ఎన్నికల్లో లబ్ధి కోసం.. ప్రజాధనం మళ్లిస్తారా?

ABN , First Publish Date - 2020-12-03T09:18:29+05:30 IST

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉచిత పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలోని కార్పొరేషన్ల నిధులను మళ్లిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు

ఎన్నికల్లో లబ్ధి కోసం.. ప్రజాధనం మళ్లిస్తారా?

రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఎంపీ సురేశ్‌ ప్రభు ఆక్షేపణ

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కఠినంగా అమలు చేయాలి

బ్యాంకు రుణాలు కూడా సిబిల్‌ పరిమితులు దాటకూడదు

ఏపీ చాంబర్‌ డైరెక్టర్‌ సూచనలు పాటించాలి

కేంద్ర మంత్రులు నిర్మల, పీయూ్‌షలకు లేఖలు


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉచిత పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలోని కార్పొరేషన్ల నిధులను మళ్లిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు ఆక్షేపించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆయన బుధవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్‌ ఓ.నరేశ్‌కుమార్‌ ఇటీవల తనకు లేఖ రాశారంటూ దానిని తన లేఖలతో జతచేశారు. ‘రాష్ట్రప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్న నిధులకు సంబంధించి నరేశ్‌కుమార్‌ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అవి తమ పాపులారిటీ పెంచుకోవడానికి రాష్ట్రాల అధీనంలోని కార్పొరేషన్ల నిధులను ఉచిత స్కీములకు మళ్లిస్తున్నారని తెలిపారు.


ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వాలు తీసుకునే అన్ని రుణాలకు.. రిజిస్ట్రేషన్‌ విలువకు 200 శాతం ఎక్కువ విలువ గల భూములను గ్యారెంటీగా ఇవ్వాలని.. వాటిని తనఖాపెట్టాలని కూడా తెలిపారు. సంవత్సరాలవారీగా ప్రభుత్వాల రుణం చెల్లింపు సామర్థ్యాన్ని కూడా అందులో ప్రస్తావించాలని, రుణాలు కూడా సిబిల్‌ పరిమితిని దాటరాదని అన్నారు. ఎన్నికల్లో లబ్ధికి రాష్ట్రప్రభుత్వాలు ప్రజాధనాన్ని మళ్లిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నరేశ్‌కుమార్‌ సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పరిస్థితి చేజారకముందే కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ప్రభు తన లేఖల్లో సూచించారు.

Updated Date - 2020-12-03T09:18:29+05:30 IST