సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-05-28T06:03:27+05:30 IST

సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యమని, అది సీఎం జగన్‌ నిజం చేసి చూపారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.

సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యం
ఆటోనగర్‌ వై జంక్షన్‌ వద్ద స్థల పరిశీలన చేస్తున్న ఎంపీ మోపిదేవి, మేయర్‌ కావటి, ఏసురత్నం తదితరులు

సమాజంలో అన్నివర్గాలకు ప్రతిఫలాలు

ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే బస్సు యాత్రలు

ఎంపీ మోపిదేవి వెంకటరమణ 

గుంటూరు, మే 27: సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యమని, అది సీఎం జగన్‌ నిజం చేసి చూపారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. గుంటూరు ఆర్‌ అండ్‌ బి అతిఽథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత మంత్రివర్గంలో 25 మందిలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులున్నారని, ఇది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేదన్నారు. రాజ్యసభలోనూ నలుగురు బీసీలకు స్థానం కల్పించి సామాజిక సమతుల్యత పాటించారని పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని విమర్శించారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై ప్రజలకు తెలియజేసి చైతన్య పరిచేందుకు సామాజిక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ఎండీ ముస్తఫా, కిలారి రోశయ్య, జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి,  లక్ష్మణరెడ్డి,  డైమండ్‌బాబు, షేక్‌ సజీల తదితరులున్నారు. 

నేడు బస్సు యాత్ర

సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర శనివరం మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లాలోకి ప్రవేశించనుంది. విజయవాడ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు మంగళగిరి జాతీయ రహదారి వద్దకు చేరుకోనుంది. నాగార్జున యూనివర్సిటీలో లంచ్‌ బ్రేక్‌ తీసుకొని 2.30 గంటలకు యాత్రను పునఃప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు గుంటూరు ఆటోనగర్‌ వై జంక్షన్‌ వద్దకు యాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చిలకలూరిపేటలో, 4.15 గంటలకు నరసరావుపేటలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బస్సు యాత్రకు స్వాగతం పలికే గుంటూరు శివారులోని ఆటోనగర్‌ వైజంక్షన్‌ ప్రాంతాన్ని శుక్రవారం నేతలు పరిశీలించారు. 

 

Updated Date - 2022-05-28T06:03:27+05:30 IST