పెద్దల సభకు.. పెరిగిన పోటీ

ABN , First Publish Date - 2022-05-19T17:57:13+05:30 IST

శాసనసభ్యులనుంచి విధానపరిషత్‌ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉండడంతో లాబీయింగ్‌ జోరందుకుంది.

పెద్దల సభకు.. పెరిగిన పోటీ

                 - పరిషత్‌ స్థానాల కోసం Congressలో జోరుగా లాబీయింగ్‌ 

  

బెంగళూరు: శాసనసభ్యుల నుంచి విధానపరిషత్‌ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉండడంతో లాబీయింగ్‌ జోరందుకుంది. ఉదయ్‌పూర్‌లో ‘కాంగ్రెస్‌ చింతన్‌’ శిబిరం ముగించుకుని సిద్దరామయ్య మంగళవారం బెంగళూరుకు వెనుదిరిగి రాగా పలువురు రాత్రి పొద్దుపోయేదాకా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చింతన్‌ శిబిరం తర్వాత కేదార్‌నాథ్‌ యాత్రను ముగించుకుని బుధవారం బెంగళూరుకు చేరుకున్నారు. ఆ యనను పలువురు భేటీ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ కు రెండు స్థానాలలో గెలుపొందే అవకాశం ఉండడంతో ఆశావహులు అత్యధికంగానే ఉన్నారు. నివేదిత ఆళ్వా, మాజీ ఎమ్మెల్సీ ఐవాన్‌ డిసౌజా, ఎండీ లక్ష్మినారాయణ, రెహమాన్‌ఖాన్‌ కుమారుడు మన్సూర్‌ అలీఖాన్‌లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రెండింట ఒకటిని మైనారిటీలకు, మరొక స్థానాన్ని మహిళలకు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హైకమాండ్‌ గానీ, రాష్ట్ర కమిటీగానీ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. మైనారిటీలకు ఒక స్థానం అంటే నివేదితా ఆళ్వా లేదా ఐవాన్‌ డిసౌజాలు ఇవ్వవచ్చు. కాగా వీణ్ణ అచ్చయ్య పదవీకాలం ముగియడంతో భర్తీ చేసే స్థానమైనందున మహిళలకే ఇవ్వాలనే అంశం కూడా చర్చ జరుగుతోంది. పరిషత్‌ మాజీ ప్రతిపక్షనేత ఎస్‌ఆర్‌ పాటిల్‌ కూడా స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల పేర్లను ఈనెల 22న ఖరారు చేస్తామని పార్టీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌ వెల్లడించారు. విధానపరిషత్‌లోని 7 స్థానాలకు జూన్‌ 3న ఓటింగ్‌ జరుగనుంది. నామినేషన్‌ల దాఖలుకు ఈనెల 24వ తేదీ చివరి కాగా పరిశీలనలు, ఉపసంహరణలకు 27 వరకు గడువు ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్‌ జరుగనుండగా అదేరోజు కౌంటింగ్‌ సాగనుంది. 





Updated Date - 2022-05-19T17:57:13+05:30 IST