క్రమబద్ధీకరణపై కదలిక

ABN , First Publish Date - 2021-07-26T05:30:00+05:30 IST

అక్రమ లేఅవుట్లు, అనుమతిలేని ప్లాట్ల క్రమబద్ధీకరణపై కదలిక వచ్చింది.

క్రమబద్ధీకరణపై కదలిక

  • ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు
  • నాలుగు శాఖల అధికారులతో బృందాల ఏర్పాటు
  • ఆగస్టు 4లోగా జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేయాలని ఆదేశాలు 


అక్రమ లేఅవుట్లు, అనుమతిలేని ప్లాట్ల క్రమబద్ధీకరణపై కదలిక వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికార బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) :  ప్రభుత్వ అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రజల నుంచి వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఏవిధంగా పరిష్కరించాలనే విషయమై ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఎంతకాలం పడుతుందోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై 15రోజుల్లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొదట మునిసిపాలిటీలు, పంచాయతీల్లో వచ్చిన దరఖాస్తులను విభజించనున్నారు. వార్డు సంఖ్య, కాలనీ, సర్వే నెంబర్‌ ఆధారంగా వాటిని విభజిస్తారు. అనం తరం రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో కలిసి బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన సమాచారం మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి సర్వే వివరాల నివేదికను 15రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ఆధారంగా ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పరిశీలన మాత్రమే చేయనున్నారు. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఈ దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చేనెల 4వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


అక్రమ లేఅవుట్లతో ప్రజలకు కష్టాలు

నిబంధనల మేరకు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ఎక్కడపడితే అక్కడ అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల్లోనూ అక్రమ లేఅవుట్లు వెలిశాయి. డీటీసీపీ నిబంధనల మేరకు లేఅవుట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, చాలాచోట్ల అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు చేశారు. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడానికి గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించగా, జిల్లాలోని మునిసిపాలిటీలు, పంచాయతీల్లో  మొత్తం 37,223 దరఖాస్తులు వచ్చాయి. అండర్‌ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్‌, విద్యుత్‌ తదితర మౌలిక వసతులు కల్పించకుండానే ప్లాట్లు విక్రయించారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణాలకు అనుమతులు రాక, సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం లేఅవుట్లలో రోడ్లు వెడల్పు లేకపోతే రెండు వైపులా ఉన్న ప్లాట్లలో రోడ్డుకు సరిపడా వదిలిపెట్టిన తరువాతనే క్రమబద్దీరించాలని గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా సమకూర్చే ఆదా యంతో అక్రమ లేఅవుట్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్త మార్గదర్శకాల్లో ఈ రుసుము పెంచుతారా, లేదా అనే అంశంపై స్పష్టత లేదు. రుసుము పెంచకున్నా ప్రభుత్వం భూముల విలువ పెంచడంతో ఆదాయం భారీగానే సమకూరనుంది. 


కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు

ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని గతేడాది ఆగస్టు నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు గడువు విధించింది. దీంతో అనుమతులు లేని అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో చాలావరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఇదేచివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. జిల్లాలో 4 మునిసిపాలిటీలు, 566 పంచాయతీలు ఉండగా, ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 37,223 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ అంశం న్యాయస్థానంలో ఉండడంతో ఉత్తర్వులు వచ్చేంతవరకు క్రమబద్ధీకరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఉత్తర్వులు వెలువడేలోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి సవ్యంగా ఉన్న దరఖాస్తులు సిద్ధంగా ఉంచనున్నారు. న్యాయస్థానం ఆదేశాలు వచ్చిన తరువాత అర్హత కలిగిన దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణపై సమాచారం అందించనున్నారు. 


మున్సిపాటీల వారీగా వచ్చిన దరఖాస్తులు

మునిసిపాలిటీ దరఖాస్తులు

తాండూరు 12,347 

పరిగి 4,239

వికారాబాద్‌ 4,041

కొడంగల్‌ 414 


వికారాబాద్‌ జిల్లాలో క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల వివరాలు

4 మునిసిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులు   21,041

247 పంచాయతీల్లో వచ్చినవి 16,182

మొత్తం దరఖాస్తులు 37,223


Updated Date - 2021-07-26T05:30:00+05:30 IST