కదులుతున్న పల్లెలు

ABN , First Publish Date - 2021-05-07T06:48:02+05:30 IST

కరోనా కట్టడికి పల్లెలు స్వచ్ఛందంగా కదులుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతు న్న కరోనా ఉధృతి, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కదులుతున్న పల్లెలు
బోసిపోయిన వేములవాడ ప్రధాన రహదారి

 - కరోనా కట్టడికి వేములవాడ పట్టణంతో పాటు 50 గ్రామాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ 

- సిరిసిల్లలో మార్కెట్‌ మూసివేతకు నిర్ణయం

- వేములవాడ దేవస్థానంలో కోడెమొక్కుకు బ్రేక్‌  

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా కట్టడికి పల్లెలు స్వచ్ఛందంగా కదులుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతు న్న కరోనా ఉధృతి, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణంతో పాటు 50 గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రజలు, స్థానిక పాలకవర్గాలు లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. లాక్‌డౌన్‌తోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, గ్రామాల్లోని విపక్షాలు భావించి పాక్షిక లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు. వేములవాడలో గురువారం నుంచి 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ తీర్మానించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారు. దీంతో పాటు వేములవాడ, దేవస్థానంలో కోడెమొక్కులను అధికారులు రద్దు చేశారు. సిరిసిల్లలో ప్రధాన మార్కెట్‌ ప్రాంతంలోని కూరగాయల వ్యాపారులు శుక్రవారం నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి  మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేట, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలం కంచర్ల, వీర్నపల్లి, బంజేరు తండా, మద్దిమల్ల, గర్జనపల్లి, అడవిపదిర, రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాలలోని పలు తండాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నారు. ముస్తాబాద్‌ మండల కేంద్రం, తెర్లమద్ది, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, కోనరావుపేట, వెంకట్రావుపేట, వట్టిమల్ల, చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, మూడపల్లి, నర్సింగాపూర్‌, మండల కేంద్రాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, బొప్పాపూర్‌, అగ్రహారం, రాజన్నపేట, తిమ్మాపూర్‌, నారాయణపూర్‌, అక్కపల్లి, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, కందికట్కూర్‌, ఇల్లంతకుంట, వల్లంపట్ల, గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌తో కరోనా నియంత్రణ కు కృషి చేస్తున్నారు. 

- అత్యవసర సేవలకు మినహాయింపు 

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర పనులు, సేవలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో జనం గుంపులుగా ఉండకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా చూస్తున్నారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి చేస్తున్నారు. ఆలయాల్లో దర్శనాలు రద్దు చేసుకున్నారు. 

-  కరోనాతో విలవిల... 

జిల్లా ప్రజలు కరోనాతో విలవిల్లాడుతున్నారు. ఆసుపత్రుల్లో మంచాలు, ఆక్సిజన్‌ దొరకని పరిస్థితుల్లో ప్రాణాలు వదులుతున్నారు. మరోవైపు కొవిడ్‌ పరీక్షలు కూడా తగ్గించారు. దీంతో లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే ఉంటూ ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందించే పరిస్థితి ఏర్పడుతోంది. 

-  309 మందికి పాజిటివ్‌.. నలుగురు మృతి

కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. జిల్లాలో గురువారం 598 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 309 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. నలుగురు మృతి చెందారు. వేములవాడకు చెందిన 67 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లోని  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిరిసిల్లకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి, 60 ఏళ్ల వృద్ధుడు, బోయినపల్లి మండలానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు 21,313 మంది కొవిడ్‌ బారిన పడగా 15,639 మంది కోలుకున్నారు. 5,414 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 260కు చేరుకుంది. 

- నిర్మానుష్యంగా వేములవాడ..

వేములవాడ, మే 6: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణంలోని రోడ్లు సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌తో నిర్మానుష్యంగా మారాయి.  కొద్ది వారాలుగా వేములవాడలో ప్రతి రోజూ కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు మృతుల సంఖ్య కూడా ఆందోళనకరమైన స్థాయికి చేరుతోంది. దీంతో మున్సిపల్‌ పాలకవర్గం ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని, వ్యాపారాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దీంతో గురు వారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. దుకాణాలు మూసివేయడంతో పాటు పట్టణంలో జన సంచారం కూడా తగ్గడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదిలా ఉండగా, కొద్ది రోజులుగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఫలితంగా గురువారం రాజన్న ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు బోసిపోయి కనిపించాయి. 

Updated Date - 2021-05-07T06:48:02+05:30 IST