బ్రేకింగ్ : బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్‌లోకి..

ABN , First Publish Date - 2021-07-23T18:01:13+05:30 IST

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు.

బ్రేకింగ్ : బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్‌లోకి..

హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరితే ఆయనకు ఏమైనా పదవి ఇస్తారా..? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలియవచ్చింది. కాగా.. ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అప్పట్లోనే ఈయనపై బీజేపీ అధిష్టానం కాసింత సీరియస్ కూడా అయ్యింది.. పార్టీకి దూరంగా కూడా పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి.


ఇదిలా ఉంటే.. గత ఏడాది నవంబర్‌లో టీడీపీకి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. బీజేపీలో మోత్కుపల్లి చేరితే తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కమలం నేతలు భావించారు. అయితే.. ఏడాది కూడా గడవక ముందే ఆయన కమలం గూటికి టాటా చెప్పేసి కారెక్కబోతున్నారు. కాగా.. ఎన్టీఆర్ కేబినెట్‌లో గనులు, విద్యుత్, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా మోత్కుపల్లికి పనిచేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరి.. 1983లో తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటి వరకూ ఆయన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు మారారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు.

Updated Date - 2021-07-23T18:01:13+05:30 IST