మోత్కుపల్లి.. నెక్స్ట్ స్టెప్ అదేనా..!

ABN , First Publish Date - 2021-07-25T06:03:54+05:30 IST

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం..

మోత్కుపల్లి.. నెక్స్ట్ స్టెప్ అదేనా..!

రాజీనామాపై సర్వత్రా చర్చ

బీజేపీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ పావులు

మాజీ మంత్రితో టీఆర్‌ఎస్‌ చర్చలు


యాదాద్రి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హుజురాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో రోజురోజుకూ సమీకరణలు మారుతున్నాయి. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ పోటీ ఖాయమైంది. దీంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం బీజేపీ లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల్లో సీనియర్లపై దృష్టి సారించింది. టీడీపీలో తనతోపాటు కలిసి పనిచేసిన ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఆయన రాజకీయ భవిష్యత్‌పై కూడా భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఆయన్ను గులాబీ దళంలో చేర్చుకోవడంతోపాటు, సముచిత స్థానం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నర్సింహులు బీజేపీ విధానాలు నచ్చలేదని, తాను పార్టీని వీడుతున్నట్టు శుక్రవారం రాజీనామా ప్రకటించారు.


తన రాజీనామా లేఖలో బీజేపీ అధిష్ఠానంపై విమర్శస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రస్తావన తీసుకొస్తూ ఎస్సీ వర్గాల భూములను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నందుకు కనీసం ఆయనపై విచారణ లేకుండా పార్టీలో చేర్చుకున్నారని బీజేపీ అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తనకు పార్టీలో సముచిత స్థానం లభించలేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర పార్టీలో, స్థానికంగా చర్చ కొనసాగింది. సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లికి జిల్లావ్యాప్తంగా అన్నివర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాగా, ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలో చేరుతున్నది స్పష్టం చేయలేదు. అయితే టీఆర్‌ఎ్‌సలోకి వెళ్తున్నట్టు ఊహగానాలు వస్తుండగా, ఆయన అనుచరులు ఎవరెవరూ వెంట వెళ్తారనే దానిపై బీజేపీలో చర్చ మొదలైంది. ముఖ్యమైన అనుచరులతో సమావేశమై టీఆర్‌ఎ్‌సలో చేరే తేదీని ఖరారు చేసేందుకు మోత్కుపల్లి సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఆయనతో కలిసి పనిచేసిన మెజార్టీ టీడీపీ నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సలో ఉన్నారు. ఆయన టీఆర్‌ఎ్‌సలో చేరితో తమకు కలిసొస్తుందని ఆ నేతలు భావిస్తున్నారు. హుజురాబాద్‌లో మోత్కుపల్లితోపాటు సీనియర్‌ నేతలతో ప్రచారం చేయించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.


ఆరుసార్లు ఎమ్మెల్యేగా..

మోత్కుపల్లి నర్సింహులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1982లో ఎన్‌టీఆర్‌ స్థాపించిన టీడీపీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో టీడీపీ నుంచి, 1989లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994లో టీడీపీ నుంచి గెలుపొందారు. 1999లో కాంగ్రెస్‌ నుంచి ఆలేరులో గెలుపొందారు. 2009లో ఆలేరు జనరల్‌గా మారడంతో తుంగుతుర్తి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 

Updated Date - 2021-07-25T06:03:54+05:30 IST