గత ఏడాది పుట్టిన రోజు మరిచిపోకుండా చేశారు: MP Raghurama

ABN , First Publish Date - 2022-05-14T18:45:10+05:30 IST

గత సంవత్సరం పుట్టిన రోజును సీఎం జగన్, సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ మరచిపోకుండా చేశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

గత ఏడాది పుట్టిన రోజు మరిచిపోకుండా చేశారు: MP Raghurama

న్యూఢిల్లీ: గత సంవత్సరం పుట్టిన రోజును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy), సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ (Sunil kumar) మరచిపోకుండా చేశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama krishnam raju) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత సంవత్సరం పుట్టిన రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను ఎంపీ మీడియాకు వెల్లడించారు. గత 18 సంవత్సరాల నుండి తన మిత్రుడు రామానాయుడు జరిపేవారని తెలిపారు. ‘‘నాపై సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి నన్ను అరెస్ట్ చేయించారు. సీఐడీ గుంటూరు ఆఫీసులో కెమెరాలు తీసివేసి, నా వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్‌ కుమార్ కుట్రపన్ని నాపై దాడి చేసారు. పోలీసులు నాపై చేసిన దాడిని లైవ్ ద్వారా ఉన్మాదికి చూపించారు. పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం వేసింది. దాడి సంధర్భంగా నాపై దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఆరోజు రాత్రి 11:45 గంటల నుండి 12:10 గంటల వరకు విచక్షణారహితంగా కొట్టారు. సినిమాలో కూడా నాపై దారిచేసిన విధంగా సన్నివేశాలు ఉండవు. ముఖ్యమంత్రి , సునీల్‌ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులు. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా భయభ్రాంతులకు గురయ్యాను. కాళ్లు వాచిపోయేలా కొట్టారు. నన్ను కొట్టిన దెబ్బలకు మరుసటిరోజు వక్రభాష్యాలు చెప్పారు. గత సంవత్సరం నా పుట్టినరోజును మరపురాని పుట్టినరోజుగా చేసిన ఉన్మాదికి ధన్యవాదాలు’’ అంటూ వ్యాఖ్యానించారు.


బదులు తీర్చేస్తా....

‘‘గత సంవత్సరం పుట్టినరోజును మరపురాని రోజుగా చేసిన విషయాన్ని ఉంచుకోను, బదులు తీర్చేస్తాను. నావెంట ప్రజలు ఉన్నారు. సరియైన సమయంలో ముఖ్యమంత్రి కి సమాధానం చెబుతాను. గాయని జానకి, కేంద్ర హోం మంత్రి స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అమిత్ షా ఫోన్ చేసి చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఢిల్లీలో జన్మదిన వేడుకలు జరుపుకునే ఏకైక ఎంపి నేనే! సాధారణంగా ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఉంటారు. నాకు జరిగిన టార్చర్ భవిష్యత్‌లో ఎవరికి జరగకూడదు. రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది. దీనికి కారణం ప్రజలు ఆలోచించాలి. నాపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు ఒక సంవత్సరం పూర్తయింది. లెక్కల ప్రకారం 60వ పుట్టినరోజు కానీ జగన్ పుణ్యం వల్ల ఇది మొదటి పుట్టిన రోజు. 60వ మొదటి పుట్టిన రోజులు ఒకే రోజు జరుపుకోవడానికి సహకరించిన ముఖ్యమంత్రి బృందానికి కృతజ్ఞతలు. నాపై జరిగిన దాడి గురించి లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టులో ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత కదలిక ఉండవచ్చు. మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణాపై కూడా నాపై  కేసును పెట్టారు. ఆమెను విచారణకు పిలిచారు. నన్ను కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పిలుస్తారేమో!’’ అని అన్నారు.


చంద్రబాబు, పవన్ మధ్య పొత్తులు ఉంటాయి....

నిజం చెప్పే పత్రికలు ముఖ్యమంత్రి దృష్టిలో విషపత్రికలు అని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి భయంతో వివిధ సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గడపగడపకి వస్తున్న తీవ్ర ప్రతిస్పందన చూస్తే… ప్రజలు  పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు ఎంత కవ్వించినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బెదరరని స్పష్టం చేశారు. రాక్షస వధ ప్రజాసంక్షేమం కోసం జరగాలని, దీనికోసం రాజకీయాల్లో కొంతమంది కలయికలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని తెలిపారు. తన జీవితంలో జగన్ పుణ్యం వల్ల మొదటిసారి పోలీసుల చేతుల్లో ఎంపీగా ఉండి దెబ్బలు తిన్నానని అన్నారు.


పార్టీ పెట్టే యోచన లేదు...

సొంత పార్టీ పెట్టడటంపై ఎంపీ స్పందిస్తూ...‘‘నాకు పార్టీ పెట్టే ఆలోచన లేదు. అలెయిన్స్‌లో ఉండే పార్టీలో మాత్రం ఉంటాను. అలెయిన్స్‌లో రెండు లేదా మూడు పార్టీలు ఉండవచ్చు. నాకు వైసీపీలో ఇక టికెట్ ఇవ్వరు, నేను ప్రస్తుత పార్టీలో కొనసాగే అవకాశం లేదు. రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున కేంద్రం నుండి కొన్ని నిధులు ఇచ్చారు. భవిష్యత్తులో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. నిబంధనలు విరుద్ధంగా వివిధ బ్యాంకులు లోన్ ఇస్తున్న విషయాన్ని బ్యాకింగ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తాను. రాష్ట్రపతి ఎన్నికల్లో మా పార్టీ అవసరం ఉండదు. జూలై నాటికి మా పార్టీ ఖేల్ ఖతం, ఆ తర్వాత పప్పులు ఉడకవు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని మంత్రి గుడివాడ అమర్ నాథ్ రెడ్డిని తీసుకుని ముఖ్యమంత్రి దావోస్ వెళుతున్నారు. ఎవరితో కూడా చేతులు కట్టుకుని ఫొటో దిగవద్దని పవన్ కళ్యాణ్‌ను వినమ్రంగా కోరుతున్నాను. నాపై అనర్హత వేటు వేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. గతంలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ప్రస్తుత సీఎం విమర్శించే వారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన  విజ్ఞాన, వినోద యాత్ర’’ అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.  

Read more