కొవిడ్‌పై కదలరేం?

ABN , First Publish Date - 2022-01-09T07:28:32+05:30 IST

కొవిడ్‌పై కదలరేం?

కొవిడ్‌పై కదలరేం?

కరోనా కట్టడిలో పూర్తిగా వైఫలం

విద్యాసంస్థలను చుట్టేస్తున్న వైరస్‌

వందల నుంచి వేలకు చేరుతున్న కేసులు

రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌ కిట్లకు తీవ్ర కొరత


రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్‌ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య వందల నుంచి వెయ్యికి చేరువైంది. అయినా  ఆరోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. 


(అమరావతి, విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విజయవాడలోని ఓ మెడికల్‌ కాలేజీలో ఇటీవల పదుల సంఖ్య విద్యార్థులు కరోనా బారినపడ్డారు. తిరుపతిలోరి ఓ జాతీయ స్థాయి విద్యా సంస్థలో వందల మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. విశాఖపట్నం, చిత్తూరుల్లోనూ ప్రతి విద్యా సంస్థలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ ఆరోగ్యశాఖను నిర్లక్ష్యం జబ్బు వదలడం లేదు. గత నెల 29 నుంచి రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 24 గంటల్లోనే రెండింతలవుతోంది. పాజిటివిటీ రేటు దాదాపు 2 శాతానికి దగ్గరైంది. అయినా, రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లోకి రావడం లేదు. కరోనా దెబ్బకు పక్క రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు మహారాష్ట్ర, ఒడిసా రాష్ర్టాల్లో ఇప్పటికే కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. మద్యంపై వచ్చే ఆదాయంపైనే దృష్టిపెట్టింది. పండగల సమయంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. వెంటనే కట్టడి చర్యలు చేపట్టాలని వైద్యులు హెచ్చరిస్తున్నా వైసీపీ సర్కారుకు పట్టడం లేదు. పొరుగు రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలనూ కట్టడి చేశాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయన్న లెక్కలు చూసుకుంది. పండగల సమయంలో కరోనా కట్టడి చర్యలు చేపడితే మద్యం అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. కరోనా నివారణకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. 


ప్రైవేటు ల్యాబ్‌లలోనే టెస్టులు అధికం..

జిల్లాల్లో ప్రభుత్వం చేసే టెస్టుల కంటే ప్రైవేటు ల్యాబ్స్‌ చేసే టెస్టులు అధికంగా ఉన్నాయి. చాలా మంది కరోనా అనుమానితులు ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్ష చేయించుకుని పాజిటివ్‌ నిర్ధారణ కాగానే సాధారణ మందులు వాడేస్తున్నారు. దీని వల్ల కొన్ని వేల కేసులు ప్రభుత్వం దృష్టిలోకి రావడం లేదు. ఈ నిర్లక్ష్యమే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


టెస్టులు అంతంత మాత్రమే...

రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతున్నా రాష్ట్ర ఆరోగ్యశాఖ టెస్టుల సంఖ్య మాత్రం పెంచడం లేదు. గత ఆరు నెలల నుంచి 28 వేల నుంచి 35 వేల మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నట్లు బులెటిన్‌లో చూపిస్తున్నారు. అయితే, జిల్లాల్లో ఆరోగ్యశాఖ కరోనా పరీక్ష కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేసిందో తెలియని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు కనీసం 50-60 వేల మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.


రోజుకు లక్ష మందికి పరీక్ష సామర్థ్యం ఉన్నా..

రాష్ట్రంలో ప్రస్తుతం 15 వరకూ ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు లక్ష మందికి కరోనా పరీక్ష నిర్వహించే సామర్థ్యం ఉంది. అయితే, ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు అవసరమైన కిట్స్‌ కొరత తీవ్రంగా ఉంది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కరోనా కిట్స్‌ సరఫరా చేసే కంపెనీలకు ఆరోగ్యశాఖ కనీస బిల్లులు కూడా చెల్లించడం లేదు. దీంతో ఆ కంపెనీలు కిట్స్‌ సరఫరా చేయలేమని ఆరు నెలల క్రితమే ఏపీఎంఎ్‌సఐడీసీకి లేఖలు రాశాయి. అయినా పట్టించుకోకపోవడంతో ఆరోగ్యశాఖ 10 వేల కిట్స్‌ ఆర్డర్‌ పెడితే.. వెయ్యి లేదా 1,500 కిట్స్‌ మాత్రమే ఆ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. చేసేదిలేక ఉన్న కిట్లతోనే అధికారులు పరీక్షలు కానిచ్చేస్తున్నారు. మందులు, సర్జకల్‌ ఐటమ్స్‌తోపాటు కొవిడ్‌కు సంబంధించిన ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా బిల్లుల సమస్యలు ఉన్నాయి. దీంతో చాలా కంపెనీలు ఏపీ అంటే అమ్మో అనే పరిస్థితికి వచ్చాయి. 


ఒక్కరోజే 839 కేసులు..

రాష్ట్రంలో కొత్తగా 839 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో 37,553 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. చిత్తూరులో అత్యధికంగా 175, విశాఖలో 174, కృష్ణా 79, తూర్పుగోదావరిలో 78, గుంటూరులో 67, నెల్లూరులో 61, విజయనగరంలో 37, అనంతపురంలో 37 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్త కేసుల సంఖ్య 20,80,602కు చేరింది. అందులో 20,62,440 మంది కోలుకున్నారు. శనివారం మరో 150 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.  తాజాగా శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14,503కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,659 యాక్టివ్‌ కేసులున్నాయి. 


మొన్న డీఎంహెచ్‌వోకు, నేడు కమిషనర్‌కు..

విశాఖ జిల్లాలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌, ఒడిసో, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరికి అంతర్జాతీయ ప్రయాణికుల వల్ల విశాఖ జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈనెల ఒకటిన 40 కేసులు రాగా, ఏడో తేదీన 189, తాజాగా శనివారం 175 కేసులు వచ్చాయి. జిల్లాలో కరోనా కట్టడికి కీలకంగా పనిచేయాల్సిన డీఎంహెచ్‌వో తిరుపతిరావుకు మూడు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లారు. కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్‌ మల్లికార్జున నగరంలోని ఆస్పత్రులను శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ పర్యటనలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషాకు శనివారం పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో ఈ పర్యటనలో పాల్గొన్న జిల్లా అధికారులు, ఆయా ఆస్పత్రుల అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతున్నందున పరీక్ష కేంద్రాలు కూడా పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-09T07:28:32+05:30 IST