Advertisement

రోజూ బాదుదే

Jun 30 2020 @ 05:23AM

23 రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ. 9.37

డీజిల్‌పై రూ.10.57 పెంపు..

సగటున రోజుకు రూ 0.50 పైసలు..

ఆందోళనలో వాహనదారులు..

భగ్గుమంటున్న కాంగ్రెస్‌,  వామపక్షాలు..


అనంతపురం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌తో కునారిల్లిన పేదవాడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కర్కశం చూపుతున్నాయి. ఆదుకోవాల్సింది పోయి, కక్ష సాధిస్తున్నాయి. రోజూ పెట్రో ధరలు పెంచుతూ నడ్డి విరుస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో నగదు రూపేణా ప్రజలకు ఓ చేత్తో ఆర్థికసాయం చేస్తూనే.. మరోచేత్తో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. కరోనా ముసుగులో ప్రజలపై భారం మోపే దిశగానే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ బిల్లుల షాక్‌ నుంచి ప్రజలు తేరుకోకముందే.. పెట్రో ధరల పెంపుతో ఆ వర్గాలను మరింత ఆందోళనకు లోనుచేస్తున్నారు. బాదుడే లక్ష్యంగా రోజుకు సగటున పెట్రోలు, డీజిల్‌పై రూ.అర్ధ రూపాయి పెంచుతున్నారు. 23 రోజులుగా ఈ పరంపర కొనసాగుతోంది. పెట్రోధరల పెంపుతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.


కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు లేక వాహనరంగాన్ని నమ్ముకుని, జీవనం సాగిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాల్లో పెట్రో ధరల పెంపు మంట పుట్టిస్తోంది. రెక్కాడితేగానీ.. డొక్కాడని బతుకులకు ధరల పెంపు గుదిబండగా మారుతోంది. ఇదివరకటి ధరలకే వామ్మో.. అంటున్న ఆ వర్గాలకు రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోధరలు మరింత భారంగా మారాయి. దీనిపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెంచిన పెట్రో ధరలను తగ్గించాలనే డిమాండ్‌ అన్నిపక్షాల నుంచి వస్తున్నా.. ప్రభుత్వాల నుంచి స్పందన లేదు. దీనిని బట్టి చూస్తే పేద, మధ్య తరగతి వర్గాలపై పాలకులకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.


పెట్రోధరల పెంపు ఇలా..

రోజురోజుకీ పెట్రో ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల గుండెలు గుబేలుమంటున్నాయి. ఇదివరకున్న ధరలే భారమనుకున్న నేపథ్యంలో తాజాగా పెరుగుతున్న పెట్రోధరల పరంపర మోయలేని స్థితికి చేరుతోంది. 23 రోజులుగా రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గ తంలో డీజిల్‌, పెట్రోలు ధరల విషయంలో చాలా వ్యాత్యాసం కనిపించేది.


రోజువారీ ధరల ఖరారు అంశాన్ని అమలు చేసిన తర్వాత రెండింటి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండా పోతోంది. ఈనెల 6వతేదీన పెట్రోలు ధర లీటరు రూ.74.47, డీజిల్‌ ధర రూ.68.39 ఉండింది. సోమవారం నాటికి లీటరు పెట్రోలు రూ.83.84కి చేరింది. అంటే రూ.9.37 పైసలు పెరిగింది. డీజిల్‌ లీటరు ధర రూ.78.96కి చేరటంతో రూ.10.57 పైసలు పెరిగింది. పెట్రోధరల పరంపర ఇదే విధంగా కొనసాగితే వాహనరంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబాల పరిస్థితి మరింత దిగజారనుంది.

             జిల్లాలో వినియోగమిలా.. 

జిల్లాలో ప్రతినెలా 95 లక్షల లీటర్ల పెట్రోలు, 180 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం అవుతోంది. ఈ లెక్కన ఇదివరకు ప్రతినెలా పెట్రోలు కోసం రూ.70.74 కోట్లు ఖర్చు చేసేవారు. తాజాగా పెరిగిన ధరతో ఇకపై నెలకు రూ.79.64 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.8.90 కోట్లు అదనపు భారం పడుతుంది. ప్రతి నెలా డీజిల్‌ కోసం రూ.123.10 కోట్లు ఖర్చు చేసేవారు. తాజాగా పెరిగిన ధర నేపథ్యంలో రూ.142.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే డీజిల్‌పై అదనంగా నెలకు రూ.19.02 కోట్ల భారం పడనుంది.

ఆర్టీసీపై రోజుకు రూ.90 వేల అదనపు భారం

ఆర్టీసీపైనా డీజిల్‌ ధరల పెంపు ప్రభావం పడుతోంది. ప్రస్తుతం సంస్థ దుర్భర పరిస్థితిలో ఉంది. కరోనా నేపథ్యంలో బ స్సులు కొన్ని డిపోలకే పరిమితమయ్యాయి. మరికొన్ని మా త్రమే రోడ్డెక్కాయి. కరోనాకు ముందు అనంతపురం రీజియన్‌ పరిధిలో 937 బస్సు సర్వీసులు రూ.3 లక్షల కి.మీ తిరిగేవి. అప్పట్లో రోజుకు 60 వేల లీటర్ల డీజిల్‌ వినియోగించేవారు. కరోనా వై రస్‌ వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటించాల్సి రావటంతో ఒక్కో బస్సులో 30 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. 350 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తంగా లక్ష కి.మీ., మాత్రమే తిరుగుతున్నాయి. 20 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఆర్టీసీకి తక్కువ ధరకే డీజిల్‌ సరఫరా చేస్తుంటారు. ఈనెల మొదటివారంలో ఆర్టీసీకి సరఫరా చేసిన డీజిల్‌ ధర లీటరుకు రూ. 66.50 ఉండింది. 20 రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.71కి చేరుకుంది. రూ.4.50 పెరిగింది. దీంతో ఆర్టీసీపై రోజుకు రూ.90 వేలు అదనపు భారం పడుతుండటంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ లెక్కన ఇప్పటివరకూ దాదాపు రూ.20 లక్షలు అదనపు భారం పడింది.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.