SI చేత సెల్యూట్ కొట్టించుకుని వివాదంలో ఇరుకున్న ఎంపీ

ABN , First Publish Date - 2021-09-16T21:52:53+05:30 IST

గతంలో త్రిస్సూర్ మేయర్ ఎంకే వర్గీస్ కూడా ఇలాంటి ఫిర్యాదు ఇచ్చారు. తనకు పోలీసు అధికారులు తనకు సెల్యూట్ చేయడం లేదని కేరళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే కేరళ పోలీసు అధికారుల అసోసియేషన్ స్టాండింగ్ ఆర్డర్స్‌ను మేయర్‌కి తెలియజేసినట్లు డీజీపీ తెలిపారు..

SI చేత సెల్యూట్ కొట్టించుకుని వివాదంలో ఇరుకున్న ఎంపీ

తిరువనంతపురం: రాజ్యసభ ఎంపీ, నటుడు సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం ఒక ఎస్‌ఐ చేత అడిగి మరీ సెల్యూట్ కొట్టించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎంపీ సురేష్ గోపి బుధవారం కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు జిల్లాలోని పుతూర్‌ను సందర్శించినప్పుడు ఈ ఘటన జరిగింది.


అనాకుజి ప్రాంతంలో చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. అయితే స్థానికులు ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకురావడంతో, ఆయన ఫిర్యాదు ఇవ్వడానికి ఫారెస్ట్ పోలీసుల వద్దకు వెళ్లారు. అయితే ఎంపీ ఫిర్యాదు ఇస్తున్న సమయంలో ఎస్ఐ సీజే ఆంటోని జీపులో కూర్చొని ఉన్నారు. ‘‘ఎంపీకి కనీసం సెల్యూట్ చేయాలని తెలియదా?’’ అని సురేష్ గోపీ అనగానే.. ఎస్ వెంటనే జీపు నుంచి దిగి సెల్యూట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


కాగా, ఈ విషయమై ఎంపీ సురేష్ గోపి వివరణ ఇచ్చుకొచ్చారు. ‘‘నేను సదరు అధికారిని కలిసినప్పుడు ఆయన జీపులో కూర్చొని ఉన్నారు. నేను ఆయనను సర్ అని మర్యాదపూర్వకంగా సంబోధించాను. ఆయన కూడా నన్ను అలాగే సంబోధించారు. నేను సెల్యూట్ కొట్టించుకోవడానికి అర్హుడిని. నేను ఎంపీని. పోలీసులు ఎంపీకి సెల్యూట్ చేయాలని రాజ్యసభ సెక్రెటేరియట్ ద్వారా తెలుసుకున్నాను’’ అని సమాధానం ఇచ్చారు. అయితే కేరళ పోలీసు అధికారుల అసోసియేషన్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు మినహా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


ఇకపోతే ఈ విషయమై జే జయనాథ్ అనే ఐపీఎస్ అధికారి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మాటల్ని ప్రస్తావించారు. ‘‘మీ పనిని మీరు గౌరవిస్తే ఎవరికీ సలాం కొట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీ పనిని మీరు పొల్యూట్ చేస్తే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేయాలి’’ అని ఓ సభలో అబ్దుల్ కలాం చెప్పిన మాటల్ని జయనాథ్ రాసుకొచ్చారు. ఇక గతంలో త్రిస్సూర్ మేయర్ ఎంకే వర్గీస్ కూడా ఇలాంటి ఫిర్యాదు ఇచ్చారు. తనకు పోలీసు అధికారులు తనకు సెల్యూట్ చేయడం లేదని కేరళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే కేరళ పోలీసు అధికారుల అసోసియేషన్ స్టాండింగ్ ఆర్డర్స్‌ను మేయర్‌కి తెలియజేసినట్లు డీజీపీ తెలిపారు.

Updated Date - 2021-09-16T21:52:53+05:30 IST