
ఉచితంగా పెట్రోల్ పంపిణీ
భోపాల్ : తన కుటుంబంలో ఆడపిల్ల జన్మించిన సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ పంపు యజమాని తన కస్టమర్లకు ఉచితంగా పెట్రోల్ పోసిన ఉదంతం వెలుగుచూసింది. బేతుల్ నగరంలోని పెట్రోల్ పంపు యజమాని అయిన రాజేంద్ర సైనాని మేనకోడలికి ఆడపిల్ల పుట్టింది. అక్టోబరు 9వతేదీన తన మేనకోడలికి ఆడపిల్ల పుట్టడంతో తాను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని రాజేంద్ర సైనాని చెప్పారు. తన మేనకోడలికి ఆడపిల్ల పుట్టిన సంతోషంలో పెట్రోల్ పంపు యజమాని అయిన రాజేంద్ర సైనాని తన కస్టమర్లకు అక్టోబరు 13వతేదీ నుంచి అక్టోబరు 15వతేదీ వరకు మూడు రోజుల పాటు అదనంగా ఉచితంగా పెట్రోలు పోస్తున్నారు.
తన కస్టమర్లకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 శాతం అదనపు పెట్రోల్ పంపిణీ చేస్తున్నానని సైనాని చెప్పారు. 100 రూపాయల విలువైన పెట్రోల్ కొనుగోలు చేసే కస్టమర్లకు 5 శాతం అదనపు ఇంధనాన్ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.200-500 రూపాయల విలువైన పెట్రోల్ కొనుగోలు చేసిన వారికి 10 శాతం అదనంగా పెట్రోలు పోస్తున్నామని రాజేంద్ర వివరించారు.పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, తన కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందనే సంతోషకర సందర్భాన్ని పురస్కరించుకొని కస్టమర్లకు అదనపు పెట్రోలును ఉచితంగా పోస్తున్నామని రాజేంద్ర సైనాని వివరించారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.