‘తెర’చుకోవడం కష్టమే..!

ABN , First Publish Date - 2020-12-02T04:46:42+05:30 IST

సినిమా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. గతంలో ఏ సినిమా థియేటర్‌ చూసినా జనాలతో కళకళలాడేవి. సినిమా మొదలయ్యే సమయానికి ఆయా హాళ్లు ఉన్న రోడ్లలో వెళ్లాలంటే ట్రాఫిక్‌ ఇబ్బందులు పడాల్సి వచ్చేది.

‘తెర’చుకోవడం కష్టమే..!

సడలింపు ఇచ్చినా నిర్వాహకుల్లో భయం

కొత్త సినిమాలు లేకపోవడం కారణం

ఆక్యుపెన్సీతో ఖర్చులు కూడా రావన్న యోచన

ప్రజలు థియేటర్‌కి రావడంపై సందేహం

కరోనాతో ఉమ్మడి జిల్లాలో రూ. 400 కోట్లు నష్టం

ఖమ్మం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సినిమా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. గతంలో ఏ సినిమా థియేటర్‌ చూసినా జనాలతో కళకళలాడేవి. సినిమా మొదలయ్యే సమయానికి ఆయా హాళ్లు ఉన్న రోడ్లలో వెళ్లాలంటే ట్రాఫిక్‌ ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కాని కొవిడ్‌ ప్రభావంతో ఆయా పరిస్థితులకు  భిన్నంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని థియేటర్లు దర్శనమిస్తున్నాయి. కరోనా ప్రభావం పలు వ్యాపార రంగాలపై పడినప్పటకీ.. వాటన్నిటికంటే సినీరంగానికి జరిగిన నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు పలు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇచ్చినప్పటకీ నిర్వాహకులు  మాత్రం సినిమా వేసేందుకు మక్కువ చూపడంలేదు.  

ఎనిమిది నెలల కాలంలో రూ.400 కోట్ల నష్టం

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుతం 33 థియేటర్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 16, భద్రాద్రి జిల్లాలో 17 ఉన్నాయి. ఆయా థియేటర్లలో ఖమ్మం నగరంలో 8, మధిరలో 3, సత్తుపల్లి 3, వైరా 1, నేలకొండపల్లి 1, కొత్తగూడెం 5, పాల్వంచ 3, భద్రాచలంలో 3, సారపాక ఒకటి, ఇల్లెందు 3, మణుగూరు రెండు ఉన్నాయి. వాటిల్లో 500 నుంచి 900 వరకు సీట్లుఉండగా వాటిల్లో సీట్ల ఉన్న లైన్ల ఆధారంగా టిక్కెట్లు విక్రయాలు జరుపుతుంటారు. అలా ఒక్కో థియటర్‌కు సీట్లు పూర్తిగా నిండితే ఒక్కో ఆటకు సుమారు రూ.40 నుంచి రూ.45 వేల వరకు రాబడి ఉంటుంది. ఇలా రోజుకు రూ.1.80 లక్షలు రాబడి ఉంటుంది. అలా రోజుకు ఉమ్మడి జిల్లాలో రూ. 59.40 లక్షలు ఆదాయం రావాల్సి ఉంది. అలా లాక్‌డౌన్‌లో గడిచిన ఎనిమిది నెలల కాలంలో సుమారు రూ.400 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. 

నిబంధనల భారం

 ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రకారం థియేటర్లలో ఉన్న సీట్లలో 50 శాతం ఆక్యుపెన్సీ సీట్లకు మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలి. ప్రతీ ప్రదర్శనకు మొత్తం థియేటర్‌, కామన్‌ ప్రాంతాలను శానిటైజ్‌ చేయాల్సి ఉంది. ఇలా చేయడం వల్ల ఖర్చులు అయినా వస్తాయో రావోనన్న భయంలో థియేటర్ల నిర్వాహకులు ఉన్నారు. అసలే 50 శాతం ఆక్యుపెన్సీ సీట్లకు వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగా  కరెంటు బిల్లులు అయినా వస్తాయో రావోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే కొత్త సినిమాలు లేవు. ఇప్పుడు తెరిచినా పాత సినిమాకు ఆదరణ ఉండదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. కరోనా సమయంలో సినిమాలన్నీ పలు రకాల నెట్‌వర్క్‌లలోనే రిలీజ్‌ చేశారు.  ఎక్కువమంది ఆయా నెట్‌వర్క్‌లలోనే సినిమాలు చూసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఫలితంగా సినిమా థియేటర్లు తెరిచేందుకు నిర్వాహకులు జంకుతున్నారు.  

Updated Date - 2020-12-02T04:46:42+05:30 IST