జాతీయ విపత్తుగా గుర్తించి ఆదుకోండి

ABN , First Publish Date - 2021-11-30T05:15:39+05:30 IST

రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉందని జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణ ఆర్థికసాయాన్ని అందించాలని పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని కోరారు.

జాతీయ విపత్తుగా గుర్తించి ఆదుకోండి
ఎంపీ గల్లా జయదేవ్‌

ఎంపీ గల్లా జయదేవ్‌ వినతి

గుంటూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉందని జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణ ఆర్థికసాయాన్ని అందించాలని పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. కుండపోతవర్షాలతో వాగులు, నదులు పోటెత్తి ఊళ్లు, పట్టణాలను ముంచాయని తెలిపారు. జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయని, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయని వివరించారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని వివరించారు. నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయని, రవాణా వ్యవస్త పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. 60మందికి పైగా మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు వివరించారు. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారని, కడప, రేణిగుంట రోడ్డుమార్గం ఇంకా నీటిలోనే ఉందని, కడప, ముంబయి-చెన్నై రైలుమార్గం రాజంపేట మండలంలో కొన్నిచోట్ల వరదకు కొట్టుకు పోయిందన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్ట పరిహారం అందించాలని ఎంపీ జయదేవ్‌ కోరారు.  

Updated Date - 2021-11-30T05:15:39+05:30 IST