సినిమాలో ఆ సీన్ చూసి తనపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టిన చిన్నారి!

Sep 26 2021 @ 11:32AM

ఇంటర్నెట్ డెస్క్: సినిమాల వల్ల సమాజం పాడైపోతోందని చాలా మంది అంటుంటారు. అయితే కొన్ని సినిమాలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేలా ఉంటాయి. అలాంటి ఓ సినిమా చూసిన తొమ్మిదేళ్ల చిన్నారి తనపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టింది. ఈ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది.


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక పెళ్లి తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పొన్‌మగళ్ వందాళ్’. అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వచ్చిన ఈ చిత్రం ద్వారా ఓ మంచి పని జరిగిందని స్వయంగా జ్యోతిక వెల్లడించారు. ఆమె లాయర్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో ‘తల్లిదండ్రుల వద్ద పిల్లలు ఏ విషయాన్నీ దాచకూడదు’ అనే ఓ సన్నివేశం ఉంటుంది. ఈ సినిమాను టీవీలో చూసిన ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తనపై జరిగిన లైంగిక దాడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తమ చిన్నారిపై దారుణానికి పాల్పడిన నిందితుడిపై కేసు పెట్టారు. ఆ నిందితుడికి కోర్టు ద్వారా తగిన శిక్ష పడింది. ఈ విషయాన్ని జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్‌మగళ్ వందాళ్’ చిత్రం మే 29న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

చిన్నారులపై లైంగిక దాడి అంశంతో తాజాగా తెలుగులో వచ్చిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంలోనూ ఆడపిల్లలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడే సన్నివేశాలను అతి సున్నితంగా చూపించారు. ఆడపిల్లలతో తల్లి మనసువిప్పి మాట్లాడితేనే వారిని ఇలాంటి దారుణాల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని, అలాగే ఆడపిల్లలకు బుద్ది చెప్పినట్లు మగపిల్లలకు కూడా తల్లిదండ్రులు బుద్ది చెబితే మార్పు వస్తుందని ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల తెలియజేశారు.

Follow Us on:

బీ కేర్ఫుల్మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.