మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-01-20T05:03:42+05:30 IST

సైకిళ్ల చోరీలతో ప్రారంభించి, మోటార్‌ బైక్‌ దొంగతనాలు చేస్తూ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ దొంగ ఎట్టకేలకు పట్టుబడిన వైనమిది.

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు
బైక్‌ల దొంగ మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసులకు సీఐ ప్రశంసలు


తోటపల్లిగూడూరు, జనవరి 19 : సైకిళ్ల చోరీలతో ప్రారంభించి, మోటార్‌ బైక్‌ దొంగతనాలు చేస్తూ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ దొంగ ఎట్టకేలకు పట్టుబడిన వైనమిది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కృష్ణపట్నం పోర్టు సీఐ వేమారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొడవలూరు మండలం గండవరం గ్రామానికి చెందిన మోటారు బైక్‌ల దొంగ చీపినాపి మల్లికార్జున్‌ను బుధవారం ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 2005 నుంచి పలు దొంగతనాలకు పాల్పడేవాడు. మొదట్లో సైకిళ్లను దొంగిలించేవాడు. అనంతరం మోటారు బైక్‌ల చోరీలకు పాల్పడుతూ జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో 40వరకు చోరీ కేసులున్నాయి.  ఈ క్రమంలో సౌత్‌ఆములూరుకు చెందిన గేనేడి మస్తాన్‌నాయుడు శ్మశానం వద్ద పెట్టిన తన బైక్‌ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. అందిన సమాచారం మేరకు కాకుపల్లి సెంటర్‌ వద్ద ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి బైక్‌ల దొంగ మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఏడు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వేమారెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరచిన ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి, హెచ్‌సీ 1424, పీసీలు 2512, 2881, 3209లను సీఐ అభినందించారు. 


Updated Date - 2022-01-20T05:03:42+05:30 IST