ఉద్యమ స్మృతులు

ABN , First Publish Date - 2022-08-15T05:53:40+05:30 IST

స్వరాజ్య పోరులో సిరిసిల్ల కీలక భూమిక పోషించింది. ఒకవైపు నిజాం నిరంకుశత్వానికి, మరోవైపు బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసు కుంటున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, అజాదీకా అమృత్‌ మహోత్సవాలను సిరిసిల్ల జిల్లా ప్రజలు పండుగలాగా జరుపుకుంటున్నారు.

ఉద్యమ స్మృతులు

 - స్వరాజ్య పోరులో మనోళ్లు 

- సమరయోధుల త్యాగాల స్ఫూర్తిగా వేడుకలు 

 - ముస్తాబైన సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానం 

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్‌ 

- నేడు భారత స్వాతంత్య్ర దినోత్సవం 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వరాజ్య పోరులో సిరిసిల్ల కీలక భూమిక పోషించింది. ఒకవైపు నిజాం నిరంకుశత్వానికి, మరోవైపు బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టారు. సోమవారం  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసు కుంటున్నారు.   స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, అజాదీకా అమృత్‌ మహోత్సవాలను సిరిసిల్ల జిల్లా ప్రజలు పండుగలాగా జరుపుకుంటున్నారు.  మరోవైపు సోమవారం నిర్వహించనున్న వేడుకలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళశాల మైదానం ముస్తాబైంది. వేడుకలను  ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు. కళాశాల మైదానంలో పరేడ్‌ నిర్వహణకు పోలీసులు సిద్ధమయ్యారు.  పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు  జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, లబ్ధిదారులకు రుణాలను పంపిణీ  చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే పర్యవేక్షిస్తున్నారు.  ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రభుత్వకార్యాలయాలు, విద్యాసంస్థలను ముస్తాబు చేశారు.  

స్వాతంత్య్ర పోరులో నేతన్నలు 

స్వాతంత్య్ర పోరులో ప్రజల దైనందిన సమస్యలతోపాటు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం సిరిసిల్ల నేత కార్మికులు ‘చేనేత కార్మిక సంఘం’ ఏర్పాటు చేశారు. డాక్టర్‌ గాజుల భూపతి, పత్తిపాక విశ్వనాథం ఆహ్వాన సంఘంగా ఏర్పడి 1946లో కార్మిక సంఘం తెలంగాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో నిర్వహించారు. సభకు నిజాం నవాబ్‌ వైద్యుడిగా ఉన్న నారాయణదాస్‌ను ఎన్నుకున్నారు. కానీ సభలోని ప్రతినిధులు ఎవరూ ఇష్టపడలేదు. సంస్థానం బయట నుంచి వచ్చిన వారిలో ఒకరిని ఎన్నుకోవాలని పట్టుబట్టారు. ఆహ్వాన సంఘం ప్రతినిధి న్యాయవాది కొడిమ్యాల భూమయ్య మాటలను ఎవరూ వినకపోవడంతో కామారెడ్డిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అమృతలాల్‌ శుక్లాను పిలిపించారు. సంస్థానంలో ఉన్నవాడైన ఉద్యమ రీత్యా కొండ లక్ష్మణ్‌ను ఎన్నుకోవాలని సూచించారు. దానికి అందరూ అంగీకరించారు. ఇలా జరిగిన చేనేత కార్మిక మహాసభ ఒక చారిత్రాక్మక సంఘటనగా రూపుదిద్దుకుంది. మహాసభ తర్వాత అమృతలాల్‌ శుక్లాను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేయగా శుక్లా స్వచ్ఛందగా ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాటాన్ని ముందుకు నడిపించారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ చేనేత వస్త్ర రంగంలో కార్మికుల్లో చైతన్యం నింపింది. సిరిసిల్లలో నిర్వహించిన ఆంధ్ర మహాసభ, మహిళా సభలు ఉద్యమం వైపు నడిపించాయి.  నాలుగో ఆంధ్రమహాసభ 1935లో సిరిసిల్లలో భీమకవి నగరంగా మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ నిర్వహణలో సిరిసిల్ల తాలూకలోని గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ముఖ్య భూమికను పోషించారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు బద్దం ఎల్లారెడ్డి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన ఈ మహాసభకు ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆవునూర్‌ వేణుగోపాల్‌రావు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కొడిమ్యాల భూమయ్య, సంయుక్త కార్యదర్శులుగా బద్దం ఎల్లారెడ్డి, పి. నర్సింగరావు వ్యవహరించారు. వేములవాడ భీమకవి నగరంగా నిర్వహించిన మహాసభకు వివిధ ప్రాంతాలనుంచి ఎంతో మంది  తరలివచ్చారు.  ఇదే ప్రాంగణంలో 4వ ఆంధ్రా మహిళా సభ నిర్వహించారు. ఈ మహాసభల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొత్త మలుపు తిరిగాయి. 

క్విట్‌ ఇండియా ఉద్యమంలో .. 

క్విట్‌ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన క్రమంలో సిరిసిల్ల పాత తాలుకాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావును 1939లో 7వ తరగతిలో వందేమాతరం ఉద్యమం ప్రభావితం చేసింది. ఆంధ్రా మహాసభ కార్యకలాపాలకు గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి, రుద్రంగికి చెందిన సీహెచ్‌ నరసింహారావు కూడా రావడం చూసి రష్యన్‌ రెడ్‌ ఆర్మీ తెగించి పోరాడిన ఘట్టాలు చదివిన రాజేశ్వర్‌రావు వారివైపు అడుగులు వేశారు. 1942లో ఊపందుకున్న క్విట్‌ ఇండియా ఉద్యమంలో సీహెచ్‌ రాజేశ్వర్‌రావుతోపాటు సీహెచ్‌ హన్మంతరావు, సి .నారాయణరెడ్డి, ముకుందరావు మిశ్రా పాల్గొన్నారు. కోనరావుపేటకు చెందిన సీహెచ్‌ రాజలింగం బాల్యంలోనే రజాకార్ల క్యాంపుపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. సత్యాగ్రహా దీక్షల్లో గాలిపెల్లికి చెందిన నార్ల మల్హర్‌రావు గుప్త, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు.  

గ్రంథాలయోద్యమం 

నిజాం నిరంకుశ పాలన కింద బతుకులీడుస్తున్న ప్రజలను పోరాట బాటలో నడిపించడానికి గ్రంథాలయోద్యమం ముఖ్యమైంది. అక్షర జ్ఞానం నేర్పి పత్రికా పఠనం ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. దీంతో గ్రంథాలయాలు భారత చరిత్రలోనే ముఖ్య స్థానాన్ని సంపాదించాయి. 1886లో మందిన ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు విశాఖపట్నంలో మొదట గ్రంథాలయాన్ని స్థాపించారు. 1925లో సిరిసిల్లలో శ్రీనారాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఖాదీ ఉద్యమంలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాగినచెరఖా సంఘం కార్యక్రమాల్లోనూ నేత కార్మికులు భాగస్వాములు అయ్యారు.

మానాల కేంద్రంగా గెరిల్లా ఉద్యమం 

సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన క్రమంలో సిరిసిల్ల పాత తాలూక  మానాల అడవి గెరిల్లా శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. సిరిసిల్ల, కామారెడ్డి, అర్మూర్‌, రుద్రంగి ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు మానాలలో శిక్షణ పొందేవారు. మానాల గ్రామ భూస్వామి రాజిరెడ్డి శిక్షణ శిబిరాలకు ఎంతో సహకరించేవారు. 


Updated Date - 2022-08-15T05:53:40+05:30 IST