శరవేగంగా విమానాశ్రయ అభివృద్ధి పనులు : ఎంపీ బాలశౌరి

ABN , First Publish Date - 2022-07-02T07:02:07+05:30 IST

అంతర్జాతీయ విమానాశ్రయంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు.

శరవేగంగా విమానాశ్రయ అభివృద్ధి పనులు : ఎంపీ బాలశౌరి

గన్నవరం, జూలై 1 : అంతర్జాతీయ విమానాశ్రయంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. శుక్రవారం ఆయన పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్‌ బిల్డింగ్‌లకు అదనంగా రూ.473 కోట్లతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్‌ భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. 2023 మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. ప్రస్తుత టెర్మినల్‌ బిల్డింగ్‌లో డొమెస్టిక్‌ ప్రయాణికులు గంటకు 500 మంది, ఇంటర్నేషనల్‌ బిల్డింగ్‌లో గంటకు 200 మంది ప్రయాణం చేయవచ్చన్నారు. వీటి స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్‌ బిల్డింగ్‌లో డొమెస్టిక్‌ ప్రయాణికులు గంటకు 800, అంతర్జాతీయ ప్రయాణికులు 400 మంది ప్రయాణించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇందుకు నూతన టెర్మినల్‌ భవనంలో 24 చెకింగ్‌ కౌంటర్లు, 6 ఇమిగ్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు డిపార్చర్‌ హాలులో 8 బోర్డింగ్‌ గేట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఎయిర్‌సైడ్‌న 6 కోడ్‌ సీ ఎయిర్‌ క్రాప్ట్‌లు, 3 కోడ్‌ ఈ ఎయిర్‌ క్రాప్ట్‌లకు సైతం సరిపోయేలా మూడు డ్యూయల్‌ ఎయిరోబ్రిడ్జిలు వస్తాయన్నారు. టెర్మినల్‌ బిల్డింగ్‌ వద్ద విమానాలు నిలుపుదల చేసేందుకు వీలుగా రూ.26 కోట్లతో నూతన ఆఫ్రాన్‌ను నిర్మించటం పూర్తయిందన్నారు. దీనిపై 6 కోడ్‌ సీ ఎయిర్‌క్రా్‌ప్టలు, మూడు కోడ్‌ ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు నిలుపుదల చేయవచ్చన్నారు. అంతేగాక నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ సమీపంలో ప్రయాణికులు తమ వాహనాలను నిలుపుదల చేసుకునేందుకు అవసరమైన వాహన పార్కింగ్‌ జోన్‌ ఏర్పాట్లను సైతం చురుగ్గా పనులు సాగుతున్నాయన్నారు. ఒకేసారి 1200 కారులు, 250 ట్యాక్సీలు, 10 బస్సులను నిలుపుకోవచ్చన్నారు. ప్రస్తుత ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌-ఏటీసీ టవర్‌ స్థానంలో రూ.60 కోట్లతో నూతన టవర్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో 100 శాతం విమాన ప్రయాణికులకు అనుమతులిచ్చిన నేపథ్యంలో గన్నవరం నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు కనెక్టివిటీ విమాన సర్వీసులు నడుస్తున్నాయన్నారు. ప్రస్తుతం గన్నవరం నుంచి హైదరాబాద్‌, కడప, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీలకు వివిధ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన 18 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఇవే కాకుండా ప్రయాణికుల పొటెన్షియాలిటిని దృష్టిలో ఉంచుకుని కర్నూల్‌, వారణాసి, ముంబై, కోలకత్తాలకు విమాన సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు బాలశౌరి తెలిపారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రామారావు, సివిల్‌ జీఎం తాజుద్దీన్‌, ఏటీసీ ఇన్‌చార్జి ఎంఎల్‌కె రెడ్డి, తోట వెంకయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T07:02:07+05:30 IST