Advertisement

వేరే పార్టీ షోకాజ్‌కు.. ఎలా బదులిస్తాను?

Jun 30 2020 @ 03:07AM

  • సీఎంకు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
  • రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడలేదని నోటీసిస్తారా?
  • రాజ్యాంగాన్ని ధిక్కరించే పార్టీని
  • ఎన్నికల సంఘం రద్దు చేయొచ్చు
  • రాజ్యసభ సభ్యుడైన విజయసాయి
  • లోక్‌సభ ఎంపీకి నోటీసివ్వడమా?
  • మంత్రులు మాట్లాడాకే ఇసుక, స్థలాల అక్రమాలు ప్రస్తావించా


అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వేరే రాజకీయ పార్టీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు తానెలా సమాధానమిస్తానని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. లోక్‌సభ సభ్యుడిగా బాధ్యతలు తీసుకునే సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేసిన తనకు.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదంటూ షోకాజ్‌ ఇవ్వడంలో న్యాయముందా అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే పార్టీని కేంద్ర ఎన్నికల కమిషన్‌ రద్దు చేయొచ్చన్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి తనకు నోటీసు పంపడంపై రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి సోమవారం ఆరు పేజీల లేఖ రాశారు. తిరుమలేశుడి భక్తులు కానుకగా ఇచ్చిన భూములు విక్రయిస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయని తాను అనడం క్రైస్తవ మతానికి వ్యతిరేకమెలా అవుతుందని అందులో ప్రశ్నించారు. ఇసుక కొరత, ఇళ్ల స్థలాల్లో అవినీతిపై సంబంధిత మంత్రులు మాట్లాడిన తర్వాతే తాను స్పందించానని.. ముందు మాట్లాడినవారిని వదిలేసి వెనుక వరుసలో ఉన్న తనకు షోకాజ్‌ నోటీసేమిటని అడిగారు.


లేఖ ప్రారంభంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుల వారికి అని సంబోఽధించారు. ఇటీవల పాపులర్‌ సీఎంలపై ‘సీ-ఓటర్‌’ సర్వేలో నాలుగో స్థానంలో నిలిచినందుకు జగన్‌ను అభినందించారు. అతి త్వరలోనే అందరి కంటే ఆయన ముందంజలో ఉంటారన్న ఆకాంక్ష వ్యక్తంచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నానంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నుంచి తనకు లేఖ అందిందని.. అందులో తన వ్యక్తిత్వం, బహిరంగ ప్రకటనలను ఆక్షేపించారని తప్పుబట్టారు. అయినా రాజ్యసభ సభ్యుడు.. లోక్‌సభ ఎంపీనైన తనకెలా నోటీసు ఇస్తారని ప్రశ్నించారు. ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలివీ..


వేరే పార్టీ లెటర్‌హెడ్‌ ఎలా?

‘విజయసాయిరెడ్డి లేఖ రాసేందుకు ఉపయోగించిన లెటర్‌ హెడ్‌.. సారూప్యత కలిగిన మరో రాజకీయ పార్టీ పేరుతో ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే దిశానిర్దేశం చేసినా.. మన పార్టీకి సారూప్యత కలిగిన మరో పార్టీ లెటర్‌ హెడ్‌పై విజయసాయిరెడ్డి లేఖ రాశారు. పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా వేరే పార్టీ పేరిట వచ్చిన షోకాజ్‌ నోటీసుకు ఎలా సమాధానం ఇస్తాను?


మనోభావాలు దెబ్బతినకూడదనడం తప్పా?

‘టీటీడీ ఆస్తుల విక్రయంపై భక్తుల మనోభావాలకు అనుగుణంగా బహిరంగంగా మాట్లాడాను. మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సూచించడం తప్పెలా అవుతుంది? నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకమంటూ మీ (జగన్‌) చుట్టూ ఉన్న కొంద రు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా.. కులం, మతం, వర్గం, వర్ణం, సంప్రదాయాలన్నిటినీ గౌరవిస్తాను. ఇదే సందర్భంలో తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములు, ఆస్తులు విక్రయిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించాను. ఇది క్రైస్తవ మతానికి వ్యతిరేకమెలా అవుతుంది?’


లోక్‌సభ ప్రసంగంపై వివరణ ఇచ్చాను కదా!

