మోటారు బీమా మరింత భారం!

ABN , First Publish Date - 2021-04-22T06:36:28+05:30 IST

ఈ సంవత్సరం మోటార్‌ ఇన్సూరెన్స్‌ మరిం త భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్ల పెంపుపై బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) త్వరలోనే...

మోటారు బీమా మరింత భారం!

  • పెరగనున్న థర్డ్‌ పార్టీ ప్రీమియం?


న్యూఢిల్లీ: ఈ సంవత్సరం మోటార్‌ ఇన్సూరెన్స్‌ మరిం త భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్ల పెంపుపై బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంపుపై ఐఆర్‌డీఏఐ గత ఏడాది ఫ్రిబవరిలోనే ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే కొవిడ్‌-19 కారణంగా ప్రీమియం పెంపు నిర్ణయాన్ని పక్కనపెట్టింది. కొవిడ్‌ తొలి ధశలో మోటార్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ తగ్గిపోయాయి. ప్రస్తుతం ఇవి మళ్లీ సాధారణ స్థితికి చేరాయి. దీంతో థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంచకపోతే గిట్టుబాటు కాదని బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కంపెనీల విజ్ఞప్తి: నిజానికి మోటార్‌ ఇన్సూరెన్స్‌ రంగంలో వచ్చే ప్రీమియం కంటే చెల్లించే క్లెయిమ్‌లే ఎక్కువ. దీంతో థర్డ్‌ పార్టీ ప్రీమియంతో సహా అన్ని రకాల మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమి యం ఏటా పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. అయి తే కొవిడ్‌ నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకుంటే పరిశ్రమకు మంచిది కాదనే ఉద్దేశంతో ఐఆర్‌డీఏఐ గత ఏడాది దీనిపై నిర్ణయాన్ని పక్కనపెట్టింది. 

పెరిగిన ప్రీమియం వసూళ్లు : గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియం ఆదాయం 1.68 శాతం తగ్గి రూ.67,790 కోట్టకు చేరింది. ఇదే సమయంలో థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఆదాయం మాత్రం 4.4 శాతం పెరిగి రూ.10,650 కోట్లకు చేరింది. దీంతో బీమా కంపెనీలు థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంచాలని మరోసారి ఐఆర్‌డీఏఐకి విజ్ఞప్తి చేశాయి. దీనికి తోడు కోర్టుల తీర్పులు ఇందుకు అనుకూలంగానే ఉన్నా యి. దీంతో థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంపుపై ఐఆర్‌డీఏఐ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అయితే ఈ పెంపు ఎంత అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది.



పెరిగిన ‘ప్రైవేట్‌’ ప్రీమియం వసూళ్లు 


కొవిడ్‌ నేపథ్యంలోనూ ప్రైవేట్‌ జీవిత బీమా కంపెనీలు సత్తా చాటాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం వసూళ్లు 8 శాతం పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ వీటి పీమ్రియం వసూళ్లు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 40 శాతం పెంచుకున్నట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఈ ఏడాది మార్చి నెల అయితే ప్రైవేట్‌ జీవిత బీమా కంపెనీలకు మరింత కలిసొచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం మార్చిలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు ఏకంగా 90 శాతం పెరిగాయి. 

Updated Date - 2021-04-22T06:36:28+05:30 IST