసి ‘మీలాంటి అమ్మ ఉంటే చాలా బావుంటుంది. అమ్మ అంటేనే ఓ కమ్మనైన పదం. ఆ బిహేవియర్‌ రీల్‌ లైఫ్ అయినా, రియల్ లైఫ్ అయినా 
ఒకేలా ఉంటుంది. నా కొడుకుతోనూ నేను ఇలానే ఉంటా’’ అని అన్నారు. అలాగే రంగ్‌దే చిత్రంలో కూడా ‘గెలవడం కోసం కాదు... కలవడం కోసం పోరాడు’ అని తన కూతురుకి నచ్చజెప్పే బాధ్యతాయుతమైన తల్లి పాత్ర ఆమెది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో మధుబాల కూడా ఓ అమ్మాయికి తల్లిగా నటించారు.  ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇద్దరు కుమార్తెలున్నారు. అందుకే ఓ ఆడపిల్ల తల్లిగా నటించడం నాకేమీ ఇబ్బందిగా అనిపించలేదు. కథ నచ్చి చేశాను’’ అని చెప్పారు. 

తనుంటే బ్యూటీఫుల్‌ సినిమా..
‘ఏమైంది ఈ వేళ’ చిత్రం క్లైమాక్స్‌లో హీరోకు తల్లిగా నటించిన ప్రగతి చెప్పిన డైలాగులకు అప్పట్లో చాలా మంచి స్పందన వచ్చింది. ‘కాసేపు నీతో ముభావంగా ఉంటున్నందుకే ఇంతగా బాధపడుతున్నావ్‌.. అలాంటిది ఇన్నేళ్లు నిన్ను పెంచిన తల్లితో మాట్లాడకుండా ఉంటే ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది’ అని కోడలితో ఆమె చెప్పే మాటలకు థియేటర్లో విజిల్స్‌ మోగాయి. ఆ తర్వాత కూడా ప్రగతి నటించిన పలు చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. చేస్తున్న తల్లి పాత్రల గురించి ప్రస్తావిస్తూ ‘‘నేను తల్లిగా నటించానంటే అది బ్యూటీఫుల్‌ సినిమా’’ అని సరదాగా అంటుంటారు.

ఆమె ముందు వి ఆర్‌ నథింగ్‌...
ఒకప్పటి బాల నటి, ఇప్పడు తల్లి పాత్రలతో మెప్పిస్తున్న తులసి తెరమీద చేస్తున్న పాత్రల గురించి చెబుతూ ‘‘నేను ఏ మదర్‌ క్యారెక్టర్‌ చేసినా అందులో కావలసినంత ప్రేమ ఉంటుంది. నాలో ఉన్న క్వాలిటి అదే. అమ్మ అనగానే రెండు రకాలుగా బిహేవ్‌ చెయ్యడం నాకు రాదు. నేను చాలా సెన్సిటివ్‌. అమ్మలో ఉన్న క్వాలిటీ ప్రేమను పంచడమే. అది రీల్‌ లైఫ్‌ అయినా... రియల్‌ లైఫ్‌ అయినా నేను అదే చేస్తా. తల్లి దీవెన లేకుండా మనిషి మనిషిగా ఉండలేడు. ఎంతమంది బిడ్డలున్నా అందరినీ ఒకేలా చూసుకునే గుణం ఒక అమ్మ దగ్గరే ఉంటుంది. తల్లి ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తుందో, ఎవరి కోసం ఎక్కువగా ఎదురుచూస్తుందో.. ఎవరు పక్కన ఉంటే తల్లి ఆనందంగా ఉంటుందో వాళ్లు జీవితంలో చాలా బావుంటారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను, నా సోదరుణ్ణి ఎంతగా ప్రేమించి పెంచిందో.. అంతే ప్రేమగా మేము అమ్మతో మెలుగుతాం. లైఫ్‌లో మేం ఇంత ఆనందంగా ఉండటానికి అదే కారణం అనుకుంటున్నా. అమ్మ మనకు ఏదైనా ఇవ్వగలదు. ఆమెకు మనం ఏం ఇవ్వగలం చెప్పండి. ఆవిడతో హాయిగా గడిపే క్షణాల్ని మనకు ఇచ్చినందుకు ఆనందపడాలంతే. అంతకు మించి అమ్మకు మనం ఏం చెయ్యలేం. తల్లి ముందు వి ఆర్‌ నథింగ్‌. సహనం, ఓర్పు, ఆకలి, తీపి, సంతోషం ఏదైనా అమ్మే చూపించాలి. ఆ నేచర్‌, క్వాలిటీ ఒక్క అమ్మ దగ్గరే ఉంటాయి. ఏ రంగంలో గమనించినా అమ్మను నిజంగా ప్రేమించే వాళ్లే రోజురోజుకీ ఎదుగుతుంటారు. ప్రతిరోజు అమ్మతో గడపకపోయినా పర్వాలేదు. ఆవిడ కృష్ణారామా అనుకుంటూ జీవితం సాగిస్తుంది. బిడ్డగా పుట్టినందుకు ఆవిడ మనసు నొప్పించకుండా ఉంటే అదే ఆమెకు పదివేలు. బిడ్డకు జన్మనివ్వడమే పాపం అని తల్లి అనుకునేలా చెయ్యకూడదు. నా తల్లి పట్ల నేను ఎంత ప్రేమగా వ్యవహరిస్తానో.. అంతకుమించిన ప్రేమతో నా కన్న బిడ్డ సాయితరుణ్‌ నన్ను చూసుకుంటాడు. తల్లిని గుర్తు పెట్టుకుంటే ఎంతలేదనుకున్నా.. నీ కావలసింది నీ దగ్గరకొచ్చేస్తుంది అన్నది నా నమ్మకం’’ అని చెప్పారు.

