కబీర్ బోధ: ఈ ఒక్క పనితో సానుకూల ఆలోచనలు బలోపేతం, అన్నింటా విజయం!

ABN , First Publish Date - 2022-06-18T15:25:54+05:30 IST

సానుకూల ఆలోచనలు కలిగినవారే గొప్ప విజయం సాధిస్తారు.

కబీర్ బోధ: ఈ ఒక్క పనితో సానుకూల ఆలోచనలు బలోపేతం, అన్నింటా విజయం!

సానుకూల ఆలోచనలు కలిగినవారే గొప్ప విజయం సాధిస్తారు. ఏదైనా పనిని నెగెటివ్ థింకింగ్‌తో చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మనం మంచి విషయాలను పదే పదే చదవడం లేదా వినడం ద్వారా మన ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. ఈ విషయంలో సంత్ కబీర్ బోధ ఒక ఉదాహరణగా నిలిచింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కబీర్ ప్రసంగాలు వినడానికి ఒక వ్యక్తి రోజూ వచ్చేవాడు. ఒకరోజు అతను సంత్ కబీర్‌తో ఇలా అన్నాడు. నేను ప్రతిరోజూ మీ ప్రసంగాలు వింటాను. ఇలా వినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు. 


మీరు రోజూ చెప్పే ఒకే తరహా ప్రసంగాలను ఎందుకు వినాలి? కబీర్ ఆ వ్యక్తి చెప్పినది విన్నాడు. అయినా ఏమీ మాట్లాడలేదు. అయితే సమీపంలో ఉంచిన సుత్తిని తీసుకొని అక్కడ భూమిలో పాతిపెట్టిన కర్రపై గట్టిగా కొట్టాడు. అనంతరం కబీర్ తన పనిలో మునిగిపోయాడు. దీనిని చూసి ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మరుసటి రోజు అతను మళ్ళీ వచ్చి అదే విషయాన్ని అడిగాడు. ఉపన్యాసాలు పదే పదే వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? కబీర్ మళ్లీ సుత్తిని అందుకుని అదే కర్రపై కొట్టాడు. అతను మాట్లాడలేదు. ఆరోజు కూడా కబీర్ బిజీగా ఉన్నారని ఆ యువకుడు అనుకున్నాడు. ఇది జరిగిన తర్వాత మూడో రోజు మళ్లీ వచ్చి అదే ప్రశ్న అడిగాడు. కబీర్ తిరిగి అదే పని చేశాడు. సుత్తిని ఎంచుకొని కర్ర మీద కొట్టాడు. ఈసారి ఆ మనిషికి కొంచెం కోపం వచ్చింది. మూడు రోజులుగా మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతున్నా మీరు సమాధానం చెప్పడం లేదని అన్నాడు. కబీర్ ఇలా అన్నాడు.. సోదరా నేను ప్రతిరోజూ నీ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. నేను ఈ కర్రని సుత్తితో కొట్టినపుడు భూమిలో దాని పట్టు మరింత బలంగామారుతుంది. అది బలంగా లేకుంటే సులభంగా విరిగిపోతుంది. అలాగే మంచి విషయాలను పదే పదే చదివినప్పుడు, లేదా విన్నప్పుడు మన ఆలోచన కూడా సానుకూలంగా మారుతుంది. చెడు ఆలోచనలు తొలగిపోతాయి. సానుకూల ఆలోచనల వల్ల క్లిష్ట పరిస్థితులను సరైన మార్గంలో పరిష్కరించుకోవడంతోపాటు అన్నింటా విజయం సాధించగలుగుతాం. అందుకే మనం రోజూ మంచి విషయాలు చదువుతూ లేదా వింటూ ఉండాలని కబీర్ చెప్పాడు.  


Updated Date - 2022-06-18T15:25:54+05:30 IST