‘వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యత్వం స్వీకరించే సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేశాను. ఈ మేరకు రాజ్యాంగానికి అనుగుణంగా 350, 350ఏ అధికరణల కింద మాతృభాషపై లోక్‌సభలో ప్రసంగించాను. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం 29 ఏ(5) ప్రకారం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. విజయసాయిరెడ్డి నాకు రాసిన లేఖలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తే ప్రశంసించాలి గానీ.. దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదంటూ తప్పుబడుతూ నోటీసు ఇస్తారా? లోక్‌సభలో చేసిన ప్రసంగంపై స్వయంగా మీకు వివరణ ఇచ్చాక.. మళ్లీ నోటీసు ఇవ్వడం ఏమిటి?


రాజ్యాంగాన్ని ధిక్కరించే పార్టీని కమిషన్‌ రద్దు చేయొచ్చు కూడా. వ్యక్తిగతంగా నన్ను కించపరిచేలా మార్ఫింగ్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిని మీ దృష్టికి తీసుకెళ్లాలని మీ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వర్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డిని కోరాను. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనందున.. పశ్చిమగోదావరి జిల్లా వాసిగా.. ప్రత్యేక రుచులతో ఢిల్లీలో పార్లమెంటు సభ్యులకు ఆతిథ్యమిచ్చాను. ఈ విందుకు బీజేపీ సహా పార్టీలకు అతీతంగా ఎంపీలు హాజరయ్యారు.’


రాయలసీమ నుంచి బెదిరింపులు..

‘మా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నన్ను దూషిస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. నాకూ అదే గతి పడుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. రాయలసీమ, విదేశాలకు చెందిన ఒక సామాజికవర్గం వారి నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. వీటిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశాను. డీజీపీతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ మాట వినిపించుకునే పరిస్థితుల్లో ఆయన లేరు. అందుకే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌  ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశాను.’


వారిద్దరూ మొదట మాట్లాడాకే..

‘ఇళ్ల స్థలాలకు భూసేకరణలో అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు.. రెండు లక్షల టన్నుల, ఇసుక పక్కదారి పట్టిందని గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాకే నేను ఆ సమస్యలను మీ దృష్టికి తెచ్చేందుకు పలు మాధ్యమాల్లో మాట్లాడాను. ప్రధాని మోదీతో మీరు గతంలో సమావేశమైన సమయంలో నేను మద్యం సేవించి.. అసభ్యంగా ప్రవర్తించానని గ్రేట్‌ ఆంధ్రలో రాశారు. నన్ను మీరు మందలించారని కూడా ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకే నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను చేస్తున్నానన్నారు. అసత్య వార్తలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సభాహక్కుల నోటీసు కూడా అందజేశాను. నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి వినయ విధేయుడిని. పార్టీ అధ్యక్షుడు, సీఎం అయిన మీకు విధేయుడిని. నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.’


లేఖ ముందు వాయిస్‌ మెసేజ్‌

మోదీపై గీతాన్ని వాట్సా్‌పలో పంపిన రఘురామరాజు..

బీజేపీలోకి వెళ్తారంటూ మీడియాలో మోత

ఓపక్క వేడెక్కిన రాజకీయ వాతావరణం.. తనకు పంపిన షోకాజ్‌ నోటీసుపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌కు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పంపే లేఖలో ఏం రాస్తారా అని వైసీపీ ముఖ్య నేతలు, రాజకీయ విశ్లేషకుల్లో ఎనలేని ఆసక్తి.. ఇంకో పావుగంటలో ఆయన సీఎంకు లేఖ పంపుతారనుకుంటున్న సమయంలో.. అకస్మాత్తుగా ఆయన వాట్సాప్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌ వచ్చింది. అందరూ ఆత్రంగా ఓపెన్‌ చేశారు. అంతే.. అప్పుడెప్పుడో జయం మనది జయం మనది అంటూ ఘంటసాల పాడిన పాటకు పేరడీ వినపడింది. ప్రధాని మోదీని కీర్తిస్తున్న గీతమది. రఘురామకృష్ణంరాజు బీజేపీలోకి వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు అనుకుంటున్న సమయంలో ఈ పాట వాయిస్‌ మెసేజ్‌ రూపంలో రావడంతో.. మీడియా చర్చంతా దానిపైకి మళ్లింది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమేనని పలు విశ్లేషణలు వెలువడ్డాయి. ఇదంతా జరుగుతుండగానే.. సరిగ్గా 12 గంటలకు రఘురామకృష్ణంరాజు సీఎంకు లేఖ పంపేశారు. మీడియాకూ విడుదలైంది. అయినా పలు చానళ్లు ఆ పాటను చాలాసేపు విశ్లేషిస్తూనే వచ్చాయి. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.