అలాంటి సినిమాల సంఖ్య స్వల్పమే అయినా...
‘కల్యాణ వైభోగమే’ చిత్రంలో రాశీ చేసిన పాత్ర ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పాత్రను ఒప్పుకున్న తీరును రాశి హృద్యంగా చెప్పారు. ‘‘నేను హీరోయిన్‌గా వాలంటీర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకున్నా. కానీ ఆ విషయాన్ని ఎవరితోనూ ఎప్పుడూ చెప్పలేదు. ఓ సారి నందినిరెడ్డి కలిసి తన సినిమాలో నటించమని అడిగారు. మా  పాపకు అప్పుడు నాలుగు నెలలు కావడంతో వద్దని అన్నాను. అయినా ఆ తర్వాత నందినిరెడ్డి నన్ను వదల్లేదు. మరో ఐదు నెలల తర్వాత నన్ను వెంటాడి మరీ ఓ కథ చెప్పింది. అదే ‘కల్యాణ వైభోగమే’. చాలా మంచి కథ అని వినేటప్పుడే అర్థమైంది. అందుకే హీరోయిన్‌ మదర్‌గా చేశాను. అందులోనూ నా తరహా లైఫ్‌స్టైల్‌కి చాలా దగ్గరగా అనిపించిన కథ ఇది. నేను హీరోయిన్‌గా నటించిన సినిమాల్లో నా మనసుకు దగ్గరగా ఉన్న సినిమాల సంఖ్య స్వల్పమే. కానీ ‘కల్యాణ వైభోగమే’ నాకు చాలా నచ్చిన సినిమా’’ అని చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలు వస్తే నటించడానికి రాశీ సిద్ధంగా ఉన్నారు. 

ప్రస్థానం’ చిత్రంలో పవిత్ర లోకేశ్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆవిడ అందులో సాయికుమార్‌ను పునర్వివాహం చేసుకుని మరో బిడ్డకు జన్మనిస్తుంది. ఈ తరహా పాత్రలు ఈ మధ్యకాలంలో వెండితెరపై అంతగా రాలేదనే చెప్పాలి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంలోనూ పవిత్ర లోకేశ్‌ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ పాత్రతో పాటు పోటీగా మంచి పేరు తెచ్చుకున్న మరో పాత్ర సన చేసిన పాత్ర. బిడ్డ ప్రేమను కాదని పరువు కోసం తుపాకితో కాల్చుకుని చనిపోతాడు నాజర్‌. ఆయన సతీమణి అయినప్పటికీ సన  ‘నీ ప్రేమను కాదన్న తండ్రి చనిపోయాడు. ఉన్న నేను కాదనడం లేదు. నీకు నచ్చినవాడిని చేసుకో’ అని కుమార్తె ఇష్టాన్ని గౌరవించి చెబుతుంది. తల్లి పాత్ర మారుతోందని చెప్పడానికి సన చేసిన పాత్ర మరో చక్కటి ఉదాహరణ. 

టెంప్ట్‌ అయ్యి ట్రెండ్‌కు దగ్గరగా...
దర్శకుడు చెప్పిన కథ విని టెంప్ట్‌ అయి సినిమా చేసిన నిన్నటితరం హీరోయిన్‌ ఇంద్రజ. తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉంటున్న ఓ కూతురిగా ఆమె ఇందులో నటించింది. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు పర్ఫెక్ట్‌ మదర్‌ ఇంద్రజ అని సినిమా చూసిన వారందరూ మెచ్చుకునేలా నటించింది ఇంద్రజ. మెల్లగా తెల్లారిందో ఇలా.. అనే  పాటలో తాను చిన్నతనంలో ఆడుకున్న ఆటలను, తను తిరిగిన ప్రదేశాలను చూస్తున్న మహిళగా ఇంద్రజ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో టబు కూడా ట్రెండీ మదర్‌గా సీరియస్ రోల్‌లో మెప్పించారు. పదేళ్ల తర్వాత ఆమె తెలుగుతెరపై మెరిసిన సినిమా ఇది. తెలుగులో రీ లాంచ్‌కు ఇంతకన్నా మంచి పాత్ర దొరకదని ఆమె అన్నారు. ‘జయ జానకీ నాయక’లో వాణీవిశ్వనాథ్‌ ట్రెండీ అమ్మగా కనిపించారు. ఇటీవల ఆమని ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో మాస్‌ మదర్‌గా మెప్పించారు. అలాగే ఈశ్వరీరావు వైవిధ్యమైన మదర్‌ పాత్రలు చేస్తున్నారు.

తరాలు మారుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో అభిరుచి మారుతోంది. అందుకు అనుగుణంగా కథకులూ మారుతున్నారు. సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వారు రాసే పాత్రలూ మారుతున్నాయి. సృష్టికర్త బ్రహ్మను సృష్టించిన అమ్మ పాత్రలు భవిష్యత్తులో మరింత ట్రెండీగా, ఆదర్శవంతంగా, అపురూపంగా ఉంటాయని, ఉండాలని కోరుకుందాం. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.